ఐదేళ్ల తర్వాత ఏపీలో టీడీపీ తిరిగి అధికారం చేపట్టింది. గడచిన ఐదేళ్లలో జగన్ సర్కారు పెట్టిన ఇబ్బందులను పంటి బిగువననే ఓర్చుకున్న టీడీపీ నేతలు… తిరిగి తమ పార్టీ అదికారంలోకి రాగానే ఒకింత కట్టు తప్పినట్టున్నారు. అయితే అటు ప్రభుత్వ వ్యవహారాల్లో నిత్యం బిజీగా కనిపించే టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు… పార్టీలో కనిపిస్తున్న ఈ పొరపాట్లను ఇట్టే పట్టేశారు. అంతే…ఏమాత్రం ఆలస్యం చేయకుండా కట్టు తప్పినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను వారి జిల్లాల నేతలతో కలిపి పిలిపిస్తూ ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ లు ఇవ్వడం మొదలుపెట్టారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ నేతలుగా కట్టుబాట్లు తప్పితే సహించేది లేదని తేల్చి చెబుతున్న చంద్రబాబు… ఇదే చివరి హెచ్చరిక అని, ఇకపై పద్దతి మార్చుకోకుంటే చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
బుధవారం తన సొంత జిల్లా చిత్తూరు నేతలతో సమావేశమైన సందర్భంగా చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో కొందరు పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావించిన చంద్రబాబు..ఇకనైనా అందరూ సర్దుకోవాల్సిందేనని ఆదేశించారు. పార్టీ విజయం కోసం శ్రమించిన కార్యకర్తలను నేతలు పట్టించుకోకపోవడం కూడా తన దృష్టికి వచ్చిందన్న చంద్రబాబు… పార్టీకి మూలస్తంభాలు కార్యకర్తలేనని గ్రహించాలని దిశానిర్దేశం చేశారు. అయినా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొందరు నేతలు ఇసుక మీద పడిపోవడం, భూకబ్జాలు చేసిన వైసీపీ నేతలతో కలిసిపోయి ఫిఫ్టీ, ఫిఫ్టీ అంటూ లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవడమేమిటని కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై తనకు పిర్యాదులేమీ రాకూడదని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే… ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీని ఒక్కతాటిపై నడిపే సీనియర్ నేతలు కరువయ్యారన్న విషయాన్ని గ్రహించిన చంద్రబాబు…పలమనేరు ఎమ్మెల్యేగా ఉన్న అమర్నాథరెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం. వాస్తవానికి అమర్నాథరెడ్డి పార్టీలో సీనియర్ మోస్ట్ నేత కిందే లెక్క. పలుమార్లు పలమనేరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన… 2014లో ఏర్పడ్డ టీడీపీ కేబినెట్ లో మంత్రిగానూ కొనసాగారు. అయితే తన సీనియారిటీని పెద్దగా పట్టించుకోని అమర్నాథరెడ్డి తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నారు. ఇదే విషయాన్ని గమనించిన చంద్రబాబు… అమర్నాథరెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. దీనిపై అమర్నాథరెడ్డికి చంద్రబాబు నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లు తెలుస్తోంది.