ఏపీలో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా అంగన్ వాడీలు కదం తొక్కుతున్నారు. వారు చేస్తున్న నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్ వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె ఐదో రోజుకు చేరింది. తాజాగా వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపగా.. ఆ చర్చలు విఫలమయ్యాయి. అంగన్ వాడీలకు వేతనాలు పెంచేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. తమకు అతి తక్కువ జీతాలు ఇస్తున్నారని, చాలీచాలని ఆ జీతాలతో తమ ఇల్లు గడవడం కష్టమైందని అంగన్ వాడీ వర్కర్లు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అంగన్ వాడీ కేంద్రాలకు వర్కర్లు తాళాలు వేసి నిరసన తెలుపుతుండగా.. సచివాల ఉద్యోగులు వాటిని పగలగొడుతున్నారు. దీనిపై అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు తమ ఆందోళన విరమించేది లేదని అంగన్ వాడీలు తేల్చి చెప్పారు. ఈ సమ్మెను వారు మరింత భీభత్సంగా చేసే ఆలోచనతో కూడా ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు వినూత్న రీతిలో నిరసన చేపడుతున్నారు. అంగన్ వాడీలకు ఎన్నికల ముందు జగన్ ఎన్నో హామీలు ఇచ్చారు. తెలంగాణలో అంగన్ వాడీల కంటే ఎక్కువ జీతం ఇస్తామని అప్పట్లో జగన్ హామీ ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్ వాడీలకు గ్రాట్యుటీ అమలు చేస్తానని, మినీ అంగన్ వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చుతానని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలకు పెంచి పెన్షన్ 50 శాతం ఇస్తామని జగన్ హామీలు ఇచ్చారు. ఎఫ్ఆర్ఎస్ కూడా రద్దు చేస్తామని చెప్పారు. కానీ, ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ వైఎస్ జగన్ వాటిని పట్టించుకోకపోవడంతో అంగన్ వాడీలు ఆందోళనకు దిగారు. సీఎం అలవిగాని హామీలు ఇచ్చి అంగన్ వాడీలను నిలువునా ముంచారని విమర్శించారు. ఏపీలో 55,607 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. దాదాపుగా లక్ష మంది వరకు అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు పని చేస్తుండగా.. తాజాగా వీరంతా సమ్మె బాట పట్టారు.
తెలంగాణ రాష్ట్రంతో సమానంగా అంగన్ వాడీల జీతం పెంచకపోగా ఆదాయ పరిమితి అంటూ వారికి సంక్షేమంలో కూడా కోత పెట్టారు. జీతాలు పెంచక, సంక్షేమ పథకాలు అందించక పోతే అంగన్ వాడీలు ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో అంగన్ వాడీలకు రూ.4,200గా ఉన్న జీతాన్ని చంద్రబాబు రూ.10,500 కు పెంచారు. అయితే, అంగన్ వాడీల న్యాయపోరాటానికి తెలుగుదేశం పూర్తి మద్దతు పలికింది. టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్ వాడీల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేరుస్తామని ప్రకటించింది. సంక్షేమ పథకాలను కూడా వారికి వర్తింపజేస్తామని వెల్లడించింది.
తెలంగాణలో అంగన్ వాడీ టీచర్ల జీతం రూ.10,500 నుంచి రూ.13,650 కి 2021లో చేశారు. మినీ అంగన్ వాడీ టీచర్ల జీతం అప్పుడే రూ.6 వేల నుంచి రూ.7,800కు పెంచారు. వీరితో పాటు హెల్పర్లు/ఆయాల జీతం రూ.6 వేల నుంచి రూ.7,800కు పెంచారు. తాజాగా సంబంధిత శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి సీతక్క.. తెలంగాణలో ఇప్పటివరకు మినీ అంగన్ వాడీలుగా ఉన్న సెంటర్లను ప్రధాన అంగన్ వాడీ కేంద్రాలుగా మారుస్తూ రూపొందించిన ఫైలుపై తొలి సంతకం చేశారు.