ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. 168 మండలాల్లోని 3,249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డు మెంబర్ల ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ నేటి సాయంత్రం ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఎన్నికల నామినేషన్లు పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 4వ తేదీ 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 9 ఉదయం 9 నుంచి 3.30 గంటల వరకు పోలింగ్ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తారు. సర్పంచ్, వార్డు మెంబర్ల ఫలితాలు రాగానే ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేస్తారు.
బెదిరింపులు, బలవంతాల మధ్య
పంచాయతీ ఎన్నికల తొలివిడత నామినేషన్ల ప్రక్రియలో పెద్దగా హింస చోటు చేసుకోలేదనే చెప్పాలి. అయితే అధికారపార్టీ నేతల బెదరింపులు, అరాచకాలకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. ఏకగ్రీవాలు చేయాలంటూ వైసీపీ అధినేత మాటగా మంత్రులు బహిరంగంగా ప్రకటించడంతో అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు షాడోలుగా గ్రామ పంచాయతీ నామినేషన్ల ప్రక్రియలో చక్రం తిప్పారు. దీంతో అనేక ప్రాంతాల్లో గొడవలు చోటు చేసుకున్నాయి. కొన్ని గ్రామాల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను కిడ్నాప్ చేశారు. ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకోవడంతో వైసీపీ నేతలు కొంత జాగ్రత్త పడ్డారనే చెప్పవచ్చు.
అరాచకాలకు లెక్కేలేదు
ఏపీలో స్థానిక సంస్థల తొలిదశ నామినేషన్ల పర్వంలో 123 పంచాయతీల్లో గొడవలు చోటు చేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం హనుమంతునాయుడుపేట సచివాలయంలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గౌతమి నామినేషన్ పత్రాలను వైకాపా నేతలులు గుంజుకుని చించివేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జాయింట్ కలెక్టర్ వెంటనే స్పందించి బలగాలను దించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దొరబాబుపై వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. యాదమర్రి మండలంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించేందుకు దొరబాబు అక్కడకు చేరుకోగానే వైసీపీ కార్యకర్తలు ఆయన కారుపై రాళ్లదాడికి దిగారు. పోలీసులు ఆయనకు రక్షణ కల్పించి అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా ముప్పాళ్ల గ్రామంలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడికి యత్నించారు. పోలీసులు లాఠీ చార్జి చేసి గొడవలు జరగకుండా నివారించారు. ఇక ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం పెదగంజాం గ్రామంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థిని ఏకంగా వైసీపీ నాయకులు కిడ్నాప్ చేసి తరవాత వదిలేశారు.
Must Read ;- పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ దురాగతాలు..
కోడ్ ఉల్లంఘనలకు లెక్కేలేదు
ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికారపార్టీ నేతలు యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. విశాఖ జిల్లా యలమంచిలి మండలంలో అభ్యర్థులు ఊరేగింపుగా వచ్చి నామినేషన్లు దాఖలు చేసి కోడ్ ఉల్లంఘించారు. ఇక చీడికాడ మండలం తురువోలులో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఏకంగా వాలంటీర్ రంగంలోకి దిగారు. ఇక చిత్తూరు జిల్లాలో ఓ వైపు గ్రామ పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంటే మరోవైపు వైసీపీ నాయకులు ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టి యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘించారు. ప్రకాశం జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఫోటోను కూడా తొలగించలేదు. వైఎస్ విగ్రహాలకు ముసుగులు కూడా వేయలేదు.ః
వైసీపీకి ఓటు వేయకపోతే పింఛన్, రేషన్ కట్
వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు నేరుగా వాలంటీర్లు రంగంలోకి దిగారు. పింఛన్లు తీసుకుంటోన్న లబ్ధిదారులను బెదిరించిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయకపోతే పింఛను, రేషన్ కట్ చేస్తామని నేరుగా బెరింపులకు దిగుతున్నారు. కొందరు వాలంటీర్లు అయితే నేరుగా నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్నారు. వాలంటీర్లను స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఎస్ఈసీ ఆదేశించినా, వైసీపీ నాయకులు వాలంటీర్లనే రంగంలోకి దింపారు. వారి పరిధిలో వైసీపీకి మెజారిటీ రాకపోతే వాలంటీర్ ఉద్యోగం ఊడుతుందని వారిని కూడా పైస్థాయి నాయకులు హెచ్చరిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో వాలంటీర్లు గ్రామాల్లో చెలరేగిపోతున్నారు.
Also Read ;- పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి : ఎస్ఈసీ