తమిళ దళపతి విజయ్ నటిస్తున్న 65వ చిత్రంలో ఓ మలయాళ నటుడు కీలక పాత్ర పోషించబోతున్నాడు. అతను మరెవరో కాదు షైన్ టామ్ చాకో. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి నటన వైపు దృష్టి మళ్లించాడు. విజయ్ హీరోగా నెల్సన్ దీలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో షైన్ టామ్ చాకో ఓ ప్రత్యేక పాత్రను పోషించబోతున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
ఏ ఏడాది జనవరిలో విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్రం విడుదలైంది. మరో తమిళ హీరో విజయ్ సేతుపలి విలన్ గా నటించాడు. ఇందులో ఇద్దరూ ఢీ అంటే ఢీ అనేలా తలపడినా ఆశించిన ఫలితాన్ని మాత్రం సినిమా ఇవ్వలేకపోయింది. బిజినెస్ పరంగా చూస్తే మంచి వసూళ్లే సాధించింది. తమిళంలో విజయవంతమైనా అనువాద చిత్రం మాత్రం అంతగా సక్సెస్ కాలేదు. ఆ సినిమా తర్వాత విజయ్ సన్ పిక్చర్స్ కు డేట్స్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.
వచ్చే ఏడాది పొంగల్ కు దీన్ని విడుదల చేయాలన్న సంకల్పంతో షూటింగ్ చేస్తున్నారు. కాకపోతే సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ ఇంతవరకూ రాలేదు. మరో పక్క కరోనా ప్రభావం కూడా షూటింగ్ పై పడుతోంది. విజయ్ తో పూజా హెగ్డే జతకట్టడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. మరి ఈ కాంబినేషన్ కు తమిళంలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో షైన్ టామ్ చాకో విలన్ గా కనిపించవచ్చన్నది సమాచారం.