ఎన్నికల గంట మోగుతుండే సరికి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బరితెగించి వ్యవహరిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో.. ఎంతగా తగాదా పెట్టుకుంటే.. అంతగా ఎన్నికల్లో ప్రజలు తమను ఆదరిస్తారని.. ఎన్నికల కమిషనర్‌ను ఎంతగా తూలనాడితే.. అంతగా తమను హీరోలుగా గుర్తిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. వారి ప్రతి మాటా.. ప్రతి చేష్టా.. అందుకు ప్రతీకలుగానే కనిపిస్తున్నాయి. తాజాగా తిరుపతిలో విలేకర్ల సమావేశం పెట్టి మరీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడిన మాటలు.. ప్రభుత్వం ఎంతగా తెగించిందో తెలియడానికి ఒక సూచికగా కనిపిస్తున్నాయి.
ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. సర్వాధికారాలు ఎన్నికల సంఘానికే దఖలు పడతాయనేది.. ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న మంత్రికి తెలియని సంగతి కాదు. పైగా అధికారాల విషయంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయంలో.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి అధికారాలు ఉంటాయో.. స్థానిక ఎన్నికల సమయంలో అలాంటి అన్ని అధికారాలూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటాయని కోర్టు చాలా విస్పష్టంగా తేల్చి చెప్పింది. అయినా సరే మంత్రి వర్యులకు బోధపడినట్లు లేదు.
ఏకగ్రీవాలు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు.. వాటిని ఓసారి సమీక్షించాల్సిందే అనేది ఈసీ ఉద్దేశం. అందుకే ఆయన మితిమీరి ఏకగ్రీవాలు జరిగిన గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఫలితాల వెల్లడిని నిలిపి వేయాలని, ఏకగ్రీవంగా గెలిచిన వారికి డిక్లరేషన్లు ఇవ్వవద్దని ఆదేశాలు ఇచ్చారు. దీనిపై విచారణ జరుగుతుంది. సదరు ఏకగ్రీవ ఎన్నికల వెనుక ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులు లేవని తేలితే.. డిక్లరేషన్లు కూడా వస్తాయి. అలా కాకుండా.. అక్రమ మార్గాల్లో ఏకగ్రీవం అనే రంగు పులిమి- పంచాయతీ ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశారనే అనుమానం కలిగితే మాత్రం దాని మీద చర్యలుంటాయి. ఇది ఒక క్రాస్ చెక్ లాంటిది మాత్రమే. అయితే.. ఇలాంటి నిర్ణయం ఈసీ ప్రకటించగానే.. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదు.
Also Read ;- చంద్రబాబు కోటలో పాగాకు పెద్దిరెడ్డి స్కెచ్ పనిచేస్తుందా?
చిత్తూరు జిల్లా మొత్తం తన సామంత రాజ్యం అన్నట్లుగా.. పెద్దిరెడ్డి గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నారనేది అందిరికీ తెలిసిన సంగతే. జిల్లాలోని చాలా మంది ఎమ్మెల్యేలు కూడా.. పెద్దిరెడ్డి మీద తమ తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కిన సందర్భాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. జిల్లాలో తన పెత్తనం మరింత సుదృఢం చేసుకోడానికి పెద్దిరెడ్డి పంచాయతీ ఎన్నికలను కూడా వాడుకోజూస్తున్నారా? రాష్ట్రంలోనే అత్యధికంగా ఏకగ్రీవాలు జరిగిన జిల్లాల్లో ఒకటిగా చిత్తూరును నిలపడం వెనుక ఇలాంటి వ్యూహాత్మక పోకడ దాగి ఉందా? అనే అనుమానాలు పలువురిలో ఉన్నాయి.
కుట్రపూరితంగా ఏకగ్రీవాలు సాధ్యమై ఉంటే గనుక.. వాటిని అనుమానించాల్సిందే. ఈసీ వేలు పెడితే.. ఎక్కడ తమ బండారం బయటపడుతుందో అని, ఏకగ్రీవాల వెనుక ఉన్న లుకలుకలు బయటకు వస్తాయని పెద్దిరెడ్డి కంగారు పడుతున్నట్లుంది. అందుకే ఆయన అధికార్లను బెదిరిస్తున్నారు.
పరిపాలన వ్యవస్థ మొత్తం ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ఆధీనంలో ఉన్నట్టే లెక్క. ఆయన ఆదేశాలను వారు పాటించి తీరాల్సిందే. అసలు ఎన్నికలు అనే వ్యవహారమే.. నిమ్మగడ్డకు సంబంధించినవి. అలాంటప్పుడు.. ఆయన ఆదేశాలను పట్టించుకోకూడదని, పాటించకూడదని అధికార్లను, మంత్రిగారు బెదిరించడం అర్థం కాని సంగతి. ఎవరైనా నిమ్మగడ్డ చెప్పినట్లు వింటే.. తమ పరిపాలన పూర్తయ్యే వరకు వారిని గుర్తుపెట్టుకుంటామని, బెదిరించడం చాలా తీవ్రమైన పరిణామంగా కనిపిస్తోంది.
అడకత్తెరలో పోకచెక్కలా అధికార్లు
ఏపీలో అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా కనిపిస్తోంది. విధినిర్వహణ పద్ధతిగా నిబంధనలకు అనుగుణంగాచేయడం అంటే.. వారు ఈసీ నిమ్మగడ్డ చెప్పినట్టు వినాల్సిందే. ఆయన ఉత్తర్వులను పాటించాల్సిందే. వారు ఎన్నికలను నిర్వహించడం కూడా ఈసీ ఆదేశాలమేరకే! కనుక ఈసీ వద్దంటే ఫలితాలను ఆపేయాల్సిందే. కానీ.. పెద్దిరెడ్డి వంటి మంత్రులు ఈ తరహాలో బెదిరిస్తూ ఉండడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read: కడప జిల్లాలో నిమ్మగడ్డ పర్యటన..