స్థానిక ఎన్నికల కారణంగా గ్రామాల్లో ఇంటింటికి రేషన్ డోల్ డెలివరీ నిలిచిపోయింది. పట్టణాల్లో రేషన్ డోర్ డెలివరీ ప్రారంభమైనా అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. రేషన్ తీసుకునే ప్రతి ఇంటిని ముందుగానే మ్యాపింగ్ చేయడంతో కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. పట్టణ ప్రాంతాల్లో నెట్ వర్క్ బాగానే ఉన్నా తరచూ సర్వర్ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి రోజూ ఒక్కో వాహనం ద్వారా కనీసం 60 మందికి రేషన్ డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా నిర్ధేశించినా, క్షేత్ర స్థాయిలో గడచిన పది రోజుల్లో సగటున రోజుకు 10 మందికి కూడా రేషన్ ఇవ్వలేకపోతున్నారని తేలింది. రేషన్ ఎంత మందికి సరఫరా చేసిందీ ఎప్పటికప్పుడు అధికారులకు రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా తెలుస్తోంది. అయితే సర్వర్ సపోర్ట్ చేయకపోవడంతో నేటికి 13 శాతం మించి పురోగతి కనిపించకపోవడంతో ఏమి చేయాలో అధికారులు తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది.
వాహనదారుల నిరశన.. దిగొచ్చిన ప్రభుత్వం..
ఏపీ ప్రభుత్వం రూ.680 కోట్లతో రేషన్ డోర్ డెలివరీ కోసం 12000 వాహనాలను సిద్దం చేసింది. ఒక్కో వాహనం కొనుగోలుకు రూ.5.8 లక్షలు ఖర్చు చేశారు. ఇందులో సగం రాయితీగా ప్రభుత్వం భరించింది. మిగిలిన మొత్తంలో ఒక్కో వాహనదారుడి నుంచి 58 వేలు వసూలు చేశారు. ఇక మిగిలిన మొత్తాన్ని నెలవారీ బ్యాంకులకు వాహనదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ చేసినందుకు వాహనదారుడికి మొదటగా నెలకు రూ.10 వేల జీతం, సహాయకుడికి నెలకు రూ.3000 ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. మొదట్లో చాలా మంది వైసీపీ నేతలు పోటీపడి, తమ పార్టీ కార్యకర్తలకు వాహనాలు ఇప్పించుకున్నారు. తీరా రేషన్ డోర్ డెలివరీ ప్రారంభించాక అసలు కష్టాలు మొదలయ్యాయి. పదివేలతో తాము రేషన్ షాపు నుంచి బండిలో నింపుకోవడం, ఇంటింటికి తీసుకువెళ్లి ఇవ్వడం తమ వల్ల కాదని వాహనదారులు చేతులెత్తేశారు. చాలా ప్రాంతాల్లో రూ.3000 కు సహాయకులుగా పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో పనిభారం మొత్తం వాహనదారులపై పడింది. సీఎం సొంత జిల్లా కేంద్రం కడపలోనూ వాహనదారులు చేతులెత్తేశారు. పదివేలకు ఇన్ని పనులు చేయలేమని తేల్చిచెప్పారు. దీంతో అధికారులు బెదిరింపులకు దిగారు. రేషన్ డోర్ డెలివరీ చేయకపోతే అరెస్టు చేయిస్తామని బెదిరించారు. అయినా వాహనదారులు రేషన్ డోర్ డెలివరీకి ముందుకు రాలేదు. దీంతో చాలా పట్టణాలు, మున్సిపాలిటీల్లో రేషన్ డోర్ డెలివరీ నిలిచిపోయింది. తమకు ఇచ్చే నెలవారీ వేతనాన్ని పెంచాలని వాహనదారులు రేషన్ డోర్ డెలివరీ నిలిపివేయడంతో ప్రభుత్వం దిగి వచ్చింది వాహనదారులకు నెలకు రూ.21000 చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో రేషన్ డోర్ డెలివరీ మరలా ప్రారంభమైంది.
సర్వర్ సమస్యలు..
రేషన్ డోర్ డెలివరీ వాహనదారులు ఆందోళన విరమించినా సర్వర్ సమస్యలు తప్పడం లేదు. ప్రతి ఇంటికి మ్యాపింగ్ చేయడం వల్ల సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. రేషన్ డోర్ డెలివరీ చేయకుండా కాలనీలో ఒక చోట వాహనం నిలిపి అందరినీ అక్కడకే పిలిచి రేషన్ ఇవ్వడం వల్ల సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఏపీలో మొత్తం కోటి 45 లక్షల బియ్యం కార్డులు ఉండగా నేటికీ కేవలం 11 లక్షల మందికి మాత్రమే రేషన్ ఇవ్వగలిగారు. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి నెలా 18వ తేదీకల్లా రేషన్ పంపిణీ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నెల చివరినాటికి కూడా రేషన్ పంపిణీ పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది.
లబ్దిదారులకు కొత్త కష్టాలు..
రేషన్ డోర్ డెలివరీ కొందరికి ప్రయోజనకరంగా ఉంది. మరికొందరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ తీసుకునే పేదలు చాలామంది ప్రతి రోజూ కూలీ పనులకు వెళుతూ ఉంటారు. రేషన్ డోర్ డెలివరీ విధానం వల్ల వాహనం ఇంటికి సమీపంలోకి వచ్చినప్పుడు సిద్దంగా ఉండాలి. లేదంటే రేషన్ ఇవ్వడం లేదు. వాహనం ఆ కాలనీకి ఒకసారే వస్తుంది. ఇక వాహనం వచ్చినప్పుడు కూలీ పనులకు వెళ్లాలంటే సాధ్యం కావడం లేదని లబ్దిదారులు వాపోతున్నారు. వాహనం కోసం ఎదురు చూసి మూడు రోజుల కూలీ పనులు పోయాయని విజయవాడ కండ్రిగ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రేషన్ డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేసినప్పుడు తమకు ఖాళీగా ఉండే సమయంలో వెళ్లి రేషన్ తెచ్చుకునేవారమని ఇప్పుడా పరిస్థితి లేదని పేదలు ఆందోళన చెందుతున్నారు.
రేషన్ బండి వద్ద క్యూ..
రేషన్ డోర్ డెలివరీ అంటే ఎవరి ఇంటి ముందు వారికి రేషన్ ఇస్తారని అందరూ భావించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నంగా ఉంది. రేషన్ బండిని కాలనీలో ఏదో ఒక ప్రాంతంలో నిలుపుతున్నారు. ఆ కాలనీ వాసులంతా బండి వద్ద క్యూ కడుతున్నారు. గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సి వస్తోంది. బయోమెట్రిక్ విధానానికి సర్వర్ సపోర్ట్ లేకపోవడంతో ఒక్కో లబ్దిదారుడికి బియ్యం ఇవ్వడానికి అరగంట సమయం తీసుకుంటోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బియ్యానికి ఒకసారి, కందిపప్పుకు మరోసారి, అరకిలో పంచదారకు మూడోసారి బయోమెట్రిక్ తీసుకోవాల్సి ఉంది. ఇది కూడా పెద్ద ప్రహసనంగా మారింది. కొందరు వృద్ధుల వేళ్లు అరగిపోయి ఉండటంతో బయోమెట్రిక్ తీసుకోవడం లేదు. దీంతో రేషన్ ఇచ్చేందుకు వాహనదారులు ముందుకు రావడం లేదు. గతంలో రేషన్ డీలర్లు, ఆ ప్రాంతంలో ఉండే అధికారి అనుమతితో ఇలాంటి వారికి వెంటనే రేషన్ పంపిణీ చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో రేషన్ లబ్దిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
బియ్యం చాలు.. మిగతావి వద్దు..
కొందరు లబ్దిదారులు కేవలం బియ్యం మాత్రమే తీసుకుంటున్నారు. కిలో కందిపప్పు రూ.67కు పెంచడంతో కందిపప్పు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మార్కెట్లో రూ.80కి మంది నాణ్యమైన కందిపప్పు లభిస్తోందని అందుకే పేదలు కూడా కందిపప్పు తీసుకునేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అయితే కందిపప్పు ఇవ్వకపోయినా ఇచ్చినట్టు నమోదు చేయాలని రేషన్ డీలర్లు వాహనదారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలుస్తోంది. దీంతో డీలర్లు, వాహనదారుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక పంచదార తీసుకునే వారే లేకుండా పోతున్నారు. మార్కెట్లో కిలో పంచదార రూ.36కే లభిస్తోంది. దీంతో అరకిలో పంచదార తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో వాహనదారులు ఇంటింటికి రేషన్ సరఫరా కొత్త సమస్యలకు దారితీస్తోందని లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.











