నటసింహ నందమూరి బాలకృష్ణ .. ప్రస్తుతం అఖండ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల తాత్కాలికంగా వాయిదా పడిన చిత్రీకరణను తొందర్లోనే తిరిగి ప్రారంభించబోతున్నారు. సింహ, లెజెండ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ మూడో కాంబో పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు .. ఇటీవల విడుదలైన ‘అఖండ’ టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ ను తెచ్చుకొంది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాలయ్య తదుపరి సినిమా పై కూడా ఓ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. రవితేజ తో క్రాక్ మూవీ తీసి .. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేని బాలయ్య తదుపరి చిత్రానికి దర్శకుడు. రీసెంట్ గా గోపీచంద్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన బాలయ్య సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో బాలయ్య పోలీస్ గానూ, ఫ్యాక్షనిస్ట్ గానూ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. వేటపాలెంలో వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనల ప్రేరణతో గోపీచంద్ ఈ సినిమా కథను రూపొందించాడట.
ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కమల్ తనయ శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. శ్రుతి హాసన్ ఇంతకు ముందు సీనియర్ హీరోల సరసన పెద్దగా నటించలేదనే చెప్పాలి. అందుకే ఇప్పుడు బాలయ్య, శ్రుతి కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. గోపీచంద్ తెరకెక్కించిన బలుపు , క్రాక్ సినిమాల్లో వరుసగా శ్రుతి హాసన్ కథానాయికగా నటించినందున .. ఆ సెంటిమెంట్ తోనే ఈ సినిమాలో కూడా శ్రుతిని కథానాయికగా రిపీట్ చేస్తున్నాడట. ఈ జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళనున్న ఈ సినిమాకి శ్రుతి హాసన్ ఏ రేంజ్ లో హైలైట్ కానుందో చూడాలి.











