జేమ్స్ బాండ్ 007.. ఈ పేరు వినగానే గుర్తొచ్చే పేరు షాన్ కానరీ. జేమ్స్ బాండ్ పాత్రలకు ఆయనో బ్రాండ్ గానే చెప్పాల్సి ఉంటుంది. చెప్పాలంటే ఇది ఓ కాల్పనిక పాత్ర. ఇన్నేళ్లు గడిచినా ఇంకా ఈ పాత్ర జనంలో బతికే ఉంది.
ఇప్పటికీ ఈ పాత్ర పేరుతో జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాలు వస్తూనే ఉన్నాయి. అదీ ఈ పాత్రకున్న ప్రత్యేకత. ఈ పాత్ర స్ఫూర్తితో అనేక ఇతర భాషల్లోనూ రకరకాల పాత్రలు పుట్టాయి. ఇయాన్ ఫ్లెమింగ్ అనే రచయిత 1952లో ఈ పాత్రను సృష్టించాడు. 12 నవలల్లోనూ రెండు చిన్న కథల్లోనూ ఈ పాత్ర కనిపించింది. ఈ పాత్రను పోషించిన తొలి జేమ్స్ బాండ్ హీరో ఎవరు అనగానే ఒకతరం వారు ఠక్కున షాన్ కానరీ పేరును చెప్పేస్తారు. 90 ఏళ్ల వయసు.. 50 ఏళ్ల సినిమా కెరీర్.. ఇదీ క్లుప్తంగా షాన్ కానరీ గురించి. చాలాకాలంగా ఆయన జేమ్స్ బాండ్ పాత్రలకు దూరమైనా ఇప్పటికీ ఆ పాత్రను అంతలా మెప్పించిన నటులు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో రోగర్ మూర్ వస్తారు. నటుడిగా, నిర్మాతగా ఆయన హాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. బాండ్.. జేమ్స్ బాండ్ అంటూ తొలిసారి ఆ పాత్రతో మెప్పించడంతో ఆ బాండ్ చిత్రాల పరంపర మొదలైంది. వరుసగా ఆరు జేమ్స్ బాండ్ చిత్రాల్లో ఆయన నటించారు. డాక్టర్ నో, ఫ్రమ్ రష్యా విత్ లవ్, గోల్ ఫింగర్, థండర్ బాల్, యు ఓన్లీ లివ్ విత్ ట్వ్యైస్, డైమండ్స్ ఆర్ ఫరెవర్ చిత్రాల్లో ఆయన జేమ్స్ బాండ్ 007గా నటించారు. ఆయన ఆస్కార్ అవార్డు విజేత కూడా. ది అన్ టచ్ బుల్స్ చిత్రంలోని నటనకు ఆయన ఈ అవార్డును అందుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులూ ఈ పాత్రకు దగ్గరవడంతో నేటికీ జేమ్స్ బాండ్ చిత్రాల సిరీస్ కొనసాగుతూనే ఉంది. 1961 నుంచి 1971 మధ్య ఆయన జేమ్స్ బాండ చిత్రాల సిరీస్ లో నటించారు. ఆయన తర్వాత ఆ స్థానాన్ని రోగర్ మూర్ భర్తీ చేశారు.
జీవితం ఎలా మొదలైందంటే..
1954లోనే ఆయన నట జీవితం మొదలైంది. దాదాపు 27 ఏళ్ల వయసులో నటుడిగా హాలీవుడ్ లో అడుగుపెట్టారు. తొలి చిత్రం లిలాక్స్ ఇన్ ద స్ప్రింగ్స్. 13 చిత్రాలు చేశాక గానీ ఆయనకు జేమ్స్ బాండ్ పాత్ర పోషించే అవకాశం రాలేదు. 1930 ఆగస్టు 20న ఆయన స్కాట్లాండులో జన్మించారు. తండ్రి జోసెఫ్ కానరీ ఓ లారీ డ్రైవర్ ఓ ఫ్యాక్టరీలో పనిచేసే వాడు. 18 ఏళ్ల వయసులోనే ఆయన ఆరడుగుల ఎత్తుండేవాడు. 1946లో తన 16 ఏళ్ల వయసులో ఆయన రాయల్ నేవీలో చేరారు. అల్సర్ కారణంగా 19వ ఏటనే ఉద్యోగాన్ని వదలుకోవలసి వచ్చింది. అనంతరం లారీ డ్రైవర్ గా, ఈత కొలనులో లైఫ్ గార్డ్ గా, కార్మికుడిగా.. బతుకు తెరువుకోసం ఇలా అతను రకరకాల పాత్రలు పోషించాల్సి వచ్చింది.
ఎడిన్‌బర్గ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ కోసం ఓ ఆర్టిస్ట్ గా, మోడల్ గానూ చేయాల్సి వచ్చింది. తన 18 ఏళ్ల వయసులోనే అతను బాడీ బిల్డర్. 1951 నుంచి బ్రిటీష్ సైన్యంలో మాజీ జిమ్ ట్రైనర్ వద్ద శిక్షణ కూడా తీసుకున్నాడు. మిస్టర్ యూనివర్శ్ పోటీల్లోనూ పాల్గొన్నాడు. చిన్నప్పటి నుంచే అతను ఫుట్ బాల్ ఆటగాడు కూడా. నటుడిగా మారాలని తన 23వ ఏటనే కానరీ నిర్ణయించుకున్నాడు. 1954 లో ఓ పార్టీలో కానరీ మొట్టమొదటిసారి మైఖేల్ కెయిన్‌ను కలిశాడు. ఆ తర్వాత ఇద్దరూ సన్నిహితులయ్యారు. అమెరికన్ నటుడు రాబర్ట్ హెండర్సన్ ద్వారా నటనపై ఆసక్తిని పెంచుకున్నాడు. సినిమా రంగ ప్రవేశానికి హెండర్సన్ చాలా హెల్ప్ చేశాడు. అలా 1954లోనే మొదటి సినిమా అవకాశం వచ్చింది. హీరోగా ఎదగడానికి ముందు ఎన్నో చిన్న పాత్రలను అతను పోషించాల్సి వచ్చింది. 1962 తర్వాత వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రాలు అతన్ని ఆకాశమంత ఎత్తు లేపేశాయి.
జేమ్స్ బాండ్ పాత్ర ఎక్కడిది?
ఇయాన్ ఫ్లెమింగ్ రచనల నుంచి పుట్టిన పాత్ర ఇదని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. బ్రిటీష్ సీక్రెట్ సర్వీస్ ఏజంట్ గా ఈ పాత్ర పుట్టింది. ఫ్లెమింగ్ చనిపోయాక ఇతర రచయితలు మళ్లీ జేమ్స్ బాండ్ పాత్రను బతికించారు. ఈ జేమ్స్ బాండ్ సిరీస్ మొట్టమొదటి చిత్రం డాక్టర్ నో. ఆ చిత్రం అత్యధిక కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సిరీస్ లో భాగంగానే తాజాగా ‘నో టైమ్ టు డై’ తెరకెక్కింది. త్వరలోనే ఈ చిత్రం మనముందుకు రాబోతోంది. సీన్ కానరీ తర్వాత వరుసగా జేమ్స్ బాండ్ లు చాలా మంది మారారు. కొత్త వారెవరికీ షాన్ కానరీ, రోగర్ మూర్ కు వచ్చినంత పేరు మాత్రం రాలేదు. అంత వసూళ్లు సాధించిన చిత్రాలు కూడా రాలేదు. అందుకే షాన్ కానరీ జేమ్స్ బాండ్ గా జనంలో మిగిలిపోయారు.. ఆ పాత్రకు ఓ బ్రాండ్ ను సంపాదించి పెట్టారు.
-హేమసుందర్ పామర్తి