ఏపీలో మొదటివిడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల విషయంలో ఎన్నికల కమిషన్ తాజాగా జారీ చేసిన ఆదేశాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను ప్రకటించవద్దని ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై పూర్తి వివరణాత్మక నివేదిక కోరింది. వాస్తవ పరిస్థితికి, ఏకగ్రీవాలకు మధ్య వైరుధ్యం కనిపిస్తోందని, అందుకే పూర్తి విచారణ తరువాతే ఏకగ్రీవాలను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. మొదటి విడతలోమొత్తం 3,249 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా అందులో 517 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా చిత్తూరులో 110, గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆ జిల్లాల్లో ఏకగ్రీవాల ప్రకటన చేయవద్దని కలెక్టర్లను ఆదేశించింది.
కారణాలు..ఇవీ..
కాగా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో పంచాయతీలకు సర్పంచ్ స్థానానికి ఒక్క నామినేషనే దాఖలు కావడం ఒక కారణం కాగా..నామినేషన్ వేశాక మళ్లీ ఉపసంహరించుకోవడం కూడా రెండో కారణంగా కనిపిస్తోంది. ఏపీలో అన్ని జిల్లాల్లో ఈ పరిస్థితి ఉన్నా.. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు ఎక్కువగా ఉండడంతోపాటు ఫిర్యాదులూ అందాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే. ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో నామినేషన్ వేసిన అభ్యర్థులపై అధికార పార్టీకి చెందిన వారు ఒత్తిడి తెచ్చిన కారణంగా కొన్నిఏకగ్రీవమయ్యాయి. మాచర్లలో క్యాస్ట్ సర్టిపికెట్ ఇవ్వకుండా చేయడం ద్వారా కొన్ని చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా పొన్నూరు మండలంలో 9 ఏకగ్రీవాలు జరిగాయి. ఈ జిల్లాలో మొత్తం 67లో 63 అధికార పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. టీడీపీ మద్దతుదారులు 2, స్వతంత్రులు రెండుచోట్ల ఏకగ్రీవం అయ్యారు. బాపట్ల నియోజకవర్గంలో బలవంతంగా పార్టీల్లో చేర్చుకుని ఒత్తిడి చేయడం ద్వారా ఏకగ్రీవం కాగా మరో చోట గ్రామంలో ఆలయ నిర్మాణం కోసం ఎకరం భూమి ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఇతరులు నామినషన్ వేయలేదు. ఇక జొన్నలగడ్డ,పెదతురకపాలెంలో టీడీపీ మద్దతుదారులు నామినేషన్ వేసేందుకు రాగా వైసీపీ మద్దతుదారులు నామినేషన్ పత్రాలు చించివేసిన ఘటన జరిగింది. నరసరావుపేట మండలం పెట్లూరి పాలెంలో టీడీపీ మద్దతుదారులు నామినేషన్ వేసేందుకు రాగా..వైసీపీ మద్దతుదారులు దాడి చేసిన ఘటన కూడా జరిగింది. అయ్యన్న పాలెంలో నామినేషన్ వేసేందుకు టీడీపీ మద్దతుదారు సిద్ధం కాగా.. ప్రత్యర్థులు చర్చల పేరుతో పిలిచి ఇంట్లో ఉంచి తలుపులు వేసినట్లు వార్తలూ వచ్చాయి. సమయం ముగిశాక విడుదల చేశారు. దీంతో నామినేషన్ వేయలేదు. చిలకలూరిపేట ప్రాంతంలోని సాతులూరులో నామినేషన్ పత్రాలను వైసీపీ మద్దతుదారులు చించివేశారని ఫిర్యాదులూ అందాయి. చేబ్రోలు, దుగ్గిరాల మండలాల్లో ఒక్క పంచాయతీలో కూడా సర్పంచ్ పదవి ఏకగ్రీవం కాలేదు. ఇక చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలంలో నామినేషన్ వేసేందుకు సిద్ధమైన టీడీపీ అభ్యర్థి ఓబుల్‌రెడ్డిని అపహరించిన ప్రత్యర్థులు రాత్రి పదిగంటల సమయంలో గ్రామానికి తీసుకొచ్చి వదిలేశారు. చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవమైన 110 పంచాయతీల్లో 90 శాతం వైసీపీ మద్దతుదారులే ఉన్నారు. జిల్లాలోని ఐరాల, పూతలపట్టు, తవణంపల్లె, యాదమరిలో ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగాయి. మొత్తం 454 పంచాయతీలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ జిల్లాలో పంచాయతీ వ్యవస్థ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్నికలు జరగని వెదురుకుప్పం పంచాయతీ పరిధిలో ఈ సారి ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఏకగ్రీవాలు జరిగిన చోట్ల కనీసం 30 శాతం పంచాయతీల్లో ఒత్తిళ్లే కారణమన అభిప్రాయం నెలకొంది. నామినేషన్లు వేసేందుకు వస్తున్నవారిని అపహరించడం, దాడులు చేయడం, నామినేషన్లు వేశాక పలుమార్గాల ద్వారా వారిని నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడం, ఈ నేపధ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తరువాత ప్రకటన చేసేందుకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.