సేవ… ఎవరికైనా తృప్తిని ఇచ్చే లక్షణం.అయితే ఆ లక్షణం అందరిలోనూ ఉండదు.ఈ లక్షణం ఉన్న వారు మాత్రం తమలోని అవిటి తనాన్ని సైతం జయించేసి అందరి కళ్లనూ తెరిపించేస్తారు.ఇప్పుడు ఈ తరహా మాటలెందుకంటే… మన తెలుగు అమ్మాయి.. అందులోనూ అంధురాలు… సేవలో తనను మించిన వారు ఎవరూ లేరని నిరూపించేసింది కాబట్టి. అంతేకాదండోయ్…కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న వారికి తానున్నానంటూ ఇతోధికంగా సాయం చేస్తూ… సినీ లైఫ్‌లో విలన్ పాత్రలు పోషిస్తూ.. నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా అవతరించిన సోనూ సూద్‌నే ఈ మహిళ విరాళం ఇచ్చి మరీ అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.ఇలాంటి స్ఫూర్తి నింపే కథలు కచ్చితంగా చెప్పుకుని తీరాలి. అందరికీ తెలిసేలా చేయాలి.జనంలోని దాన గుణాన్ని తట్టి లేపాలి. అందుకే… ఈ మహిళ కథ మనం తెలుసుకోవాలి.
కళ్లు లేకపోయినా ఇంపుగా పలికే తన గాత్రంతో..
బొడ్డు నాగలక్ష్మిది ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలం ఆండ్రావారిపల్లె. అంధురాలైన నాగలక్ష్మి…తనకు లోకం చూసే అవకాశం లేదన్న భావనను ఏనాడూ దరిచేరనీయలేదు.తనలోని అవిటితనాన్ని అల్లంత దూరం పారదోలిన నాగలక్ష్మి…తన శరీరంలో పనిచేస్తున్న అవయవాలతో ఏం చేయగలనన్న విషయాన్ని నిర్ధారించుకుంది.కళ్లు లేకపోయినా… ఇంపుగా పలికే తన గాత్రంతో నెట్టింట్ ఎంట్రీ ఇచ్చింది.యూట్యూబ్ వేదికగా పలు వీడియోలు విడుదల చేసింది.ఆయా మాండలికాల్లో నాగలక్ష్మి విడుదల చేసిన వీడియోలు బాగానే జనాదరణ పొందాయి.
సమాజానికి తనవంతుగా సాయం చేయాలన్న తపన
ఇదిలా ఉంటే… అంధురాలిని అన్న భావనను ఎప్పుడో మరిచిపోయిన నాగలక్ష్మికి సమాజానికి తనవంతుగా ఏదైనా సాయం చేయాలన్న తపన కూడా ఎంతో ఉందనే చెప్పాలి.ఇలాంటి క్రమంలో గతేడాది విశ్వవ్యాప్తంగా కరోనా విరుచుకపడటంతో వలస కూలీల వెతలు చూసి చాలా మంది దాతృత్వ గుణం ఉన్న వారు చలించిపోయారు.వారిలో అందరి కంటే కూడా మెరుగైన సేవలు అందించడం ద్వారా ప్రముఖ సినీ నటుడు \సోనూ సూద్ అందరికీ ఆదర్శంగా నిలిచారు.అసలు తన వద్ద ఎంత డబ్బు ఉందన్న విషయాన్నే పట్టించుకోకుండా సాయం అడిగిన ప్రతి ఒక్కరికీ తనదైన శైలిలో చేయూతనందించిన సోనూ.. సినిమాల్లో విలన్ పాత్రలేసినా… నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అయిపోయారు.కరోనా తొలి దశ నుంచే సేవా కార్యక్రమాలు మొదలెట్టిన సోనూ… ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏకంగా సోనూ సూద్ ఫౌండేషన్ పేరిట ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి మరీ సేవలు అందిస్తున్నారు.
Must Read ;- పెను ప్రమాదం నుంచి కోవిడ్ రోగులను రక్షించిన సోనూ బృందం
పెన్షన్ రూ.15 వేలు సోనూ సూద్ ఫౌండేషన్‌కు..
యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే నాగలక్ష్మి…సోనూ సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలను నిత్యం తెలుసుకుంటూనే ఉన్నారు.ఈ క్రమంలో తనవంతుగా సోనూ సూద్ ఫౌండేషన్‌కు సాయం చేయాలని తలచారు.అయితే అంధురాలైన నాగలక్ష్మికి పెద్దగా సంపాదన ఏమీ లేదు.విభిన్న ప్రతిభావంతుల కోటాలో ప్రభుత్వం ఇచ్చే నెలవారీ పెన్షన్‌తోనే ఆమె కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి. అయితేనేం… సోనూ సూద్ ఫౌండేషన్‌కు సాయం చేయాలని తలచిన వెంటనే… గడచిన ఐదు నెలలుగా తనకు వచ్చిన పెన్షన్‌ను దాచిపెట్టిన నాగలక్ష్మి… ఆ మొత్తం రూ.15వేలను సోనూ సూద్ ఫౌండేషన్‌కు అందించారు.ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ నిజంగానే అమితాశ్చర్యానికి గురయ్యారు. సినిమా అవకాశాల ద్వారా తనదైన రేంజిలో సంపాదిస్తున్న తనలాంటి వారు ఎంతోకొంత సాయం చేసేందుకే తటపటాయిస్తుంటే… జీవనోపాధికి కూడా ఇతరులపై ఆధారపడే నాగలక్ష్మి తన ఫౌండేషన్ కు తన వంతు సాయం పంపడం చూసి నిజంగానే షాకయ్యారట.
దేశంలో అత్యంత ధనవంతురాలంటూ సోనూ ప్రశంసలు
అంతే… నాగలక్ష్మి వివరాలను సేకరించిన సోనూ సూద్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాగలక్ష్మికి ఫోన్ చేశారట. తన సంస్థకు పంపిన విరాళం విషయాన్ని ప్రస్తావించిన సోనూ సూద్ తన వరకు ఈ దేశంలో అత్యంత ధనవంతురాలు నాగలక్ష్మినే అంటూ ప్రశంసలు కురిపించారు.ఇతరుల బాధను చూడటానికి నేత్రాలు అవసరం లేదు.. మంచి మనసుంటే చాలు అని నాగలక్ష్మి మరోసారి నిరూపించారని కొనియాడారు. ఆమె నిజమైన హీరో అంటూ సోనూ ప్రశంసించారు. ఈ విషయాన్ని సోనూ సూద్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీంతో నాగలక్ష్మిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read ;- రండి.. కలిసి లంచ్ చేద్దాం : శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ కు సోనూ సూద్ ఆహ్వానం