సూపర్ స్టార్ రజినీకాంత్ లైకా సంస్థతో రెండు సినిమాలు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఓ సినిమా పేరును ఈరోజు అధికారికంగా ప్రకటించారు. దీని పేరు లాల్ సలామ్. ఇందులో రజినీ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తారు. హీరోలుగా విక్రాంత్, విష్ణు విశాల్ నటిస్తున్నారు. దీనికి రజినీ కుమార్ ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. మరి రజినీతో లైకా చేయబోయే రెండో సినిమా ఏమిటన్నది చూద్దాం. దీనికి డాన్ దర్శకుడు సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు.
విక్రాంత్ తమిళంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో. ఇతను హీరో విజయ్ కి కజిన్ అవుతాడు. లాల్ సలామ్ అన్న టైటిల్ చూస్తే ఇదేదో విప్లవాత్మక సినిమాగా అనిపిస్తోంది. బహుశా అన్ని భాషలకూ సరిపోయేలా ఈ టైటిల్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉండొచ్చంటున్నారు. ప్రస్తుతం రజినీ నటిస్తున్నజైలర్ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
కళానిధి మారన్ నిర్మాత. ఇతర హీరోల మాదిరిగానే రజినీ కూడా సినిమాల స్పీడు పెంచినట్టు కనిపిస్తోంది. హిట్ పరంగా ప్రస్తుతం రజినీ వెనకబడి పోయారు. మళ్లీ ఓ మంచి హిట్ వచ్చే వరకూ రజినీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆయన వయసు కూడా 70కి చేరువలో ఉంది. ఇక నుంచి త్వరత్వరగా సినిమాలు చేస్తేనే రజినీ ఖాతాలో కొన్ని సినిమాలు చేరతాయి. ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టులతో రజినీ 171 సినిమాలు పూర్తి చేసినట్టు అవుతుంది.