సినిమా అంటేనే ఓ వివాదం. అసలు వివాదం లేకుంటే బిజినెస్ జరగదు అనేలా కూడా పరిస్థితి తయారైంది. ఒకరేమో నా కథ కాపీ కొట్టారంటారు. ఇంకొకరు నా పాటను లేపేశారు మహాప్రభో అంటారు.
సృజనాత్మక రంగంలో ఇలాంటి వివాదాలు కొత్త కాదు. సినిమా తొలినాళ్లలో వచ్చిన సినిమాలు పౌరాణిక కథలు కాబట్టి అది నాదేనని చెప్పే హక్కు ఎవరికీ ఉండేది కాదు. ఇప్పుడలా కాదు. అలాంటి ఆలోచన ఏ కథ తీసుకున్నా వివాదమవుతోంది. తాజాగా పాటల వివాదం మొదలైంది. మున్ముందు జానపద పాటలపై మరిన్ని వివాదాలు తలెత్తే ప్రమాదముంది. అసలు వివాదం ఉంటేనే మంచిది అనే ఆలోచన సినిమా వారికి వస్తోంది. ఏదైనా వివాదం తలెత్తితే అది పెద్ద వైరల్ అవుతోంది. తాజాగా శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’లోని ‘సారంగ దరియా’ పాట క్రెడిట్స్ తనకు దక్కాలంటూ కోమలి అనే జానపద గాయని టీవీల కెక్కింది.
బెదిరిపోవాలా? మురిసిపోవాలా?
సినిమాలో ఆ పాట రాసిన సుద్దాల అశోక్ తేజ కూడా ఆమె ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వివాదాలకు బెదిరిపోవాలో మురిసిపోవాలో కూడా తెలియడం లేదు. ఇదెక్కడి తలనొప్పిరా బాబూ అని శేఖర్ కమ్ముల కూడా మొదట్లో తలపట్టుకుని ఉండొచ్చు. కానీ ఈ వివాదం ఇంకా ముదిరి పాకానపడితేనే బాగుంటుంది అనేవారూ ఉన్నారు. ఎందుకంటే ఈ పాట యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతోంది. వారం రోజుల్లో 33 మిలియన్ల వ్యూస్ దక్కాయి. దీనికి కారణం పాటకు సహజంగా దక్కాల్సిన వ్యూస్ తో పాటు వివాదం కారణంగా వచ్చిన వ్యూస్ కూడా ఉన్నాయి. టీవీల్లో ఈ వివాదం మొదలయ్యాక అసలు ఏ పాటేంటో చూద్దామని ఎప్పుడూ పాటల జోలికి వెళ్లని వారు కూడా యూట్యూబ్ లో పాట వింటున్నారు.
యూట్యూబ్ లో సారంగ దరియా సంచలనం
ఫలితంగా ఈ పాటకు యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం బాగా పెరిగిపోయింది. ఈ వివాదం తమకు శాపంగా మారుతుందని భయపడినవారు ఇది కాస్తా వరంగా మారేసరికి మురిసిపోతున్నారు. ఇలా మంచి వివాదాన్ని రేపిన కోమలికి ఇంకా పెద్ద మొత్తం పరిహారంగా ఇస్తే పోయేదేముంది అనేవారు కూడా ఉన్నారు. ఈ పాట విషయం ఇలా ఉంటే ఇలాంటి మరికొన్ని పాటలపై వివాదాన్ని రేకెత్తిస్తే పోలా అన్న ఆలోచన కూడా ఇంకొందరికి వస్తోంది. సారంగ దరియా పాట వివాదం కోర్టు మెట్లు ఎక్కేదాకా వెళుతోంది.
పాట ఇలా వైరల్ కావాలంటే మంగ్లీతో పాడించడం మంచిదని దర్శకనిర్మాతలు భావించారు. కనీసం కోమలితోనైనా ఈ పాట పాడించి ఉంటే వివాదం తలెత్తేది కాదు. తెలిసోతెలియకో సుద్దాల అశోక్ తేజ ఈ వివాదంలో కూరుకుపోయారు. ఈ పాట తను 30 ఏళ్ల క్రితమే వాళ్ల అమ్మనుంచి విన్నానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం ఆయన చేసిన తప్పు. ఎందుకంటే ‘రేలారేలారే’ ఈయన జడ్జిగా వచ్చినప్పుడు అక్కడ తాను ఈ పాటలను మొదటిసారిగా విన్నానని పేర్కొన్నారు. సోషల్ మీడియా ఇంతలా పెరిగిపోయిన ఈరజుల్లో ఎక్కడేం మాట్లాడాల్సి వచ్చిన ఒళ్లు దగ్గర పెట్టుకోవాలసి ఈ సంఘటన రుజువు చేస్తోంది.
మరో విషయం ఏమిటంటే అసలు ఆ పాటను తొలిసారిగా పాడింది తనేనంటూ శిరీష అనే మరో జానపద గాయని అంటోంది. ఇదో కొత్త వివాదం. దీన్ని టీవీల్లో, సోషల్ మీడియాల్లో రాద్దాంత చేస్తే లాభపడేది ‘లవ్ స్టోరీ’ నిర్మాతలే. ఈ వివాదం ఎంత ముదిరితే అంత మంచిదని ఆ చిత్ర యూనిట్ అనుకుంటూ ఉండొచ్చు. మరి మున్ముందు ఇది ఇంకెలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.