(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
కరోనా వైరస్ దాటికి విశాఖలోని పలువురు న్యాయవాదులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా బార్ అసోసియేషన్‌లో గత పదిహేను రోజుల్లో 18 మంది న్యాయవాదులు మృత్యువాత పడడంతో ఇతర న్యాయవాదుల్లో ఆందోళన మొదలైంది. సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ సృష్టిస్తున్న భయం అంతా ఇంతా కాదు. అన్ని రంగాల ప్రముఖులను స్మశాన వాటిక వాటిక బాట పట్టిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా వైరస్ సోకుతుందో అంతు చిక్కక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు గుమ్మం తొక్కేందుకు కూడా న్యాయవాదులు హడలిపోతున్నారు. అసోసియేషన్ లెక్కల ప్రకారం జిల్లాకు చెందిన సుమారు 48 మంది న్యాయవాదులు ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు. విశాఖ నగరంలో ఉన్న బార్ అసోసియేషన్‌తో పాటు ఎలమంచిలి, అనకాపల్లి, చోడవరం, గాజువాక, భీమిలి బార్ అసోసియేషన్‌లు ఉన్నాయి. కేసుల ఒత్తిడి అధికంగా ఉన్న న్యాయవాదులు వైరస్ బారిన పడితే… ఆ ఒత్తిడి వారి ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. కరోనా కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఏడాది కాలంగా కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాయిదాలు నడిపిస్తున్నప్పటికీ, కోర్టుకు సమర్పించాల్సిన కొన్ని డాక్యుమెంట్ల కోసం న్యాయవాదులు నేరుగా కోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. కోర్టు ఆదేశాల సర్టిఫైడ్ కాపీలకు దరఖాస్తు చేయాలన్నా ప్రత్యక్షంగా కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే ఒకరి నుంచి ఒకరికి వైరస్ సోకుతోంది. ఒక్క మంగళవారం నాడు జిల్లా బార్ అసోసియేషన్‌లో ముగ్గురు న్యాయవాదులు ప్రాణాలు కోల్పోయారు.
జిల్లా కలెక్టర్‌కు వినతి..
విశాఖ బార్ అసోసియేషన్ న్యాయవాదులు వారి కుటుంబాలకు ప్రాణ రక్షణ కల్పించాలని కలెక్టర్‌కు అసోసియేషన్ అధ్యక్షుడు జి మహేశ్వర్‌రెడ్డి లేఖ రాశారు. అదేవిధంగా ప్రత్యేక డ్రైవ్‌తో వ్యాక్సినేషన్ చేయించాలని, ఆస్పత్రులలో ప్రత్యేక బెడ్లు కేటాయించాలని కోరారు. కోర్టు నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు.











