(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఆరుగాలం శ్రమించి, పెద్ద చేసి, ప్రయోజకులుగా తీర్చిదిద్దిన కన్నతల్లిని, తల్లినేలను అనాధగా మార్చి డాలర్ల మోజులో పడి విదేశాలకు పారిపోయిన నేటితరం యువకుల పోకడలకు ఇక్కడి పరిస్థితులకు ఏమీ తేడా కనిపించడం లేదు. ఇక్కడ ఉన్న ఇంటిని కూడా అమ్మేసి అమ్మను అనాధ శరణాలయంలో చేర్చించేవారి తరహాలోనే పెద్దలందరూ ప్రవర్తిస్తున్నారు.
ఉన్నత ఉద్యోగులుగా, పండితులుగా, న్యాయనిర్ణేతలుగా, అమాత్యులుగా ఎదిగిన ఎమ్మార్ కాలేజీ విద్యార్థుల్లో కొందరు- ఇప్పుడు ఆ కళాశాలను సంబంధిత యాజమాన్యం ప్రైవేటీకరించేందుకు సిద్దపడుతుంటే తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం బాధాకరం. అందుకు కొంతమంది వత్తాసు పలుకుతుండటంతో అసలు మీకు అవమానంగా అనిపించడం లేదా?! అని విజయనగరం వాసులు ఆవేదనతో నిలదీస్తున్నారు.
పట్టించుకోని ప్రభుత్వం
ప్రతిష్ఠాత్మకమైన, ఎంతో చారిత్రక ప్రసిద్ధి కలిగిన విజయనగరం ఎమ్మార్ కాలేజీని ప్రైవేటీకరించొద్దు మొర్రో అని ప్రస్తుత విద్యార్థులు ఒకవైపు ఆందోళన చేస్తున్నారు. మాన్సాస్ కాలేజీ నిర్వహించ లేకపోతే ప్రభుత్వ పరం చేయమని విపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం నోరు విప్పడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వేరొక వైపు కాలేజీ ప్రవేశాలను నిలిపివేసిన యాజమాన్యం అగ్నిలో ఆజ్యం పోసేటట్టు వ్యవహరిస్తోంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను బూటు కాళ్లతో తొక్కించేస్తోంది.
మౌనమేలనోయీ..
విజయనగరం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎమ్మార్ కాలేజీ ప్రైవేటీకరణ అంశాన్ని రాజుల కుటుంబ వ్యవహారంగా ఆ కళాశాల పూర్వ విద్యార్థి, స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చేయడం స్థానికులు చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. అధికారపార్టీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు ఎవ్వరూ ఈ అంశంపై నోరు విప్పకపోవడానికి కారణం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చాలామంది ఈ కళాశాల పూర్వ విద్యార్ధులైనప్పటికీ మౌనం దాల్చడంలో ఆంతర్యం చర్చనీయాంశమైంది. ఈ కళాశాల పూర్వ విద్యార్థులలో చాలామంది ఉన్నతస్థాయిలో ఉన్నారు. వారిలో ఏ ఒక్కరు నడుం బిగించినా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కానీ , అటువంటి వ్యక్తులు ఎవ్వరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నూతన విద్యావిధానంలో భాగమే : మాన్సాస్ కరస్పాండెంట్
ఎమ్మార్ కళాశాల వ్యవహారం ముదిరి పాకాన పడటంతో మాన్సాస్ కరస్పాండెంట్ డాక్టర్ కె.వి.ఎల్. రాజు స్పందించక తప్పలేదు. అయితే ఆ స్పందన ‘తానొవ్వక నొప్పించక’ అనే చందంగా ఉంది. అదే తరుణంలో ప్రైవేటీకరణకు యాజమాన్యం సిద్ధమైపోయినట్లు సంకేతం ఇచ్చింది. 2022లో సంపూర్ణంగా అమలులోకి రానున్న నూతన విద్యా విధానంలో భాగంగానే ఎమ్మార్ కళాశాల గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రభుత్వానికి తిరిగి అప్పజెప్పేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఆయన మీడియాకు రిలీజ్ చేసిన ‘ప్రెస్ రిలీజ్’ యథాతథంగా..












