(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పోరులో ఏకగ్రీవాలే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. అత్యధిక ఏకగ్రీవాలు సాధించడం ద్వారా తమ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించొచ్చని అధికార పార్టీ వైసీపీ భావిస్తూ .. ఆ బాధ్యత రాష్ట్రంలోని ఆయా జిల్లా ఇన్చార్జి మంత్రులకు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే తరుణంలో ఏకగ్రీవాల్లో ఎటువంటి మతలబులు లేకుండా ఎక్కడికక్కడ నివారిస్తూ .. అవసరమైతే ప్రత్యక్ష పోరుకు సిద్ధమైతే మంచి ఫలితాలు ఉండవచ్చని ప్రతిపక్ష టీడీపీ భావిస్తోంది. ఆ విధంగా పార్టీ కేడర్ ను అధినేత దిశానిర్దేశం చేశారు. దాంతో పార్టీ రహితంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నా.. ప్రధాన రాజకీయ పార్టీలు వీటిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
ఏకగ్రీవాలతో ప్రశాంతత..
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరులో ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి ఏకగ్రీవాలపైనే ఉంది. ఏకగ్రీవాలతో గ్రామాలలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని, ఏకగ్రీవాలు ఎన్ని ఎక్కువ అయితే అంత మంచిదని అధికార వైసిపి అంటోంది. ఏకగ్రీవాలు జరిగే గ్రామ పంచాయతీలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయితే అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతుంది అంటూ ప్రతిపక్ష పార్టీలు ఏకగ్రీవాలపై విముఖతను వ్యక్తం చేస్తూ, ఎన్నికల సంఘాన్ని ఏకగ్రీవాలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. మరోపక్క రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా ఏకగ్రీవాలు జరుగుతున్న గ్రామ పంచాయతీలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని వాటిని పరిశీలించాలని అధికారులను కోరారు.
సత్తా చూపేందుకు ..
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరులో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ సత్తా చూపించాలని, గ్రామస్థాయిలో పార్టీ జెండా ఎగురవేయాలని తెగ ప్రయత్నం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని చెబుతూనే, రాజకీయాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కువ గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేయగలిగితే, అధికార పార్టీ తమ పట్టు కొనసాగుతుంది అనే అభిప్రాయంలో ఉంది . ఎన్నికల్లో హోరాహోరీగా తలపడే కంటే సాధ్యమైనంత వరకూ ఏకగ్రీవం చేయాలని, అలా ఏకగ్రీవం చేయగలిగితే గ్రామాలలో ఫ్యాక్షనిజం, విభేదాలు ఉండవు అంటూ వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.ఎంత ఎక్కువ ఏకగ్రీవాలు చేయగలిగితే, అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అంటూ చెప్తున్నారు.
Must Read ;- బెదిరింపులు.. వైసీపీకి ఓటేయకపోతే రేషన్, పింఛన్ కట్ !
ఎన్నికలు జరిగితే వైసీపీ ఓటమి : టీడీపీ
ప్రతిపక్ష టీడీపీ మాత్రం బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది. కరోనా కు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీ , జడ్పిటిసి సభ్యులు చాలా స్థానాలలో ఏకగ్రీవమయ్యారు. అయితే పోటీ చేయకుండా ప్రతిపక్ష నేతలను బెదిరించి, కిడ్నాప్ చేసి, నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుని, దాడులు చేసి బలవంతపు ఏకగ్రీవాలు చేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలలో కూడా బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడే అవకాశముందని, ఏకగ్రీవాలు కాకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే వైసీపీ ఓటమి పాలు అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్నారు.
బీజేపీ , జనసేన ఆందోళన
బీజేపీ, జనసేనలు సైతం గత ఘటనల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఏకగ్రీవాల విషయంలో అధికార పార్టీ నేతల మాటలు .. కనీవినీ ఎరుగని విధంగా ఏకగ్రీవాలపై పత్రికల్లో ఇస్తున్న ప్రకటనలు పలు అనుమానాలకు కారణమవుతున్నాయి అని ఆరోపిస్తున్నాయి. ఏకగ్రీవాల పేరుతో సాధ్యమైనంత పంచాయతీలను చేజిక్కించుకునే ఎత్తుగడతో వైసిపి ముందుకు వెళుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై గవర్నర్ ను కలిసి .. ఏకగ్రీవాల పేరుతో అధికార పార్టీ గతంలో ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరించి, భయపెట్టి బలవంతపు ఏకగ్రీవాలు చేసిందని, ఈసారి అలా జరక్కుండా చూడాలని విజ్ఞప్తి చేసేందుకు నిర్ణయించాయి. శాంతియుతంగా ఎన్నికలు జరిపించాలని కోరుతున్నాయి.
ఏకగ్రీవాలపై ఈసీ ప్రత్యేక దృష్టి
బలవంతపు ఏకగ్రీవాల ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో, గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఈసారి ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్న ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ .. ఏకగ్రీవం అయిన గ్రామ పంచాయతీలను అధికారులు పరిశీలించాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఏకగ్రీవం అయితేనే అంగీకరించాలని, అలా కాకుండా ఎవరైనా బలవంతపు ఏకగ్రీవ లకు పాల్పడితే వ్యతిరేకించాలని అధికారులకు సూచించారు.
మొత్తంమీద ..
రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల పోరు ఏకగ్రీవాలు చుట్టూ తిరుగుతుంది. గ్రామ పంచాయతీలు ఎక్కువ ఏకగ్రీవాలు అయితే అది అధికార పార్టీకి లాభిస్తుంది. అలాకాక ఎన్నికలకు వెళితే ప్రతిపక్ష పార్టీలు తమకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలు కీలక భూమికను పోషించనున్నాయి. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.
Also Read ;- ఏకగ్రీవానికి జై కొట్టకుంటే.. సంగతి తేలుస్తారంతే!