రాజధాని అమరావతి ప్రాంత ప్రజలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల అమరావతిని వే*శ్యల రాజధాని అంటూ సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ కేసులో సా*క్షి యాంకర్ కొమ్మినేనితో పాటు కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు.
ఐతే ఈ అంశంపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి నోరు పారేసుకున్నారు. కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించకపోగా…ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లుగా మాట్లాడారు. కృష్ణంరాజు వ్యాఖ్యలపై నిరసన తెలిపిన అమరావతి ప్రాంత ప్రజలను సంకరజాతి అంటూ విషం కక్కారు. దీంతో అమరావతి రాజధాని రైతు దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష తాడేపల్లి పోలీసులకు సజ్జలపై ఫిర్యాదు చేశారు. దీంతో తనను కూడా అరెస్టు చేస్తారని సజ్జలకు భయం మొదలైంది. వెంటనే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు మెట్లు ఎక్కారు.
రాజకీయ వేధింపుల్లో భాగంగా నాపై తప్పుడు కేసులు పెట్టారని…ఆ వ్యాఖ్యల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఏ పోలీసు స్టేషన్లలోనైనా ఫిర్యాదులు చేస్తే వాటిలోనూ ముందస్తు బెయిలు మంజూరు చేయాలని సజ్జల పిటిషన్‌లో కోరారు. తాను అమాయకుడినని చెప్పుకొచ్చారు. ఇదే వ్యాఖ్యలపై శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయినా..శిరీష ఫిర్యాదు ఆధారంగా తనను అరెస్టు చేసేందుకు పోలీసు యంత్రాంగం చూస్తోందని..పోలీసు దర్యాప్తునకు అందుబాటులో ఉంటానని పిటిషన్‌లో వివరించారు సజ్జల. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని చెప్పారు. ప్రధాన బెయిల్ పిటిషన్ పరిష్కరించేంత వరకూ మధ్యంతర ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.











