ఏపీలో టీడీపీ నేత, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అరెస్టు చేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు కొన్ని దశాబ్దాలుగా సంగం డెయిరీపై అధిపత్యం సాధించేందుకు జరుగుతున్న రాజకీయపోరుగా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక అమూల్ డెయిరీకి ప్రాధాన్యం ఇస్తున్న వైసీపీ సర్కారు.. ఏపీలో ఉన్న ఇతర డెయిరీలపై కక్ష సాధింపు చేస్తోందనే విమర్శలూ మొదలయ్యాయి. మొత్తం మీద ఏపీలో కొన్నాళ్లుగా డెయిరీలపై వైసీపీ ఆధిపత్యం చలాయిచేందుకు పావులు కదుపుతోందని చెప్పవచ్చు. నంద్యాల విజయ డెయిరీపై 25ఏళ్ల భూమా కుటుంబ ఆధిపత్యానికి గండికొట్టిన వైసీపీ సర్కారు తాజాగా సంగం డెయిరీని టార్గెట్ చేసిందనే విమర్శలున్నాయి.
ఇదీ కేసు..
2019 నుంచి సంగం డెయిరీ ఛైర్మన్‌గా ధూళిపాళ్ల నరేంద్ర వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంగం డెయిరీపై పలు ఆరోపణలు చేసింది. రైతుల నుంచి తక్కువ ధరకు పాలు కొని ఎక్కువగా అమ్ముతున్నారని ఒక ఆరోపణ కాగా, కంపెనీల చట్టం పరిధిలోకి సంగం డెయిరీ వచ్చాక ఛైర్మన్‌కే ఎక్కువ అధికారాలుండేలా చూసుకున్నారని మరో ఆరోపణ. దీంతోపాటు కొంత కాలం క్రితం డెయిరీలో దాదాపు రూ.70 లక్షల దొంగతనం కూడా జరిగింది. ఆ కేసును పోలీసులు ఛేదించారు. అయితే వైసీపీ మాత్రం టీడీపీపై ఆరోపణలు చేసింది. ఇవి కాకుండా ఇతరత్రా అవకవతకలు జరిగాయని, టెట్రా ప్యాక్ విభాగం ఏర్పాటు డెయిరీకి భారంగా మారిందని పలు విమర్శలూ వచ్చాయి. దీంతో ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన ఏసీబీ శుక్రవారం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసింది. పొన్నూరు మండలం చింతలపూడిలో ఆయనను అరెస్ట్ చేశారు. ధూళిపాళ్లపై 408, 409, 418, 420, 465, 471, 120బి సెక్షన్ల కింద కేసు నమోదైంది.
దేశంలోనే అగ్రగామిగా..
దేశంలోనే సంగం డెయిరీ అగ్రగామి సంస్థలో ఒకటిగా నిలిచింది. 2013-14లో పాల ఉత్పత్తి దారుల సహకార సంఘాలు, సర్వసభ్య సభల తీర్మానం మేరకు సహకార సంఘాల చట్టం పరిధి నుంచి ప్రైవేటు కంపెనీ చట్ట పరిధిలోకి తెచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ డెయిరీని మళ్లీ సహకార పరిధిలోకి తేవాలని ప్రయత్నించిందన్న చర్చ కూడా గతంలో జరిగింది. ఆర్డినెన్స్ ద్వారా తమ పంతం నెగ్గించుకునేందుకు సిద్ధమైందన్న అనుమానాలు గతంలో వచ్చాయి. సంగం డెయిరీతో పాటు ప్రకాశం జిల్లా డెయిరీ కూడా కంపెనీ చట్ట పరిధిలోనే ఉన్నా అక్కడ పాలకవర్గం లేకపోవడంతో వైసీపీ సర్కారు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదనే చర్చ కూడా జరిగింది. ఇక డెయిరీ ఏర్పాటు విషయానికి వస్తే గుంటూరు-తెనాలి మార్గంలో జాగర్లమూడి సమీపంలో 1977లో యడ్లపాటి వెంకటరావు వ్యవస్థాపక ఛైర్మన్‌గా సంగం డెయిరీ ఏర్పాటైంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పాల సేకరణ చేయడంతో పాటు సహకార సంఘాలూ ఏర్పాటయ్యయి. ప్రత్యక్షంగా 13వేల కుటుంబాలు ఈ డెయిరీపై ఆధారపడ్డాయి. దాదాపు 18వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది.డెయిరీ ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయడం దేశంలోనే రికార్డుగా నిలిచింది. సభ్యులకు రాయితీపై వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ ఆసుపత్రి ఏర్పాటైంది. 1978లో రూ.4 కోట్లుగా ఉన్న టర్నోవర్ ప్రస్తుతం రూ. 913కోట్లకు చేరింది. రూ.వేల కోట్ల ఆస్తులతో పాటు రూ.160 కోట్ల ఎఫ్‌డీలూ డెయిరీ పేరుతో ఉన్నాయి. లాభాల్లో పాడి రైతులకు, ఉద్యోగులకు వాటాలుగా ఇవ్వడం నిరంతరం జరుగుతుండడంతో దేశంలోని అగ్రగామి డెయిరీల్లో సంగం డెయిరీ ఒకటిగా నిలిచింది.
సుప్రీం వరకు వెళ్లిన డెయిరీ..
ఈ డెయిరీపై ఆధిపత్యం కోసం పలుమార్లు గతంలో పలు ప్రభుత్వాలు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. 1989, 2004-08, 2011-14 మధ్య కాలంలో పలుమార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి ఆర్డినెన్స్ తెస్తూ ఆదేశాలు ఇచ్చారు. అప్పట్లో ఛైర్మన్‌గా ఉన్న కిలారి రాజన్‌తో పాటు పాలకవర్గం న్యాయస్థానాన్నిఆశ్రయించింది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా డెయిరీకి అనుకూలంగా తీర్పు నిచ్చింది. ఈ పరిస్థితుల నుంచి దూరంగా ఉండేందుకు సంగం డెయిరీని సర్వసభ్య ఆమోదంతో కంపెనీల చట్టం పరిధిలోకి వచ్చేలా ధూళిపాళ్ల నరేంద్ర చర్యలు తీసుకున్నారని పలువురు అధికారులు అభిప్రాయ పడుతున్నారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ డెయిరీని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయని చెప్పవచ్చు.
గతంలో చాలా డెయిరీలు..
తెలుగు రాష్ట్రాల్లో పాల ఉత్పత్తి దారుల సహాయ పరపతి సంఘాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే 1974 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. 1981లో మూడంచెల సహకార వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి పరపతి సంఘాలు ఏర్పాటయ్యాయి. వ్యవసాయ పరపతి సంఘాలు, పాల ఉత్పత్తిదారుల పరపతి సంఘాలు అందులో భాగంగా ఏర్పాటైనవే. తరువాత కాలంలో రాజకీయ జోక్యం ఎక్కువైన నేపథ్యంలో కొన్ని డెయిరీలు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలుగా మారి..కంపెనీల చట్టం పరిధిలోకి వెళ్లాయి. ప్రభుత్వ జోక్యానికి చెక్ పెట్టడమే ఇందుకు కారణంగా కొందరు చెబుతున్నారు.
అమూల్ కోసమేనా..
కాగా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అమూల్ సంస్థను రాష్ట్రంలోకి అనుమతించింది. దాదాపు 5వేల కోట్ల విలువైన భూములు అప్పగించడం లేదా మౌలిక సదుపాయాలను కల్పించింది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో భూ సేకరణకు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఉన్న విజయ డెయిరీ, సంగం డెయిరీ, విశాఖ, చిత్తూరు డెయిరీలను మరింత పటిష్టం చేసే చర్యలకు బదులు అమూల్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఏంటనే చర్చ మొదలైంది. అప్పటి నుంచి పలు డెయిరీల పాలకవర్గాలు, ముఖ్యంగా సంగం డెయిరీ ఈ చర్యలను వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో ఐదుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల ఈ డెయిరీకి ఛైర్మన్ గా ఉండడాన్ని కూడా వైసీపీ సర్కారు జీర్ణించుకోలేకపోతోందని, ఎలాగైనా సరే సంగం డెయిరీని చేజక్కించుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందని, డెయిరీ ఆస్తులపై కన్నేసిందని విమర్శలూ వచ్చాయి. అదే సమయంలో వైసీపీ నేతలతో పాటు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య సంగం డెయిరీ పాలకవర్గంపై పలు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రైతులకు మేలు చేసేందుకు అమూల్ సంస్థను రాష్ట్రంలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. సంఘం డెయిరీలో తక్కువ వెన్న శాతం ఉన్న ఆవు పాలను 70 శాతంపైగా సేకరించి వాటికి అధిక వెన్న శాతం ఉన్న గేదే పాలను కలిపి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఛైర్మన్ తోపాటు పాలకవర్గంపై పలు ఆరోపణలు చేశారు.
దీనిపై పాలకవర్గంతో పాటు ఛైర్మన్ ధూళిపాళ్ల కూడా స్పందించారు. బినామీ పేర్లతో రైతులున్నట్లు ప్రభుత్వం నిరూపించాలని, ఎలాంటి విచారణకైనా సిద్దమన్నారు. అమూల్ సంస్థకి ఒక న్యాయం, రాష్ట్రంలోని ఇతర డెయిరీలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. గుజరాత్‌లో అమూల్ సంస్థ ఇస్తున్న ధరలను, ఇక్కడ ఇస్తున్న ధరలను చూడాలని, ఏ విధంగా రైతులకు మేలు చేస్తున్నట్లు చెబుతారని ప్రశ్నించారు.
అమూల్‌కి ఇంత ప్రాధాన్యమా?
కాగా అమూల్ సంస్థకి ఇస్తున్న ప్రాధాన్యంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో అమూల్ సంస్థకు పాలసేకరణ కేంద్రం కోసం 40 నుంచి 50 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలో ఐదుసెంట్లకు తగ్గకుండా భూమి ఇవ్వాలని నిర్ణయం జరిగింది. బల్క్‌మిల్క్ కలెక్షన్ యూనిట్ల కోసం ఒక్కో గ్రామానికి రూ.15.74 లక్షలు, సేకరణ కేంద్రం ఏర్పాటు (పైల్ ఫౌండేషన్) కోసం ఒక్కోదానికి రూ.18.04 లక్షలు కేటాయిస్తున్నట్లు గతంలో కొన్ని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కేంద్రం సమీపంలో నీటి కుళాయి కనెక్షన్లు, విద్యుత్తు కనెక్షన్లు కల్పించాల్సిన బాధ్యత అధికారులకే అప్పజెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా నిర్మించేందుకు కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నిర్ణయాల నేపథ్యంలో అమూల్ సంస్థకు ఇంత ప్రాధాన్యం ఏంటనే ప్రశ్నతో పాటు ఇప్పటికే ఉన్న డెయిరీల పటిష్టతకు చర్యలు తీసుకోవచ్చు కదా అనే సందేహాలూ మొదలయ్యాయి.
Also Read ;- ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో జగన్ రాక్షస ఆనందం : నారా లోకేశ్
రెండుసార్లు సంగం డెయిరీ టెండరు రద్దు..
ఇక వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక సంగం డెయిరీకి సంబంధించి ఏ పనినీ సవ్యంగా జరగనీయడం లేదని కొందరు నాయకులు విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ దుర్గగుడికి సంబంధించిన టెండరు అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. అమ్మవారి ప్రసాదాలు, లడ్డూల తయారీకి ప్రతినెలా 12వేల కిలోల నెయ్యి అవసరం ఉంటుంది. ఇందుకు సంబంధించి టెండర్లూ పిలిచారు. అయితే సంగం డెయిరీ ఒక్కటే టెండరు దాఖలు చేసింది. సింగిల్ టెండర్ దాఖలు కావడంతో ఆ టెండర్‌ను రద్దుచేసి రెండోసారి మళ్లీ పిలిచారు. రెండోసారి కూడా సంగం డెయిరీ ఒక్కటే టెండరు దాఖలు చేసింది. అయితే సింగిల్ టెండరు వచ్చిన టెండర్లను రద్దుచేసే అధికారం ఉన్నా.. ఇతర డెయిరీలు ఎందుకు రాలేదన్న అంశంపై ప్రభుత్వం కనీసం ఆలోచించలేదని, పాత టెండరులో పెద్దగా ఎలాంటి మార్పులు లేకుండానే రెండో టెండరు పిలిచారని, లాభాపేక్ష లేకుండా సంగం డెయిరీ టెండరును దాఖలు చేసినా.. రద్దు చేశారనే విమర్శలూ వచ్చాయి. పాల ఉత్పత్తి దారుల సమాఖ్య నుంచి మ్యాక్స్ చట్ట పరిధిలోకి, అక్కడి నుంచి ప్రొడ్యూసర్స్ కంపెనీకి సగం డెయిరీ మారినా అంతా నిబంధనల ప్రకారమే జరిగినా..ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా కక్ష సాధిస్తోందనే విమర్శలు టీడీపీ వైపు నుంచి వస్తున్నాయి.
పార్టీ కంటే రైతులే ప్రాధాన్యమని..
గతంలో ఫెడరేషన్ పరిధిలో ఉండే సంగం డెయిరీ మ్యాక్స్ చట్ట పరిధిలోకి, అక్కడి నుంచి కంపెనీ చట్టం పరిధిలోకి వచ్చింది. అయితే 1995లో వచ్చిన మ్యాక్స్ చట్ట పరిధిలో నుంచి కంపెనీల చట్టం పరిధిలోకి రావాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న గతంలోనూ తలెత్తింది. డెయిరీ ఆస్తుల పరిరక్షణకే అని పాలకవర్గం ప్రకటించింది. విస్తరణకు అవకాశాలూ మెరుగుపడతాయని చెప్పింది. మ్యాక్స్ పరిధిలో నుంచి కంపెనీల చట్టం పరిధిలోకి డెయిరీని తీసుకురావడంపై అప్పట్లో చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజకీయ ఆధిపత్య పోరు కారణంగా డెయిరీని ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదని, డెయిరీ పరిరక్షణకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ధూళిపాళ్ల వివరణ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.
ఎమ్మెల్యేగా ఓడినా..
కాగా ధూళిపాళ్ల 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. ప్రతిష్టాత్మక సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉండడాన్ని వైసీపీ సర్కారు జీర్ణించుకోలేకపోతోందన్న విమర్శలు ఇప్పటికే వచ్చాయి. జిల్లాలోని పలువురు వైసీపీ నేతలు కొన్నాళ్లుగా డెయిరీ కార్యకలాపాల విషయంలో ఎప్పుడు ఏ అవకాశం దొరకుతుందా అని వేచి చూస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. డెయిరీలో ధూళిపాళ్లకు ఎలాగైనా బ్రేకులు వేయాలని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆయన కుటుంబీకులు, పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్యలు ప్రయత్నిస్తున్నారని, వారికి నరేంద్ర అసలు మింగుడుపడటం లేదని ఇప్పటికే టీడీపీ ఆరోపించింది.
Must Read ;- సంగం డెయిరీని దెబ్బతీసేందుకే దూళిపాళ్ల అక్రమ అరెస్ట్ : చంద్రబాబునాయుడు