దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మంగళవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దాదాపు 150 మంది నాయకులతో మీటింగ్ పెట్టారు. ఈ సమావేశానికి ముందు షర్మిల సదరు నాయకులతో సంక్షిప్తంగా మాట్లాడారు. ‘మీకు తెలిసినంత బాగా నాకు తెలియదు. మీరు ఏం చూశారో నాకు సలహాలు ఇవ్వండి. మీరు చెబితే వినడానికి,అర్థం చేసుకోవడానికి వచ్చాను. నేను మాట్లాడేందుకు రాలేదు. మీరు చెబితే తెలుసుకుంటాను. త్వరలోనే అన్ని విషయాలు ప్రకటిస్తా. రాజన్న రాజ్యం తెచ్చే లక్ష్యంతో ముందుకు వెళ్తాను. తెలంగాణలో రాజన్న రాజ్యం ఎందుకు లేదన్నదే ప్రశ్న. రానున్న కాలంలో అందరితో మాట్లాడతా. పార్టీ పెడితే ప్రజలకు చెప్పే తాను పార్టీ పెడతా ’అని వ్యాఖ్యానించారు.
మార్చిలో కార్యాచరణ..
కాగా గత కొన్ని రోజులుగా షర్మిల పార్టీ పెడతారన్న ప్రచారం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇక పదిహేను రోజుల క్రితం కర్నూలు జిల్లాకు చెందిన న్యాయవాది, వైద్యుడితో డాక్యుమెంటేషన్ కూడా పూర్తి చేశారని, మార్చి నెలలో కార్యాచరణ మొదలవుతుందని తెలుస్తోంది. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల పార్టీ ప్రకటన విషయంపై ఏపీలో, తెలంగాణలో చర్చ నడుస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్ , నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని నేతలు పలువురు హాజరయ్యారు. మీడియా అక్కడకు చేరే సమయానికి ముందే కొందరు మాజీ ఎంపీలు కూడా అక్కడకు చేరినట్లు సమాచారం. ఇక పార్టీ పేరు అడిగిన మీడియాకు..కాస్త ఓపిక పట్టండి.. అన్ని విషయాలు చెబుతాను అని వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టే అంశాన్ని షర్మిల ఖండించకపోవడాన్ని బట్టి, ఫ్లెక్సీల్లో జగన్ ఫొటో లేకపోవడాన్ని బట్టి పార్టీ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ముందుగానే సమాచారం..
కాగా షర్మిల పార్టీకి సంబంధించిన విషయంపై టీఆర్ఎస్‌కు ముందుగానే సమాచారం ఉందని, అందుకే రెండురోజుల క్రితం కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ అంటే పాన్ డబ్బా కాదని, ఎందరో పార్టీలు పెట్టి విఫలం అయ్యారని వ్యాఖ్యానించారు. ఇక మంగళవారం ఇంటిలిజెన్స్ విభాగం కూడా ప్రత్యేక టీంతో ఈ విషయంపై విషయాలు సేకరించిందని ప్రచారం జరుగుతోంది.
త్వరలో ఢిల్లీకి ప్రత్యేక టీం..
కాగా షర్మిల పెట్టే పార్టీకి సంబంధించి ఢిల్లీకి ప్రత్యేక టీం వెళ్లనుందని తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ న్యాయవాది, తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ కూడా వెళ్లనున్నారని తెలుస్తోంది. షర్మిల పార్టీకి సంబంధించి న్యాయపరమైన అంశాల పరిశీలన పూర్తి చేయడంతోపాటు పార్టీ పేరుపై ఎన్నికల కమిషన్‌కు అప్లై చేయనున్నట్లు సమాచారం. ఏపీలో అధికారంలో ఉన్న YCP పేరు ఇప్పటికే వివాదాస్పదమైన నేపథ్యంలో అలాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం షర్మిల YSRTP అనే పేరును పరిశీలిస్తున్నట్లు నాయకులు చెబుతున్నారు. YSR అనేది కామన్ పదంతోపాటు తెలంగాణ పార్టీ అని ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పదంపై..
కాగా పార్టీ పేరులోగాని, రంగుల్లో కాని కాంగ్రెస్ ప్లేవర్ కనిపించకుండా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. అందుకు కారణం కూడా ఉంది. తెలంగాణలో అన్ని పార్టీల్లో వైఎస్ అభిమానులున్నారు. కాంగ్రెస్ అనే పదం కనిపిస్తే..కాంగ్రెస్ ఉన్న వైఎస్ అభిమానులు తమవైపు మళ్లే అవకాశం తక్కువ. అది పార్టీ సెంటిమెంట్ ప్రభావం చూపుతుందన్న ఉద్దేశం ఉందని తెలుస్తోంది. మార్చిలో పూర్తి స్థాయి ప్రకటన వస్తుందని చెబుతున్నారు.











