వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైందా. అంటే అవుననే తెలుస్తోంది. ఈ నెలలో ఏ క్షణమైనా ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని అభిజ్ఞవర్గాల సమాచారం. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి…జనవరిలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఏ రాజకీయ పార్టీలో చేరబోనని, ఇకపై వ్యవసాయంపై దృష్టి పెడతానని ప్రకటించారు.
ఐతే అనూహ్యంగా ఆయన వైఖరిలో మార్పు కనిపించింది. కొద్ది రోజులుగా మారుతున్న రాజకీయ పరిణామాలు, విజయసాయి ప్రసంగాలు ఆయన బీజేపీ వైపు వెళ్లబోతున్నారని సూచిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖర్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో విజయసాయి పాల్గొనడం, మోదీ ప్రభుత్వ విధానాలకు మద్దతు ఇస్తూ చేస్తున్న ట్వీట్లు, బహిరంగ ప్రకటనలు విజయసాయి బీజేపీలో చేరతారన్న ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. తన రాజకీయ భవిష్యత్తుపై విజయసాయి ఇప్పటికే బీజేపీ నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
విజయసాయి రాజీనామా చేసిన సమయంలోనే బీజేపీ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఆ సమయంలో క్రియాశీలక రాజకీయాలకుదూరంగా ఉండాలని ఆయన భావించారు. వెంటనే బీజేపీలో చేరడం సరికాదని వెనక్కి తగ్గారు. ఇందువల్లే ఆయన బీజేపీలో చేరడం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఐతే పొలిటికల్ గ్యాప్ మంచిది కాదని సాయిరెడ్డికి సన్నిహితులు సలహా ఇచ్చినట్లు సమాచారం. ఎక్కువ రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటే పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని విజయసాయికి చెప్పినట్లు సమాచారం.
వారం, పది రోజుల్లో సాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఈసీ ఉపఎన్నిక నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకటనకు ముందై సాయిరెడ్డి బీజేపీలో చేరతారని తెలుస్తోంది. దీంతో తిరిగి ఆ పార్టీ ద్వారా రాజ్యసభకు ఎన్నికవ్వాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో బీజేపీలో సాయిరెడ్డి చేరిక ఉండొచ్చని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.