బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షోకు ఆసాధారణమైన ఆదరణ లభిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ షో మొదటి సీజన్లో ఇండియాలోనే మొదటిస్థానాన్ని సంపాదించుకుంది. ఈ టాక్ షోకు ఎందుకు ఇంత ఆదరణ అని ప్రశ్నించుకుంటే ఏ టాక్ షోకైనా పెద్ద ఎస్సెట్ జనంలో ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని ఈ షో ద్వారా ఆశించడమే. దాని కోసమే జనం ఈ టాక్ షోలను చూస్తుంటారు. వాస్తవం కన్నావదంతులపైనే మోజు చూపుతుంటారు. మరి ఈ వదంతులకు సమాధానం టాక్ షోలలో లభిస్తుందన్న ఆశతోనే ఇలాంటి షోలను చూస్తుంటారు.
అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ ప్రారంభం కాగానే అందరి ఊహలకూ భిన్నంగా మహానటుడు ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు గెస్ట్ గా వచ్చారు. ఆయన మీద జనంలో ఉన్న ప్రచారం గురించి బాలయ్య అడుగుతారా లేదా? దానికి చంద్రబాబు నుంచి ఎలాంటి సమాధానం లభిస్తుంది అన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. అందుకే ఈ షో ప్రారంభం కాగానే విపరీతంగా చూశారు. ఈ షో ప్రారంభమైన 24 గంటల వ్యవధిలో పది లక్షల వ్యూస్ సాధించిన షోగా పేరు తెచ్చుకుంది. ఈ ఎపిసోడ్ నాలుగు రోజుల్లోనే 100 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అయినట్లు ఆహా అధికారింగానే వెల్లడించింది. ఐఎండీబీ ర్యాంకుల పరంగా మొదటి సీజన్ లో మొదటి స్థానంలోకి వెళ్లిన ఈ షో ఇప్పుడు ఇండియా లెవల్ లో నాలుగో స్థానంలో ఉండటం విశేషమే. టాక్ షో అంటే తెలుగులో మాటా మంతీ అనుకోవచ్చు. టాక్ షో రక్తి కట్టాలంటే హోస్ట్ అందరికీ తెలిసినవాడై ఉండాలి. అతనిలో స్పాంటేయనిటీ ఉండాలి. టాక్ షో జోవియల్ గా సాగాలి. నిడివి కూడా కీలకమే. ఈ లక్షణాలన్నీ అన్ స్టాపబుల్ లో ఉన్నాయి కాబట్టే ఇంతలా క్లిక్ అయ్యింది.
టాక్ షోల ప్రారంభం ఎప్పుడు?
అసలు మొదటి టాక్ షో ఎప్పుడు ఎక్కడ ప్రసారమైందో మీకు తెలుసా? 1951లో అమెరికాలో రేడియో ద్వారా ప్రసారమైంది. జో ఫ్రాంక్లిన్ వక్తగా ఉండేవాడు. ఆ తర్వాత ఇది టీవీ టాక్ షోగానూ మారి డబ్ల్యూజే జడ్ టీవీలో ప్రసారమైంది. ఆ తర్వాత ది టు నైట్ షోని ప్రముఖంగా చెప్పుకోవాలి. ప్రపంచంలోనే సుదీర్ఘమైన టాక్ షో ఇది. 1954లో ప్రసారమైంది. ఎన్.బి.సి. నెట్ వర్క్ దీన్ని ప్రసారం చేసింది. దీని హోస్ట్ స్టీవెన్ అలెన్. ఇలాంటి వాటిని చూసే మన ఆకాశవాణి కూడా ఇదే తరహాలో కార్యక్రమాలు నిర్వహించింది. టీవీలు వచ్చాక వీటి రూపురేఖలు మారాయి. తెలుగులో గొల్లపూడి మారుతీరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం లాంటి వారు వీటికి వన్నె తెచ్చారు. నేక సంవత్సరాలుగా, అనేక విషయాలపైనా, అంశాలపైనా అనేక టాక్ షోలు వచ్చాయి. కొన్నింటికి విపరీతమైన ప్రజాదరణ లభించగా, మరి కొన్ని గాలిలో కలిసిపోయాయి. టీవీ రంగంలో బాగా క్రేజ్ సంపాదించుకున్న టాక్ షోలుగా ఐదింటి గురించి చెప్పాలి. వీటిలో మొదటగా కాఫీ విత్ కరణ్ గురించి ప్రస్తావించాలి. దీని హోస్ట్ ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్.
ఈ షో మొదటిసారిగా 2004లో ప్రసారమైంది. ఇండియాలో ఎక్కువకాలంగా కొనసాగుతూ అత్యధిక ప్రజాదరణ పొందిన షోగా కాఫీ విత్ కరణ్ చెప్పాలి. ఈ షో అనేకసార్లు వివాదాల్లోఇరుక్కుంది. ఇక రెండో స్థానం మూవర్స్ అండ్ షేక ర్స్.శేఖర్ సుమన్ దీనికి హోస్ట్. సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూడటంతోపాటు మంచి కామెడీ టైమింగ్ తో ఈ షో సాగుతుంది. 1997లో ప్రారంభమైన ఈ షోకి ప్లస్ పాయింట్ చెప్పాలంటే హోస్ట్ కి ఉన్న కామెడీ టైమింగ్, పంచ్ లేననాలి. జీనా ఇసి కా నామ్ హై షోకి హోస్ట్ ఫరూక్ షేక్. అతని వ్యక్తిత్వం, అతను షోని హోస్ట్ చేసే విధానానికి ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఇది కూడా సెలబ్రిటీల జీవిత ప్రయాణం గురించి తెలిపేదే. గెస్ట్ లను ఇంటర్వ్యూ చేసే విధానం, వారి జీవితంపై లోతైన పరిశోధన చేసేలా షో ఉండటం ప్రేక్షకులకు నచ్చటానికి ప్రధాన కారణం అని చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ హోస్ట్ చేసిన సత్యమేవ జయతే షో గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. రియాలిటీ లైఫ్ ఆధారిత టాక్ షో ఇది. మన దేశంలోని బర్నింగ్ టాపిక్ తీసుకుని చేయడంవల్ల ఈ షో క్లిక్ అయ్యింది.
వరకట్నం, అత్యాచారం, చైల్డ్ ట్రాఫికింగ్, మెడికల్ మాఫియాలాంటి అంశాలు ఉండటం వల్ల కొంత వివాదాస్పదమైంది. స్టార్ నెట్ వర్క్ కోసం ఆయన ఈ షో చేశారు. 2012 నుంచి 2014వరకు మూడు సీజన్లుగా ఈ షో కొనసాగింది. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లడం వల్ల చట్టపరమైన ఎన్నో ఇబ్బందులను ఈ షో ఎదుర్కొంది. ఇక కపిల్ శర్మ షో. ఐఎండీబీలో ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్న షోగా దీని గురించి చెప్పాలి. హాస్య నటుడు కపిల్ శర్మ హోస్ట్ చేసే విధానం వల్లే ఈ షో కూడా క్లిక్ అయ్యింది. సెలబ్రిటీలతో ప్రేక్షకులను ఇంటరాక్ట్ చేయడం వల్ల కూడా దీనికి ఎక్కువ ప్రజాదరణ లభించింది. నటీనటులతో చేసే స్కిట్ లు కూడా ప్రేక్షకులను అలరించడంతో అగ్రస్థానంలో ఈ షో కొనసాగుతోంది. 2016 నుంచి సోని నెట్ వర్క్ లో ఈ షో కొనసాగుతోంది. ఇప్పుడు ఓటీటీలు రంగ ప్రవేశం చేయడం వల్ల ఈ షోల ఇంపార్టెన్స్ బాగా పెరిగింది.
ఐఎండీబీలో రేటింగ్
ఐఎండీబీలో రేటింగ్ పరంగా అస్టాపబుల్ షోనే చెప్పాల్సి ఉంటుంది. దీనికి 10కి 9.2 పాయింట్లు లభించాయి. ఇక ర్యాంకు పరంగా టాప్ ప్లేస్ లో కాఫీ విత్ కరణ్ ఉంది. ఆ తర్వాత సాఫ్ట్ వాయిస్ పాడ్ కాస్టింగ్ సిరీస్ ఉంది. కపిల్ శర్మ షో మూడో స్థానంలో ఉంది. దానికి లభించిన రేటింగ్ 10కి 7.3 మాత్రమే. నాలుగో స్థానంలో ఉన్న అన్ స్టాపబుల్ ఉన్న రేటింగే వీటన్నికన్నా ఎక్కువ. ఓ ప్రాంతీయ భాషలో కొనసాగే టాక్ షో ఇండియాలోని టాప్ టాక్ షోలతో పోటీ పడటమే విశేషం. ఏ టాక్ షో అయినా క్లిక్ అవ్వాలంటే కొన్ని అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. అవేమిటో చూద్దాం. మన దగ్గరకు గెస్ట్ గా రాబోయే వ్యక్తి జనం ఏమనుకుంటున్నారో నిర్మొహమాటంగా అడిగేయాలి… అవసరమైతే కడిగేయాలి. కొంతమంది గెస్ట్ లుగా రావడానికి భయపడేది అందుకే. బాలయ్య షో క్లిక్ అవడానికి ప్రధాన కారణం అదే. కాకపోతే తనకు ఎదురయ్యే ప్రశ్నలను సమయస్ఫూర్తితో ఎదుర్కొనే సత్తా కూడా గెస్ట్ కు ఉండాలి. ఇలాంటివి లేకపోతే షో చప్పగా ఉంటుంది.
అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ గెస్ట్ చంద్రబాబు నాయుడు. తనకు బావ, వియ్యంకుడు అయిన చంద్రబాబుకు బాలయ్య సంధించిన ప్రశ్నలు, దానికి ఆయన ఇచ్చిన సమాధానాలు చర్చనీయాంశమయ్యాయి. బాబు చెప్పిన సమాధానాలపై ప్రత్యర్థులు విమర్శలతో విరుచుకుపడిన సందర్భాలు కూడా ఎదురయ్యాయి. గెస్ట్ వ్యక్తిగత జీవితంలోకి కూడా హోస్ట్ తొంగి చూడాలి. అప్పుడే షో రక్తికడుతుంది. మనవాడే కదా అని మొహమాటపడి హోస్ట్ అతడిని వదిలేస్తే షో మీద ఉన్న క్రేజ్ పోతుంది. గెస్ట్ కు హోస్ట్ చెమటలు పట్టించడం కాకుండా హోస్ట్ కు గెస్ట్ కూడా చెమటలు పట్టించగలిగితే షో మరింత రంజుగా సాగుతుంది. మాస్ కా బాప్ అయిన బాలయ్య అంతలా దొరికి రకం అయితే కాదు. ఎంత కాలం సాగినా ఇది మాత్రం ఎవర్ గ్రీన్ షో అని మాత్రం చెప్పక తప్పదు. ఈ షో ఇంతలా క్లిక్ అవడానికి కారణం మాత్రం ఒన్ అండ్ ఓన్లీ బాలయ్యేననడం ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు.











