గత అక్టోబరులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై, హైకోర్టు సీజేగా పనిచేసి ఇటీవలే బదిలీ అయిన జస్టిస్ జేకే మహేశ్వరిలపై ఆరోపణలు చేస్తూ ఏపీ సీఎం జగన్ లేఖ రాయడం, ఆ లేఖను బయటపెట్టడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే రెండునెలల తరువాత తెలంగాణ, ఏపీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో నిన్న ఇండియన్ఎక్స్ ప్రెస్ పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. ఆ కథనం ప్రకారం.. జగన్ చేసిన ఫిర్యాదుపై సీజేఐ స్పందించారని, జగన్ ను అఫిడవిట్ రూపంలో ఆ ఫిర్యాదును అడిగారని, అదే సమయంలో జస్టిస్ జేకే మహేశ్వరిని కూడా వివరణ అడిగారని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణను వివరణ అడిగారా.. లేదా అనే అంశంపై స్పష్టత రాలేదని ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ వార్తా కథనం ఆ పత్రికలో మాత్రమే వచ్చింది. తరువాత ఇతర మీడియాల్లో, వెబ్ సైట్లలో కనిపించింది.
ఇక అసలు విషయానికి వస్తే.. సాధారణ న్యాయమూర్తులపై చిన్న ఆరోపణ, ఫిర్యాదు వచ్చినా సుప్రీంకోర్టు స్పందిస్తుంది. దీనిపై అంతర్గతంగా విచారణ జరుపుతుంది. అది కామన్. వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం ఉన్నప్పుడే.. ఆ వ్యవస్థలు రాజ్యాంగాన్ని పరిరక్షించగలుతాయి. ప్రతిష్టను కాపాడుకోగలుగుతాయి. అలాంటిది ఓ రాష్ట్ర సీఎం, కొన్ని కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఉన్న వైఎస్ జగన్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో రోస్టర్ లో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తిపై ఆరోపణ చేస్తే సుప్రీం కోర్టు స్పందించకుండా ఉంటుందని అనుకోలేం. అసలు నిజమేంటో తెలసుకున్నప్పుడే విషయం బయటకు వస్తుంది.
నిన్నటి ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనంలో.. సీజేఐ జగన్ ను అఫిడవిట్ రూపంలో ఫిర్యాదును ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్టు పేర్కొంది. అది గోప్యంగా జరిగిందా.. అంత అవసరం ఉందా అనే విషయానికి వస్తే.. గత అక్టోబరులో జగన్ సుప్రీం కోర్టుకు లేఖ రాయడంకంటే దాన్ని బహిరంగ పర్చడం ఎక్కువ చర్చనీయాంశమైంది. గతంలో చాలామంది సీఎంలు, ప్రజాప్రతినిధులు వివిధ స్థాయుల్లో ఇలాంటి ఫిర్యాదులు చేసినా.. అవి కొంత గోప్యంగా ఉండేవి. ఎందుకంటే వ్యవస్థల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు సంక్షోభం తలెత్తకుండా ఉండాలంటే వాటిని సానుకూల వాతావరణంలో పరిష్కరించుకునే ఉద్దేశమే ఇందుకు కారణం. అలా కాకుండా బహిరంగంగా ఆ ఆరోపణలు జరిగితే ‘విశ్వసనీయత’కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ రాసిన లేఖ బహిరంగ పర్చడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టునుంచి నిబంధనల ప్రకారం సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్ లో అడిగి ఉండవచ్చని, ఆధారాలు ఉంటే ఇవ్వాల్సిందిగి సూచించే అవకాశం ఉంది.
ఇక ‘అఫిడవిట్’ విషయానికి వస్తే.. తాను చేసిన వ్యాఖ్యలను, తాను పేర్కొన్న అంశాలకు, తాను ఏం చెప్పాలనుకున్నానో వాటికి కట్టుబడి ఉన్నానని చట్టపరంగా సమ్మతి తెలియజేయడమే అఫిడవిట్. భవిష్యత్ కాలంలో మంచి జరిగినా, చెడు జరిగినా దాన్ని కట్టుబడి ఉండేందుకు ఆ అఫిడవిట్ ఉపయోగపడుతుంది. చట్టబద్దత వస్తుంది. ఇక అదే కథనంలో పేర్కొన్న మరో అంశం.. హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అప్పుడు ఉన్న జేకే మహేశ్వరిని వివరణ అడిగారనే అంశం. సాధారణంగానే న్యాయవ్యవస్థ పరిధిలో ఉండే వారందరూ.. సుప్రీంకోర్టు కు నిరంతర జవాబుదారి. అంటే న్యాయస్థానాల్లో జరిగే ప్రతి కార్యకలాపాల వివరాలు వివిధ స్థాయులను బట్టి సుప్రీంకోర్టుకు చేరతాయి. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఫిర్యాదులో పేర్కొన్న వివరాలను సుప్రీంకోర్టు సేకరించే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగతంలో ఈ వివరాలు అడిగారా లేదా అనేది ఎవరికీ తెలియదు. కాని జస్టిస్ జేకే మహేశ్వరి దాదాపు 300 పేజీల రూపంలో నివేదిక ఇచ్చారని ఆ కథనం చెబుతోంది.
ఇక జస్టిస్ ఎన్వీ రమణ విషయానికి వస్తే.. ఆయన సుప్రీంకోర్టులో సీనియార్టీలో రెండో స్థానంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన విషయాలు సాధారణంగా బయటకు రావు. ఈ కేసు విచారణ లో ఉన్న నేపథ్యంలో అంతకుమించి ఈ కేసులో వివరాలు వెల్లడించడం కూడా కోర్టు ధిక్కరణ గా పరిగణించే అవకాశం కూడా ఉంది. సుప్రీంకోర్టులో తీర్పులు, కేసుల వివరాల విషయంలో ప్రత్యేకంగా లీగల్ వెబ్ సైట్లు, లీగల్ మ్యాగజైన్లు ముందుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ కేసు విషయాలు ఆ ఒక్క పత్రికలోనే ఎందుకు వచ్చాయనే చర్చ నడుస్తోంది. మొత్తంమీద ఈ కథనాన్ని పరిశీలిస్తే.. ఆ కథనంలో చెబుతున్న విశ్వసనీయ వర్గాలెవరనే సందేహం కూడా వ్యక్తం అవుతోంది.
మరోవైపు ఏపీ సీఎం జగన్ రాసిన లేఖలోని ఆరోపణలకు ఆధారాలున్నాయా, ఉంటే ఎలాంటి ఆధారాలున్నాయి.. ఆయన చేసిన ఆరోపణల్లోని కేసులు తరువాతి అప్పీల్ కు వెళ్లలేదా.. వెళ్లినా నిలవలేదా.. ఇలాంటివన్నీ ఇంకా బయటకు రావాల్సిన విషయాలు. అదే సమయంలో ఆరోపణలకు ఆధారాలు ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుందని, ఆధారాల్లేకుంటే మరో రకంగా ఉంటుందనే చర్చ నడుస్తోంది.