ఓ పక్క కరోనా తో బాధపడుతున్నా తన సేవాభావాన్ని మాత్రం నటుడు సోనూ సూద్ వదులుకోలేదు. కోవిడ్ తో బాధపడుతున్న రోగిని నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించి తన దాన గుణాన్ని మరోసారి చాటుకున్నారు. ఆ రోగిని నాగపూర్ నుంచి ఎయిర్ అంబులెన్స్ లో హైదరాబాద్ కు పంపే ఏర్పాటుచేశారు. వివరాల్లోకి వెళితే కోవిడ్ -19 కారణంగా భారతి అనే అమ్మాయి దాదాపు 85-90శాతం ఊపిరితిత్తులను కోల్పోయింది, సోనూ ఆమెను నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో హైదరాబాద్ కు తరలించారు.
అపోలో ఆసుపత్రిలో మాత్రమే చికిత్స సాధ్యమని వెంటనే అపోలో ఆస్పత్రుల డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపారు. ఎక్మో అనే ప్రత్యేక చికిత్స అపోలోలో అందుబాటులో ఉందని తెలుసుకున్నారు. శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని ఈ పరికరంతో తొలగించవచ్చు. ఈ ఎక్మో చికిత్స కోసం మొత్తం సెటప్ హైదరాబాద్ నుంచి 6 మంది వైద్యులతో ఒక రోజు ముందుగానే రావాలి. ఇందుకోసం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో భారతికి ఉత్తమమైన చికిత్సను అందించారు.
దీనిపై సోనూ సూద్ మాట్లాడుతూ ‘అవకాశాలు 20శాతం మాత్రమే అని వైద్యులు తెలిపారు. ఆమె 25 ఏళ్ల యువతి. అందుకే మేము ఈ అవకాశాన్ని తీసుకున్నాం. వెంటనే ఎయిర్ అబులెన్సు బుక్ చేశాం. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స బాగా జరుగుతోంది. ఆమె కోలుకొని త్వరలో తిరిగి వస్తుంది ’ అని వివరించారు. కోవిడ్ సమయంలో ఒకరి వ్యక్తిని విమానంలో చికిత్సకు తీసుకురావడం ఇదే మొదటిసారి. భారతి తండ్రి రిటైర్డ్ రైల్వే అధికారి. సోనూ కరోనాతో చికిత్స తీసుకుంటున్నా ఇలా స్పందించడం మాత్రం అభినందనీయం. అందుకే ఆయన రియల్ హీరో అని మరోసారి నిరూపించుకున్నారు.











