మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపడంలో తనకు తానే సాటి అని నటుడు సోనూ సూద్ ఎన్నో సందర్భాల్లో రుజువు చేసుకున్నారు. ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు సోనూ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఏపీ నుంచే ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రస్తుత భయానక కోవిడ్ పరిస్థితుల నుంచి ఎక్కువమందిని రక్షించాలంటే ఆక్సిజన్ అత్యవసరం. సోనూ సూద్ ప్రకటించిన రెండు ప్లాంట్లను ఏపీలోనే ఏర్పాటుచేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ట్విట్టర్ లో ప్రకటించారు.
ఒకటి కర్నూలులోనూ, మరొకటి నెల్లూరు లోనూ ఏర్పాటుచేస్తారు. ఇప్పటికే యుఎస్, ఫ్రాన్స్ నుండి ఆక్సిజన్ ప్లాంట్లు వస్తున్నాయి. వీటిని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసే పనిలో ఆయన సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. దీనికోసం మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, ఇతర సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులను కూడా తీసుకున్నారు. ‘సోనూ సూద్ మానవత్వ ఆలోచనలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆయన ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్ ప్లాంట్ ప్రతిరోజూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 150 నుండి 200 మంది కోవిడ్ రోగుల చికిత్సకు ఉపయోగపడుతుంది’ అని కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి అన్నారు.
ఈ ప్లాంట్ల ఏర్పాట్లపై సోనూ స్పందిస్తూ ‘గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఈ ప్లాంట్లు చాలా అవసరం. ఈ ప్లాంట్స్ కోవిడ్ -19 తో ధైర్యంగా పోరాడటానికి సహాయపడతాయని భావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ తరువా జూన్, జూలై మధ్య మరికొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నాం. వివిధ రాష్ట్రాల్లోని అత్యవసర సహాయం అవసరమైన ఆస్పత్రులను మేము గుర్తించాం’ అని వివరించారు.
ఇంటికే సోనూ ఆక్సిజన్
హైదరాబాద్‌కు చెందిన ఓ కరోనా బాధితుడి ఇంటికి నేరుగా ఆక్సిజన్ సిలిండర్‌నే పంపారు సోనూ. నల్లకుంటకు చెందిన రాఘవ శర్మ(75) ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయన హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. రాఘవ శర్మలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడ్ంతో సాయం చేయాలంటూ ఆయన కుమారుడు లక్ష్మీనారాయణ ట్విట్టర్ ద్వారా సోనూ సూద్ సాయం కోరారు.
ఈ ట్వీట్‌కు స్పందించిన సోనూసూద్ తన ఫౌండేషన్ ద్వారా ఆక్సిజన్ యంత్రాన్ని వారి ఇంటికి పంపించాడు. గురువారం రాత్రి బతుకమ్మకుంట గోకుల్ స్వీట్ షాప్ ఎదురు వీధిలో ఉన్న రాఘవ శర్మ ఇంటికి కొరియర్ ప్రతినిధి వెళ్లారు. వారికి ఆక్సిజన్ మిషన్ అందజేయడంతో రాఘవ కుటుంబ సభ్యులు సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Must Read ;- కష్టకాలంలో హర్భజన్ కూ సోను సాయం : దేవుడు ఉన్నాడంటూ ట్వీట్











