సినీ షూటింగులకు కొన్ని నెలల కిందటే కేసీఆర్ సర్కారు అనుమతులు ఇచ్చినప్పటికీ.. ఎవ్వరూ అంత ధైర్యంగా షూటింగులు ప్రారంభించలేదు. అంతో ఇంతో పేరున్న హీరోలైతే.. పూర్తిగా ఇళ్లకే పరిమితం అయ్యారు. షూటింగుల జోలికి వెళ్లలేదు. నెమ్మదిగా కొవిడ వ్యాప్తి భయం తగ్గకపోయినప్పటికీ.. జాగ్రత్త చర్యలు ఫలితమిస్తున్నాయనే నమ్మకం చిక్కిన తర్వాత.. షూటింగులు నెమ్మదిగా మొదలయ్యాయి. ఈలోగా కేంద్రం కూడా షూటింగులపై నిషేధాజ్ఞలను ఎత్తేసి.. కొన్ని నిబంధనలను మాత్రం పెట్టింది.
జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి కావడంతో.. షూటింగులు మొదలైన చాలా చిత్రాలు స్టుడియో, సెట్ ల వరకు పరిమితం అవుతున్నాయి. హైదరాబాదునుంచి కదలకుండా కొన్ని ఇన్ డోర్ షూట్ లు కూడా చేస్తున్నారు. అవుట్ డోర్ లో పెద్ద సినిమాల షూటింగులు ఇంకా మొదలు కాలేదు. ఇలాంటి సమయంలోనే శర్వానంద్, రష్మిక మాత్రం ఏకంగా అవుట్ డోర్ వెళ్లిపోయారు.

‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ టైటిల్ తో ఓ సరికొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. టైటిల్ కాస్త పాత వాసన కొడుతున్నప్పటికీ కొత్త దనంతో తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీలక్ష్మి వేంకటేశ్వర బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు డైరెక్టర్ తిరుమల కిషోర్ కాగా , నిర్మాత చెరుకూరి సుధాకర్. ఈ సినిమా షూటింగ్ ను తిరుపతి సమీపంలోని ఆలయంలో ప్రారంభించారు.
తిరుపతి సమీపం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర ఆలయంలో విజయదశమి పర్వదినం అయిన ఆదివారం నాడు సినిమా షూటింగ్ మొదలైంది. ఈ చిత్రానికి స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు.
ప్రారంభోత్సవ వేడుకకు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, మేడా మల్లికార్జున రెడ్డి కూడా హాజరయ్యారు. మొత్తానికి శర్వానంద్, రష్మిక అవుట్ డోర్ షూటింగులో చురుగ్గా పాల్గొంటున్నారు. అదీ సంగతి.











