తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహంగా ఉంటామని నమ్మించి ఆ స్నేహం ముసుగులో డిగ్రీ విద్యార్థినిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. తమ బర్త్‌డే ఉందంటూ నమ్మబలికిన యువకులు ఆ యువతిని బయటికి తీసుకెళ్లి కేక్‌లో మత్తుమందు కలిపి దారుణానికి ఒడిగట్టారు. పైగా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులకు కూడా దిగారు. బాధితురాలు తనకు జరిగిన దారుణాన్ని గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
కేక్ తినిపించి ఆ తరువాత..
తెలిసిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌కి చెందిన ఓ యువతి సికింద్రాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తన ఇంటి దగ్గరే ఉన్న ముగ్గురు యువకులతో ఆమెకు స్నేహం ఏర్పడింది. అందులో ఓ యువకుడు తన పుట్టిన రోజు ఉందని నమ్మబలికి.. మిగతా ఇద్దరి స్నేహితులతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకుందామని తెలిపాడు. స్నేహితులే కదా అని వారిని నమ్మిన ఆ యువతి అంగీకారం తెలిపింది. కళాశాల నుంచే నలుగురూ ఓ హోటల్‌కు వెళ్లారు. పథకం ప్రకారం ఆ యువకులు ముందుగా కేక్‌పై మత్తుమందు చల్లారు. అందరం కలిసి కేక్‌ను తిందామని యువతి అనగా ముందు నువ్యే తినాలంటూ ఆమెకు తినిపించారు.
సైబరాబాద్‌కు బదిలీ…
కేక్ తిన్న ఆ యువతి మత్తులోకి జారుకోవడంతో ఆ ముగ్గురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి ఆమెను ఆటోలో ఇంటికి పంపించేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు ఈనెల 11న అపస్మారక స్థితికి వెళ్లగా తనను తల్లి దండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఆ యువతి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులకు యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఘటన సైబరాబాద్ పరిధిలో జరగడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సైబరాబాద్ పోలీసులకు కేసు బదిలీ చేసినట్లు తెలిసింది.











