సినిమా అనేది ఓ జూదం.. సినిమా తీస్తే చేతులు కాలతాయి.. నిర్మాత మునిగిపోతాడు.. ఇవన్నీ నిన్నటి మాటలు. సరైన సినిమా తీస్తే కోట్లు మూటగట్టుకోవచ్చు. దీనికి ఉదాహరణ హోంబాలే ఫిలింస్. ఇటీవల కాలంలో కేజీఎఫ్ సిరీస్, కాంతారా సినిమాలు సాధించిన ఘనవిజయంతో హోంబాలే ఫిలింస్ పేరు మార్మోగుతోంది.
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పుడు కన్నడంలోనే కాదు దేశ వ్యాప్తంగానూ సినిమాలు తీసేందుకు సిద్ధమవుతుందంటే ఇది ఎంత సక్సెస్ ఫుల్ వ్యాపారమో అర్థం చేసుకోవచ్చు. ఈ సంస్థ నక్క తోకను తొక్కిందనే అనుకోవాలి. అసలు ఈ సంస్థ ఎలా పుట్టింది? దీని వెనకున్న వ్యక్తులు ఎవరు? వీరికే ఎందుకు విజయాలు దక్కుతున్నాయి అనేది తెలుసుకుందాం. ఈ సంస్థకు కర్మ, కర్మ, క్రియ.. ముగ్గురు వ్యక్తులు. వారే విజయ్ కిరంగదూర్, చలువే గౌడ, కార్తిక్ గౌడ.వీరికి సినిమాలపై ఉన్న ఆసక్తే ఈ సంస్థ ఏర్పాటవడానికి కారణం. విజయ్ కిరగందూర్ దీని వ్యవస్థాపకుడు. మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను చలువే గౌడ చూస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కార్తీక్ గౌడ చూస్తున్నారు. విజయ్ కిరంగదూర్ మాండ్య నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయిన టైమ్ లో కార్తిక్ గౌడ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నారు. ఎలాగైనా చిత్ర పరిశ్రమలోకి వెళ్లాలనుకుని 2012లో ‘హోంబలే ఫిల్మ్స్’ను ప్రారంభించారు. తమ ఇష్టదేవత హోంబలమ్మ పేరుతో ఈ నిర్మాణ సంస్థకు ‘హోంబలే ఫిల్మ్స్’ అనే పేరు పెట్టారు.
తొలి ప్రయత్నంగా పునీత్ రాజ్ కుమార్ హీరోగా నిన్నిందలే చిత్రాన్ని 2014లో నిర్మించారు. దీనికి జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించారు. నిర్మాణపరమైన అనుభవం లేకపోవడంతో చేతులు కాలక తప్పలేదు. అయినా వెనకడుగు వేయలేదు. 2015లో మాస్టర్ పీస్ చిత్రాన్ని యశ్ హీరోగా నిర్మించారు. ఇది దాదాపు 35 కోట్లు వసూలు చేసింది. మళ్లీ పునీత్ వైపు వెళ్లి 2017లో రాజ్ కుమార తీశారు. ఈ సినిమా 76 కోట్లు వసూలు చేసింది. ఇక ఆ తర్వాత కోలార్ గోల్డ్ ఫీల్డ్ కథాంశంగా కేజీఎఫ్ తలపెట్టారు. ఇది దాదాపు 250 కోట్లు వసూలు చేసింది. ఒక్కసారిగా అందరి దృష్టీ హోంబాలే ఫిలింస్ వైపు పడింది. కన్నడ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అత్యధిక వసూళ్ల రికార్డులన్నీ హోంబాలే సంస్థతోనే ఉన్నాయి. తన రికార్డులను తనే తిరగరాసుకుంటోంది. కేజీఎఫ్ 2 వచ్చాక దర్శకుడిగా ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్ ల జీవితమే మారిపోయింది. ఈ సినిమా 1250 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా నివ్వెరపోయేలా చేసింది. అయినా తన తొలి హీరో పునీత్ ను మరచిపోలేదు. పునీత్ హీరోగా యువరత్న సినిమా నిర్మించింది.
పునీత్ జీవించి ఉంటే ఆయనతోనూ ఓ పాన్ ఇండియా మూవీని ఈ సంస్థ నిర్మించి ఉండేది. కేజీఎఫ్ తర్వాత యువరత్న సినిమాను తక్కువ బడ్జెట్ తో నిర్మించినట్టే, కేజీఎఫ్ 2 తర్వాత అలాంటి బడ్జెట్ తోనే కాంతార సినిమాని నిర్మించింది. ఈ సినిమా 500 కోట్ల వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది. కన్నడంలో కేజీఎఫ్ 2 సాధించిన వసూళ్లను సైతం కాంతార అధిగమించింది. ఈ సినిమా నిర్మాణ వ్యయం కేవలం 16 కోట్లు మాత్రమే. మరి సినిమా ఎంత లాభసాటి వ్యవహారమో అర్థమవుతోంది కదా. 2014 నుంచి ఇప్పటికి 14 చిత్రాల నిర్మాణం దిశగా ఈ సంస్థ అడుగులు వేసింది. ప్రభాస్ తో సలార్ ను శరవేగంగా నిర్మించే పనిలో ఉంది. ఇటు తెలుగులోనూ, అటు మలయాళ చిత్ర పరిశ్రమలోనూ ఈ సంస్థ అడుగుపెట్టింది. మలయాళంలో పృధ్వీరాజ్ సుకుమారన్ తో టైసన్ సినిమా చేస్తోంది. అలాగే ధూమం అనే మరో సినిమాని మలయాళంలో నిర్మిస్తోంది. పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్ర పోషించిన ధనుంజయ్ హీరోగా ఉత్తరాకాండ అనే సినిమా నిర్మిస్తోంది.
ఇక భగీర, రిచర్డ్ ఆంటోని ఉండనే ఉన్నాయి. సలార్ కోసం కథ, స్క్రీన్ ప్లే రాసుకుంటూనే ‘భగీరా’ టైటిల్‌తో మరో కథను సిద్ధం చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. తన బావమరిది శ్రీమురళి హీరోగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీని నిర్మాణ బాధ్యతలు కూడా హోంబాలే సంస్థే చేపట్టింది. ‘సమాజం ఎప్పుడైతే దారి తప్పుతుందో.. దాన్ని కాపాడటానికి, అదుపులో పెట్టడానికి ఒకడొస్తాడు’ అంటూ పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీతో ఈ భగీరా రూపొందుతోంది. దీనికి డైరెక్టర్ డాక్టర్ సూరి. జగ్గేష్ హీరోగా రాఘవేంద్ర స్టోర్స్ -1972 రూపొందింది. వరుస సక్సెస్ లు వస్తున్నప్పుడు ఇక వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఏముంటుంది. ఓ వైపు పాన్ ఇండియా ప్రాజెక్టులు, ఇంకో వైపు చిన్న చిత్రాల నిర్మాణంతో వ్యూహాత్మకంగా ఈ సంస్థ అడుగులు వేస్తోంది. తాము ఎలాంటి కథనైనా ప్రేక్షకుల కోణంలోనే చర్చిస్తామని, కొత్తగా ఎలా చూపించాలనే దాని మీదే కసరత్తులు చేస్తుంటామని, అదే తమ విజయరహస్యమని అంటున్నారు ఈ నిర్మాతలు. తొలి పరాజయం తమకెన్నో పాఠాలు నేర్పిందని చెబుతుంటారు. విజయ కిరగందూర్ విజయరహస్యమేంటో ఇప్పుడైనా అర్థమైంది కదూ. మున్ముందు ఇంకెన్ని అద్భుతాలను హోంబాలే సంస్థ చేయనుందో చూడాలి.