దేశంలో పొలిటికల్ సెమీ ఫైనల్స్ హీట్ నడుస్తోంది.. అయిదు రాష్ట్రాల ఎన్నికలు మరో నెల రోజుల్లో జరగనున్నాయి.. మరో 50 రోజుల్లోనే సెమీ ఫైనల్ ఎవరిది అనేది క్లారిటీ రానుంది.. ఇక ఏపీలోనూ ఇప్పటికే రాజకీయ వేడి రాజుకుంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌తో ఏపీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇదే అంశంపై పలు రాజకీయ సర్వే ఏజెన్సీలు సర్వేలతో బిజీగా ఉన్నాయి.. తాజాగా ఏపీ ఎన్నికలపై ఓ సర్వే సంస్థ టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీ ఔట్ అని తేల్చిపారేసింది.. సేమ్ సీన్‌ని.. జాతీయ స్థాయిలో సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్‌లోనూ వెల్లడించింది..
జగన్ టీమ్‌లో ముఖ్యంగా ఆయన ప్రస్తుత, మాజీ మంత్రి సహచరులే ఈ దఫా ఓటమి అంచున ఉన్నారని ఓ సర్వే సంస్థ రిపోర్టు ఇచ్చింది.. ఇదే ఇప్పుడు వైసీపీని కలవరపెడుతోందట.. పాత కేబినెట్‌లో 11 మంది, కొత్త కేబినెట్‌లో 12 మంది కలిపి.. దాదాపు 23 మంది మాజీ, ప్రస్తుత మంత్రులు ఓడిపోవడం ఖాయం అని తేల్చి పారేసింది ఆ సంస్థ..
ప్రస్తుత మంత్రుల జాబితాలో మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లి నియోజకవర్గంలో గెలవడం కష్టమని, ఆయనపై టీడీపీ – జనసేన పొత్తు అభ్యర్ధి ఎవరు బరిలోకి దిగినా గెలవడం ఖాయమని వెల్లడించింది ఆ సంస్థ.. ఇటు, పారిశ్రామిక, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాధ్ సైతం ఈ దఫా అనకాపల్లి నుండి బరిలోకి దిగితే ఓడిపోవడం గ్యారంటీని తేల్చిచెప్పింది.. ఇటు, జగన్ సర్వేలలోనూ సేమ్ రిపోర్టులు వచ్చాయనే లీకులు వినిపించాయి. దీంతో, అమర్‌నాధ్ కోసం జగన్ మరో నియోజకవర్గం వేటలో ఉన్నారట.. ఇక, ఈ లిస్టులో ఓటమి అంచున్న మరో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. తణుకు అసెంబ్లీ సెగ్మెంట్ నుండి అసెంబ్లీలో అడుగుపెట్టిన కారుమూరికి ఈ దఫా గెలుపు అసాధ్యం అని తేల్చి పారేసింది ఈ సర్వే సంస్థ..
మరో మంత్రి, విడదల రజనీ సైతం ఇదే బాటలో పయనిస్తున్నారని సమాచారం. ఆమె గత ఎన్నికలలో చిలకలూరిపేట నియోజవర్గం నుండి రేసులో నిలిచారు. తొలిసారి ఎమ్‌ఎల్‌ఏగా గెలిచినా మంత్రి పదవి వరించింది.. ఈ దఫా ఆమెకు ఎదురీత తప్పదని రిపోర్టు ఇచ్చింది ఈ సంస్థ.. ఇదే బాటలో పయనిస్తున్నారు మరో మంత్రి ఆర్ కే రోజా. గత రెండు ఎన్నికలలో విజయాన్ని అందుకున్న ఆమె మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్నారు.. అయితే, ఆమె ఆశలు అడియాసలు అవడం ఖాయమని చెబుతోంది ఈ నిఘా సంస్థ..
ఈ లిస్టులో జోగి రమేష్, ఉషశ్రీ చరణ్, పినిపె విశ్వరూప్, అప్పల్రాజు, గుమ్మనూరి జయరాం, అంబటి రాంబాబు లాంటి వారి పేర్లు కూడా ఉన్నాయి . ఈ 11 మంది మంత్రులు తమ తమ నియోజకవర్గాలలో భారీ అసంతృప్తిని మూటగట్టుకోవడంతోపాటు, టీడీపీ – జనసేన పొత్తుతో వారి సొంత స్థానాలలో సమీకరణాలు మారిపోతున్నాయని లెక్కలు కట్టింది ఈ సంస్థ..
ఇక జగన్ పాత కేబినెట్‌లో ఏకంగా 12 మంది మంత్రులు ఇంటిబాట పట్టనున్నారట.. ఈ జాబితాలో ఆళ్ల నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీ రంగనాధ రాజు, అవంతి శ్రీనివాస్, శంకర్ నారాయణ, పుష్ప శ్రీ వాణి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కురసాల కన్నబాబు, సుచరిత, చెల్లుబోయిన వేణు గోపాల్, కె. నారాయణ స్వామి.. ఈ లిస్టులో ఉన్నారని వివరించింది ఈ సర్వే సంస్థ.. వీరిపై టీడీపీ జనసేన కూటమి అభ్యర్ధులు ఎవరు పోటీ చేసినా, ఓటమి తథ్యం అని చెబుతోంది.
ఈ స్థాయిలో అధికార పార్టీపై వ్యతిరేకత ఉందని వైసీపీ అధినేత జగన్‌కి సంకేతాలు అందడంతో ఆయన జాగ్రత్త పడుతున్నారని, ఏకంగా 40-50 మంది అభ్యర్ధులను మార్చి ఆ ప్రభావాన్ని తగ్గించుకునే ఎత్తులు వేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.. మరి, జగన్ దీనినుండి బయటపడడానికి ఎవరిపై ఎలాంటి కేసులు బనాయిస్తారో చూడాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..