(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
దేశ వ్యాప్తంగా పెండింగ్‌లో వున్న పబ్లిక్ రంగ స్టీల్ కార్మికుల 2017 వేతన సవరణ కోసం స్టీల్ ఫేడరేషన్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 6న తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు అయోధ్య రామ్ తెలిపారు. సెయిల్, విశాఖ ఉక్కు, మైన్స్‌లలో మంచి వేతన సవరణ సాధించుకోవడానికి సమ్మె పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
మెడికల్ ఆక్సిజన్ సరఫరా..
కానీ ప్రస్తుతం కరోనా రెండవ వేవ్ విజృంభన వలన దేశవ్యాప్తంగా కరోనా బారిన పడిన దేశ ప్రజలకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ప్రాణాపాయ స్థితిలో అవసరమయిన మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు.ఆక్సిజన్ ఉత్పత్తి ఎక్కువగా స్టీల్ ప్లాంట్స్‌లో జరుగుతుండడం ఇక్కడి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుండడం వల్ల సమ్మె ప్రభావం ఉత్పత్తిపై పడి కరోనా రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు.
కొద్ది రోజులు వాయిదా
అదే విధంగా విశాఖ ఉక్కు కార్మికులు కూడా కరోనా బారిన పడకుండా కాపాడుకునేందుకు AISWF ఇచ్చిన పిలుపు మేరకు ఇతర సంఘాలతో కలిసి విశాఖ ఉక్కులో సమ్మెను కొద్ది రోజులు వాయిదా వేసుకుంటున్నామని విశాఖ ఉక్కు డైరెక్టర్ పర్సనల్ కిశోర్ చంద్రదాస్‌కి ఈ మేరకు లేఖ అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకుడు డి.ఆదినారాయణ మాట్లాడుతూ గతంలో డిమాండ్ చేసినట్లుగా స్టీల్ కార్మికులకు మంచి వేతన సవరణ త్వరితగతిన చేయాలని,కరోనా పరిస్థితులు చక్కపడే లోపు మంచి వేతన సవరణ చేయకుంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.











