సినిమా రంగంలో హీరోగా సెటిలవ్వాలంటే ఇదే మంచి సమయం అని కొందరు గుర్తెరిగినట్లుంది. చకచకా సినిమాలు లేదా వెబ్ సిరీస్ లాంటివి చేసేసుకోవాలని వారు ఉబలాటపడుతున్నారు. దీనికి ప్రత్యేకమైన కారణం లేకపోలేదు. పెద్ద హీరోలు ఇప్పట్లో ఇంట్లోంచి బయటికి రారు. ఇక్కడ పెద్ద అంటే స్టార్ అని కాదు… బాగా డబ్బున్న హీరోలు అనుకోవచ్చు. వారికి రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. చేతినిండా డబ్బుంది… కూర్చుని తిన్నా తరగదు… అలాంటప్పుడు సినిమాలు చేసి కరోనాను తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా అన్నది వారి వాదన.
తక్కువ సిబ్బందితో సినిమాలు చేసుకోవడానికి అనుమతులు ఉన్నా వారు ముందుకు రాకపోవడానికి కారణం ఇదే. ఇలాంటి సమయంలో ఓ మాదిరి హీరోలు కాస్త ధైర్యం చేస్తే చాలు డబ్బుకు డబ్బు… అవకాశాలకు అవకాశాలు వచ్చేస్తాయి మరి. సత్యదేవ్ లాంటి హీరోలు దూసుకుపోవడానికి కారణం ఇదే మరి. ఓటీటీ లాంటి వాటికి కల్పవృక్షంలా సత్యదేవ్ మారాడు. వ్యాక్సిన్ వచ్చే వరకూ ఇంట్లో కూర్చోవాలన్న ఆలోచన సత్యదేవ్ కు లేదు. ఈ కరోనా కాలం చాలా వెబ్ సిరీస్ షూటింగులు చకచకా జరిగిపోతున్నాయి.
‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ అందులో ఒకటి. హీరో శ్రీకాంత్ లాంటి వారు కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నారు. పెద్ద దర్శకులు కూడా షూటింగులు జరపడానికి జంకుతున్నారు. దాంతో దర్శకత్వ అవకాశాల కోసం చూసేవారు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఎవరికి వారు తమ టీమ్ లతో షూటింగులు జరుపుకోడానికి సిద్దపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తక్కువ ఖర్చుతోనే వీటిని రూపొందించటానికి ఎవరికి వారు మొగ్గుచూపుతున్నారు. ఓటీటీలకు జనం కూడా అలవాటు పడటంతో వెబ్ సిరీస్ నిర్మాణం వైపు చాలా మంది మొగ్గుచూపుతున్నారు.
సెప్టెంబరు 1 నుంచి చాలా వెబ్ సిరీస్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే దాదాపు ఆరు నెలలుగా దర్శకులంతా ఇళ్లలోనే ఉండటంతో చాలామంది కథల మీద భారీగా కసరత్తులు చేసినట్లు సమాచారం. ఇప్పటికే చాలా కథలు తయారై పోయాయట. కాబట్టి కథల కోసం మాత్రం వెతుకులాడాల్సిన పరిస్థితి కనిపించడం లేదు.
ప్రస్తుత వాతావరణాన్ని బట్టి చూస్తుంటే మనకు పెద్ద హీరోల సినిమాలు ఇప్పట్లో మనముందుకు వచ్చే సూచనలు కనిపించడం లేదు.
కేవలం ఇప్పటివరకూ కొంతవరకు షూటింగ్ పూర్తిచేసుకున్నవాటిని మాత్రం కాస్త వెసులుబాటు దొరకగానే పూర్తిచేసేస్తారట. కేజీఎఫ్ 2 దర్శకుడు ప్రశాంత్ నీల్ లాగా ఎవరూ ముందుకు వచ్చి షూటింగులు చేసే ధైర్యం మాత్రం చేయడం లేదు. ‘మా హీరోలు ఒప్పుకోనప్పుడు మేం మాత్రం ఏంచేస్తాం’ అని వారంటున్నారు. అవకాశాల కోసం చూసే కొత్త దర్శకులు, హీరోలు ఈ అవకాశాన్ని వదులుకోకూడదనే ఆలోచనలో ఉన్నారు. సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ఆగడం లేదు.