రజనీకాంత్ .. నటనపరంగా మాత్రమే కాదు, వ్యక్తిత్వం పరంగా కూడా ఎవరెస్టు శిఖరం వంటివాడేనని ఆయనతో పరిచయం ఉన్నవారు చెబుతూ ఉంటారు. ఆయన చుట్టూ ఉన్నవారు హడావిడి చేస్తుంటారుగానీ, ఆయన మాత్రం చాలా సాదా సీదాగా ఉంటారు. షూటింగు సమయంలో కూడా ఆయన తన స్టార్ డమ్ చూపించరు. తోటి ఆర్టిస్టులను ఎంతో ఆత్మీయంగా చూసుకుంటూ ఉంటారని అంటారు. షూటింగులో ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాలా జ్రాగ్రత్తలు తీసుకుంటారని చెబుతారు. తాజా ఇంటర్వ్యూలో సీనియర్ నటి వై.విజయ కూడా అదే మాట చెప్పారు.
చాలాకాలం క్రితం .. రజనీకాంత్ గారు హీరోగా చేస్తున్న ఒక సినిమాలో నాకు ఒక ముఖ్యమైన పాత్ర దక్కింది. ఆ సినిమా షూటింగు సమయానికి నేను గర్భవతిని. అప్పటికే ఎనిమిది నెలలు నిండాయి. ఆ దర్శకుడు ఒక ఎత్తైన కొండపై క్లైమాక్స్ సీన్ ను ప్లాన్ చేశాడు. రజనీకాంత్ గారితో పాటు నేను కూడా ఆ కొండ ఎక్కడం మొదలుపెట్టాను. అయితే గర్భవతిగా ఉన్న నేను కొండ ఎక్కకూడదని చెబుతూ, కుర్చీలో కూర్చోబెట్టి పైకి చేర్చేలా చూస్తానని రజనీ సార్ అన్నారు. ఫరవాలేదని చెప్పి నేను నెమ్మదిగా కొండపైకి చేరుకున్నాను.
తీరా కొండపైకి ఎక్కేసిన తరువాత ఈ కొండ కాదు .. మనం ఎక్కవలసింది పక్కనే ఉన్న మరో కొండ అని దర్శకుడు తాపీగా చెప్పాడు. దాంతో నేను కొంచెం టెన్షన్ పడ్డాను. నా అసిస్టెంట్ అయితే చాలా భయపడిపోయింది. కొండలు ఎక్కి దిగే క్రమంలో ఏం జరుగుతుందోనని కంగారుపడింది. రజనీకాంత్ గారు నేను ఇబ్బంది పడకుండా కొండపైకి చేర్చడానికి ప్రయత్నించారు. నేను మాత్రం నడుస్తానని చెప్పి కొంతదూరం వెళ్లాను. కానీ నేను కొండపైకి రాకుండా రజనీకాంత్ గారు ఒక చోట ఆపేసి, నాకు సంబంధించిన షాట్స్ ను అక్కడి నుంచే తీసేలా చేశారు. ఆ సమయంలో నా విషయంలో ఆయన చాలా ఫీలయ్యారు. ఆయన చూపించిన అభిమానాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను” అని ఆమె చెప్పుకొచ్చారు.
Must Read ;- చిరంజీవి చెప్పింది.. రజనీకాంత్ పాటించారా.?











