బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి కారణంగా 48 ఏళ్ల దాదా ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం గంగూలీ వ్యాయామం చేస్తుండగా ఛాతిలో నొప్పి ప్రారంభమైంది. శనివారం సైతం ఆ నొప్పి మళ్లీ రావడంతో.. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్చారు.
“ఛాతి నొప్పితో గంగూలీ ఆస్పత్రికి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా.. అనే విషయమై పరీక్షలు చేయాల్సి ఉంది.” అని వైద్యులు తెలిపారు.
బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. గతంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. కెప్టెన్‌గా సుదీర్ఘ కాలం పాటు సేవ చేశారు. గంగూలీ సారథ్యంలో భారత జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకుంది. గంగూలీ 113 టెస్ట్, 311 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. టెస్టుల్లో 7,212 పరుగులు సాధించారు. ఇందులో 16 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 11,363 పరుగులు చేశారు. ఇందులో 22 సెంచరీలు, 72 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఇక.. బౌలింగ్ విషయానికి వస్తే… వన్డేల్లో 100, టెస్టుల్లో 32 వికెట్లను పడగొట్టారు. 2012 వరకూ ఐపీఎల్‌లోనూ దాదా ఆడారు. 2008-10 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్, 2011-12 వరకు పుణె వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.











