చపాక్.. ఈ పేరు వినగానే క్రికెట్ ప్రేమికుల మదిని సిక్సర్లతో తడిపేసిన సెహ్వాగ్ గుర్తుకొస్తారు. అతని రికార్డును మళ్లీ అతనే తిరగరాసిన మధుర క్షణాలు యాదికొస్తయి. యువ ఆటగాడు కరుణ్ నాయర్.. బ్యాట్‌తో చేసిన విధ్వంసం హృదయాలను మీటుతుంది. అదే చెపాక్ స్టేడియంలో ప్రస్తుతం భారత్ – ఇంగ్లండ్ పోరు జరుగుతోంది. ఈవేళ ఆ నాటి అద్భుత క్షణాలను ఓసారి నెమరు వేసుకుందాం.. ఈసారి ఎవరైనా మళ్లీ ఆ అనుభూతిని మిగుల్చుతారమేనని ఆశగా ఎదురు చూద్దాం…
ఎన్నాళ్లకెన్నాళ్లకో..
ఎన్నాళ్లకెన్నాళ్లకో.. ఏడాది కాలం తర్వాత భారత్‌లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ సందడి కనిపిస్తోంది. సొంతగడ్డపై మనోళ్లు విజయగర్వం ప్రదర్శించాలని యావత్ భారతావని ఆశగా ఎదురు చూస్తోంది. ఆసీస్‌పై తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా సైతం.. మరోసారి ఘనమైన విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే… ప్రస్తుతం మ్యాచ్ చపాక్ స్టేడియంలో జరుగుతుండంతో క్రికెట్ అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సెహ్వాగ్ చేసిన మాయాజాలం గుర్తొచ్చి.. మళ్లీ అటువంటి అద్భుతం జరిగితే చూడాలనే ఆశ కనిపిస్తోంది.

త్రిశతకాల సెహ్వాగ్..
టీమిండియా తరఫున నమోదైన మూడు త్రిశతకాల్లో రెండు సెహ్వాగే సాధించారు. 2004లో ముల్తాన్ స్టేడియంలో పాకిస్థాన్‌పై తొలి ట్రిపుల్ శతకం (309) బాదారు. ఆ తర్వాత నాలుగేళ్లకే చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో మరో త్రిశతకాన్ని అందుకున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో గ్రేమ్‌స్మిత్ సేన 540 పరుగులు చేసింది. ఆమ్లా 159 పరుగులు చేశారు. భారత్ కు కష్టాలు తప్పవనుకునే సమయంలో సెహ్వాగ్ స్టేడియంలోకి అడుగు పెట్టారు. బౌలర్లను బ్యాటుతోనే ఊచకోత కోచారు. 42 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 319 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడారు. అతడికి రాహుల్ ద్రవిడ్ తోడయ్యారు. శతకంతో కదంతొక్కారు. భారత్ 627 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రాణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్ రెండు కీలక వికెట్లు కూడా పడగొట్టారు. ఏబీ డివిలియర్స్, మార్క్ బౌచర్‌ను బోల్తా కొట్టించారు.
కరుణ్ నాయర్ విధ్వంసం..
సెహ్వాగ్ భారీ ఇన్నింగ్స్ సాధించిన ఎనిమిదేళ్ల తర్వాత యువ ఆటగాడు కరుణ్ నాయర్ చెన్నైలోనే త్రిశతకం బాదేశారు. 2016లో భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్‌పై అతడు విజృంభించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 477 పరుగులు చేసింది. మొయిన్ అలీ 146 పరుగులు చేశారు. అనంతరం బరిలోకి దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 759/7 రికార్డు స్కోరు నమోదు చేసింది. అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కరుణ్ నాయర్ (303) పరుగుల వరద పారిస్తూ ట్రిపుల్ సెంచరీ అందుకున్నారు. అతడితో పాటు కేఎల్ రాహుల్ (199) చెలరేగారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 207 పరుగులకే ఆలౌటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
సెహ్వాగ్, కరుణ్ నాయర్ తర్వాత భారత్ తరఫున ఇప్పటివరకు త్రిశతకాన్ని ఎవరూ సాధించలేకపోయారు. ప్రస్తుత భారత జట్టులో స్టార్ బ్యాట్స్‌మెన్‌కు కొదవలేదు. కోహ్లీ, రోహిత్, పుజారా, రహానె సీనియర్ ఆటగాళ్లతో పాటు రాహుల్, గిల్, మయాంక్, పంత్ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లంతా సంచనాలను సృష్టించగలిగే బ్యాట్స్‌మెన్. ఈ నేపథ్యంలో త్రిశతక రికార్డును భారత బ్యాట్స్‌మెన్ అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.











