కరోనా వ్యాక్సిన్ త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తోందన్న అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఉదయం ప్రారంభంలో రికార్డు స్థాయికి చేరిన సెన్సెక్స్ మధ్యాహ్నానికి కొంత ఒడిదుడుకులకు లోనైంది. చివరకు సెన్సెక్స్ 316 పాయింట్లు పెరిగి 43,593 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 118 పాయింట్లు ఎగసి, 12,749 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, ఫార్మా, వాహన, తయారీ, ఉక్కు రంగాలు లాభాల్లో దూసుకోపోయాయి. టాటా స్టీల్, హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్, రెడ్డీ ల్యాబ్స్, ఐటీసీ షేర్లు లాభాలార్జించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, హిందూస్థాన్ యూనీలీవర్, హెచ్.డి.ఎఫ్.సి కంపెనీల షేర్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి.
ఊతమిచ్చిన ప్రోత్సాహకాలు
కేంద్ర ప్రభుత్వం పది రంగాలకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ముఖ్యంగా వాహన తయారీ, వాహన విడిభాగాలు, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు లక్షా 46 వేల కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి తాజాగా క్యాబినెట్ ఆమోదించింది. దీంతో స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. కేంద్రం తాజాగా ప్రకటించిన ప్రోత్సాహకాలు అందుకోవాలంటే గుర్తించిన పదిరంగాలకు చెందిన కంపెనీలు అదనపు ఉత్పత్తి చేయడంతోపాటు, ఆ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ఇలా ఉత్పత్తిని పెంచి దేశంలో ఉద్యోగ కల్పనకు బాటలు వేయడంతోపాటు, జీఎస్టీ ఆదాయం కూడా గణనీయంగా పెంచుకోవాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతం లభించనట్టయింది.