‘దృశ్యం’ .. ఈ సినిమా చూసినవారెవరూ అంత తేలికగా మరిచిపోలేరు. మలయాళంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమా, అక్కడ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. తెలుగులో మాత్రమే కాదు .. ఏ భాషలో రీమేక్ చేస్తే ఆ భాషలో భారీ వసూళ్లను రాబట్టింది. అందుకు కారణం .. ఈ కథ తమ కథగా ప్రేక్షకులు భావించేలా ఉండటమే. ఒక మధ్యతరగతి కుటుంబం .. బాధ్యతగల ఒక తండ్రి చుట్టూ తిరిగే కథ ఇది. అనుకోకుండా జరిగిన ఒక హత్య నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం కథానాయకుడు చేసే ప్రయత్నంగా ఈ కథ నడుస్తుంది.
మోహన్ లాల్ కథానాయకుడిగా చేసిన మలయాళ ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్ రూపొందింది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ‘దృశ్యం 2’ సినిమాను, ఈ నెల 19వ తేదీన ‘అమెజాన్ ప్రైమ్’ లో విడుదల చేయనున్నారు. కొన్ని సీక్వెల్స్ మొదటిభాగంతో సంబంధం లేకుండా కొత్త ట్రాక్ లో వెళతాయి. కానీ ‘దృశ్యం’ మొదటిభాగం ఎక్కడైతే పూర్తయిందో, అక్కడి నుంచే రెండవ భాగం మొదలుకానుండటం విశేషం. మొదటి భాగానికి మించిన సస్పెన్స్ ఈ సినిమాలో ఉండేలా చూసినట్టుగా మోహన్ లాల్ చెప్పడంతో, సహజంగానే సీక్వెల్ పై అంచనాలు పెరుగుతూ పోతున్నాయి.
మరి తెలుగులో ‘దృశ్యం’ రీమేక్ లో చేసిన వెంకటేశ్, ‘దృశ్యం 2’ రీమేక్ లోను చేస్తారా? అనే సందేహం తలెత్తడం సహజం. అయితే ‘దృశ్యం 2’ రీమేక్ చేయడానికి వెంకటేశ్ ఆసక్తిని చూపడం లేదనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ‘దృశ్యం 2’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది. గతంలో వచ్చిన ‘దృశ్యం’ సినిమాకి గల క్రేజ్ కారణంగా, ‘దృశ్యం 2’ను పెద్ద సంఖ్యలో వీక్షించే అవకాశం ఉంది. అందువలన తెలుగులో రీమేక్ చేస్తే అంత కుతూహలాన్ని పెంచకపోవచ్చనేది వెంకటేశ్ ఆలోచన అట. అందువలన ఆయన ‘దృశ్యం 2’తెలుగు రీమేక్ లో చేసే ఆలోచనలో లేరని అంటున్నారు.











