బన్నీ .. సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. ఇటీవలే మారేడుమిల్లి .. రంపచోడవరం పరిధిలోని ఫారెస్టులో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. మరో షెడ్యూల్ షూటింగును కూడా అక్కడ ప్లాన్ చేశారు. ఆ షెడ్యూల్లో ఒక చిత్రమైన ఫైట్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఫైట్ కోసం బన్నీ శిక్షణ తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. చాలా సిన్సియర్ గా ఆయన ఆ యాక్షన్ సీన్ కి సంబంధించిన ఫైట్ పై కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు.
అడవుల్లో తోడేళ్లు వేటాడే తీరు చిత్రంగా ఉంటుంది. అవి మాటువేసి దాడి చేసే పద్ధతి చాలా కొత్తగా ఉంటుంది. ఆ తరహా పద్ధతిలో దాడి చేసే వాడిగా ఒక యాక్షన్ ఎపిసోడ్ లో బన్నీ కనిపించనున్నట్టు చెబుతున్నారు. ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నడుస్తుంది. ఎర్రచందనం చెట్లు కొట్టేవారిపై అదను చూసుకుని అధికారులు విరుచుకుపడుతుంటారు. అప్పుడు స్మగ్లర్లు తప్పించుకునే పద్ధతి .. అవసరమైతే తిరిగి దాడి చేసే పద్ధతి డిఫరెంట్ గా ఉంటుంది. అలా ‘పుష్ప’ పాత్రలో బన్నీ దాడి చేయనున్నాడన్న మాట.
ఇటీవల కాలంలో కథాకథనాల విషయంలో మాదిరిగానే ఫైట్స్ కంపోజ్ చేసే విధానంలోను మార్పులు వస్తున్నాయి. ఫైట్స్ లోను సాధ్యమైనంతవరకూ కొత్తదనాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నారు. అలా ‘పుష్ప’ సినిమాలో తోడేలు ఫైట్ ను హైలైట్ గా నిలపనున్నారు. దట్టమైన అడవిలో .. రాత్రి నేపథ్యంలో తోడేలు మాదిరిగా దాడి చేసే యాక్షన్ ఎపిసోడ్లో బన్నీ ఒక రేంజ్ లో రెచ్చిపోనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమా చూసిన వారు ఈ ఫైట్ గురించి చాలారోజుల వరకూ చెప్పుకునేలా ఉంటుందని అంటున్నారు. గిరిజన యువతిగా రష్మిక పాత్ర కూడా అందంగా .. ఆకట్టుకునేలా ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి ఒక్కో అంశంతో ఈ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచేస్తున్నారు.