వైసీపీ హాయాంలో ఇసుక దోపిడీ రాష్ట్రమంతా యథేచ్ఛగా సాగింది. అన్ని చోట్ల ఎక్కడికక్కడ వైసీపీ నేతలు అక్రమంగా ఇసుక తవ్వడం బ్లాక్ భారీ రేట్లకు అమ్ముకొని భారీగా సొమ్ము వెనకేసుకోవడం జరిగింది. పెద్దిరెడ్డి లాంటివారైతే అడ్డూ అదుపూ లేకుండా ఇసుకతో అక్రమాలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇసుకను ఉచితం చేసేశారు. కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేసేలా కొత్త విధానం తెచ్చారు. అయినప్పటికీ రవాణా ఛార్జీలపై కాస్త ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి.
దీంతో చంద్రబాబు జోక్యం చేసుకొని అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు మేలు జరిగేలా తెచ్చిన ఉచిత ఇసుక విధానంలో గందరగోళ పరిస్థితులు ఎందుకు వచ్చాయని చంద్రబాబు ప్రశ్నించారు. గతంలో కన్నా ఇప్పుడే ధరలు పెరిగాయన్న ఆరోపణలు ఎందుకొస్తున్నాయని.. ఆ రవాణా చార్జీలు ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలు అనుకుంటున్నారా అని చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు బుధవారం గనులశాఖపై సమీక్ష జరిపారు. దీంతో ఇసుక తవ్వకం, రవాణా చార్జీల రూపంలో ప్రజలపై భారం పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
‘‘రవాణా చార్జీలు భారంగా మారాయని ఇసుక వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఆ ఛార్జీలు ప్రభుత్వం వసూలు చేయడం ఏమిటి? రాష్ట్రమంతా ఆన్‌లైన్ పర్మిట్ విధానం తీసుకురండి. గ్రామ సచివాలయాల్లో ప్రజలు ఆన్‌లైన్ పర్మిట్లు తీసుకునేలా ఏర్పాట్లు చేయండి. ఇసుక బుక్ చేసుకున్నవారే, ఇసుక రవాణాకు వాహనాలు రీచ్‌కు లేదా డిపోకు తీసుకొని వెళ్లేలా అనుమతి ఇవ్వండి. దీని వల్ల రవాణా చార్జీలు ఏ మేరకు ఉంటాయో స్వయంగా వారికే తెలుస్తుంది. అలాగని, వాహనదారులు అడ్డగోలుగా రవాణా చార్జీలు వసూలు చేయకుండా నియంత్రించండి’’ అని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఇసుక తవ్వినందుకు లేబర్ చార్జీలు, రీచ్ నుంచి డిపోకు, అక్కడి నుంచి వినియోగదారునికి చేరడానికి రవాణా చార్జీలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అధికారులు చంద్రబాబుకు తెలిపారు. దీంతో మీరు కూడా రొటీన్‌గా వస్తే ఎలా? అధ్యయనం చేసి పరిష్కారం కనిపెట్టండని అని అధికారులకు సీఎం హెచ్చరించారు. రవాణా భారం తగ్గించే విషయంలో అధికారులు ప్రజలతో మాట్లాడి వారి సూచనలు, సలహాలను తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.











