ఏ ముహూర్తాన జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యలు స్వీకరించారో గానీ.. ఎక్కడా లేని వింతలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. ఓ ముఖ్యమంత్రి తన బాధ్యతలను విస్మరించి ప్రవర్తిస్తే.. ఏం జరుగుతుందో.. ఏపీ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఆయనకు తన అధికార పరిధి ఏంటో తెలియకపోవడం, చెప్పేవారు కూడా లేకపోవడం ఈ పరిస్థితికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన న్యాయ వ్యవస్థను గౌరవించకుండా, రాజ్యాంగ వ్యవస్థలను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారన్నది వారి అభిప్రాయం.
అన్నింటా ఎదురుదెబ్బలే.. మొట్టికాయలే..!
రాష్ట్ర ఆదాయం పెంపు, అభివృద్ధి మాటలను గాలికి వదిలేసి.. కేవలం కక్ష సాధింపులకే తన పదవీకాలాన్ని వినియోగిస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వ్యవస్థతో యుద్ధం చేయడానికే విలువైన రెండేళ్ల సమయం గడిచిపోయింది. ఈ క్రమంలో.. అన్నింట్లోనూ ఎదురుదెబ్బలే.. మొట్టికాయలే. ఆయన చర్యల వల్ల నష్టపోతోంది ఓ రాష్ట్రం. పరువు పోగొట్టుకుంటోంది.. తెలుగువాడు. ఎన్ని విషయాల్లో ఎంతగా నవ్వులపాలైనా.. ఆయనలో మాత్రం కిచిత్ పశ్చాత్తాపం కూడా కనబడడంలేదు. మార్పు ఏ కోశానా మొదలవడం లేదు. ఇందుకు తాజాగా ఓ ఘటనే ఉదాహరణ.
కాపీ చేయడం కూడా రాదా!
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ప్రభుత్వపరంగా తన బాకా పత్రికల్లో ఆయన ఇచ్చుకున్న ప్రకటనే! ఏకగ్రీవాలు చేసుకుంటే.. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ఆయన ఘనంగా ప్రకటించుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ.. ఇందుకు ఈసీ అనుమతి అవసరం అన్న సలహా కూడా ఆయనకు ఎవరూ ఇవ్వకపోవడం దురదృష్టకరం. దీనిపైనే ప్రస్తుతం నిమ్మగడ్డ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే.. ఈ విషయం అలా ఉంచితే.. ఆ ప్రకటన కూడా ఆంధ్రుడిని నవ్వులపాలు చేసేలా ఉండడమే ఇక్కడ అభ్యంతరకరం. ఆ ప్రకటనలో వాడిన పంచాయతీ భవనం ఫొటో.. తెలంగాణలోనిది కావడం గమనార్హం. ఆ భవనంపై స్పష్టంగా తెలంగాణ లోగో కనిపిస్తోంది. కాపీ కొట్టడం కూడా సరిగా రాని మన జగనోరి పాలనలో.. మరెన్ని చిత్రాలు చూడాల్సివస్తుందో!
Must Read ;- దక్షిణాదిలో జగన్ సర్కార్ నెం.1! ఎలాగంటే..
మండిపడ్డ నిమ్మగడ్డ..
పట్టుబట్టి మరీ పంతం నెగ్గించుకుని పంచాయతీ పోరు నిర్వహణకు సమాయత్తమవుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. జగన్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. ఇప్పుడు తాజాగా.. ఏకగ్రీవంగా పంచాయతీ సర్పంచ్‌లను ఎన్నుకోవాలని బుధవారం పలు పత్రికల్లో ప్రభుత్వం తరఫున రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ ప్రకటనలివ్వడాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తప్పుబట్టారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని ఆ శాఖ కమిషనర్‌కు గురువారం ఆదేశాలు జారీచేశారు. దీనిపై పలు రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిమ్మగడ్డ స్పందించారు. ‘ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు, ప్రభుత్వం తరఫున శాఖలు కొత్తగా చేయదలచుకున్న పనులకు ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకోవాలి. దీనిపై ఐ అండ్ పీఆర్ కమిషనర్ సంజాయిషీ ఇవ్వాలి. ఇక ముందు అనుమతి తీసుకునే కొత్త కార్యక్రమాలను, వాటిపై పత్రికా ప్రకటనలను ఇవ్వాలి’ అని స్పష్టం చేశారు.
Also Read ;- సజ్జల : భయపడుతున్నారా.. భయపెడుతున్నారా?
వింత చేష్టలు.. విచిత్ర ప్రకటనలు
ఇలా ఏకగ్రీవాల ప్రకటన వివాదం రేపితే, ఆ ప్రకటన తీరే ఇప్పుడు విమర్శలను మూటగట్టుకొంటోంది. ఏకగీవ్ర ఎన్నికలయ్యే గ్రామ పంచాయతీలకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాలకు సంబంధించి పది నెలల క్రితం ఇచ్చిన జీవోలోని అంశాలనే పొల్లు పోకుండా చేర్చి తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో జారీచేసిన విషయం తెలిసిందే. దాని ఆధారంగా బుధవారం జగన్ సర్కారు సీఎం సొంత పత్రికకు, అనుకూల మీడియాకు కోట్లాది రూపాయల విలువైన మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చింది. ‘ఇవి పార్టీ రహిత ఎన్నికలు. ఇవి మన పంచాయతీ ఎన్నికలు’ అంటూ ప్రభుత్వం పేర్కొంటూ దాని కిందే ఓ పంచాయతీ కార్యాలయం ఫొటో వేసింది. అది ఏపీకి చెందినది కాదు. తెలంగాణలోని కరీనంగర్ జిల్లాకు చెందిన ఓ గ్రామ పంచాయతీ భవనం ఫొటో. 2019 ఫిబ్రవరి 5న ఒక ఆంగ్ల దినపత్రిక తెలంగాణలోని పంచాయతీ ఎన్నికల గురించి ఓ స్టోరీ ప్రచురించింది. అందులో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం ఫొటోను ప్రచురించింది. ప్రభుత్వం ఆ ఫొటోను కాపీ చేసి ఈ ప్రకటనలో వాడుకుంది. అయితే, ఇటీవలే దానిని పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్పుచేయడం గమనార్హం. ఫొటోను అచ్చం అలాగే వాడుకుంటే మరీబాగోదని అనుకున్నారేమో… గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా పేరును నీలం రంగుతో కప్పేశారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగోను (కాకతీయ తోరణం) మాత్రం అలాగే కొనసాగించారు. జగన్ సొంత మీడియా, అనుకూల మీడియాకు ఇచ్చిన ప్రకటనల్లోని పంచాయతీ కార్యాలయం భవనంపై తెలంగాణ అధికారిక లోగో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రభుత్వం పాట్లు..
ఏపీలో పంచాయతీ భవనాలు లేవా? ఉన్నా.. వాటిని వాడుకుంటే.. వాటిపై ఉన్న అధికార పార్టీ రంగులతో సమస్య వస్తుందని భావించి వదిలేశారా? లాంటి ప్రశ్నలు ఇప్పుడు అంతటా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసుకోవడం, దాన్ని కోర్టు తప్పుబడితే మార్చినట్టు న్యాయస్థానాన్నే ఏమార్చడం లాంటి ప్రభుత్వ చర్యల విషయం తెలిసిందే. అందువల్లనే ఇప్పుడు ఇక్కడి భవనాల ఫొటో వేస్తే మళ్లీ అదే సమస్య వస్తుందని భావించి తెలంగాణ ఫొటో వాడుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. నీలం రంగుతో ఆ ఫొటోను చాలా వరకు కప్పేసినా.. తెలంగాణ లోగో మాత్రం స్పష్టంగా కనిపిస్తుండడం విశేషం. ఇలాంటి చర్యలతో స్వయంగా సీఎం గారే ఆంధ్ర ప్రదేశ్ పరువు తీస్తున్నారని విమర్శిస్తున్నారు.
Also Read ;- ‘స్థానికం’పై ఎపీలో సమర భేరి.. క్లైమాక్స్‌పై సర్వత్రా ఆసక్తి!