
తన కింగ్ నాగార్జునకు యువరాజు నాగచైతన్య ‘థాంక్యూ’ చెప్పేశారు. ఈ థంక్యూ మరేమిటో కాదు చైతు కొత్త చిత్రం పేరే. ఈ అక్కినేని వారసుడు సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న‘లవ్ స్టోరీ’తర్వాత ఏమిటి అనే ప్రశ్నకు కూడా ఈరోజు సమాధానం దొరికేసింది. అది విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా అట. నాగార్జున పుట్టిన రోజును పురస్కరించుకుని అధికారికంగా ఈ సినిమా పేరును ప్రకటించేశారు. నాగచైతన్యకు ఇది 20 వ సినిమా అట.
“థాంక్యూ” ని శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి లు నిర్మించనున్నారు. నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నిర్మాతలు ‘థాంక్యూ’ పోస్టర్ ను విడుదల చేశారు. ఇంతకుముందు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య ‘మనం’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇందులో నాగ్ కూడా ఉంటారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు ప్రకటించారు. చైతూకి ఇందులో మూడు విభిన్న గెటప్పులు ఉంటాయని మాత్రం తెలుస్తోంది.











