వానాకాలంలో వానలు పడటం కామన్.. సీజన్ అయిపోయాక కూడా కురవడమంటే మిరాకిల్. ఈ సారి తెలంగాణలో వర్షాలు వద్దంటే కురుస్తున్నాయి. వానాకాలం సీజన్ కు సంబంధించి కురవాల్సిన దానికంటే అదనంగా 50 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. సీజన్ ముగిసిన తర్వాత అక్టోబర్ మాసంలో కూడా వర్షం కుమ్ముతోంది. ఈ సారి వానలు అదరగొట్టాయి.
గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వానలు కుమ్మేశాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాల కాలాన్ని వానాకాలం సీజన్‌గా పరిగణిస్తారు. జూన్ నుంచి మొదలయ్యే ఈ సీజన్ సెప్టెంబర్ మాసం వరకు కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాల ఈ సీజన్‌లో తెలంగాణలో సాధారణ వర్షపాతం 720 మిల్లీమీటర్ల కురవాల్సి ఉండగా ఏకంగా 1078 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం మీద వానాకాలం సీజన్ కు సంబంధించి ఏకంగా 50 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.
అయితే.. వానాకాలం సీజన్ ముగిసిన తర్వాత కూడా వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు ముగిసిన తర్వాత ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమవుతాయి. ఈ సీజన్‌లో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ సారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అక్టోబర్ తగ్గుముఖం పట్టాల్సిన వర్షాలు.. ఏమాత్రం తగ్గడం లేదు సరికదా.. మరింతగా దంచికొడుతున్నాయి.
అక్టోబర్ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా సాధారణంగా 77.8 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. ఏకంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే ఏకంగా 97 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ జిల్లా లో అల్ టైం రికార్డు స్థాయిలో 323 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా లో 303 మిల్లీమీటర్ల, రంగారెడ్డి జిల్లాలో 226 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఇంతటి కుంభవృష్టిలో కూడా తెలంగాణ లోని రెండు జిల్లాల్లో మైనస్ వర్షపాతం నమోదు కావడం ఒక వండర్ అనే చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో సాధారణం కంటే 15 శాతం తక్కువ, నిజామాబాద్ జిల్లాలో సాధారణం కంటే 11 తక్కువ వర్షపాతం నమోదైంది.











