కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇంటిపై సీబీఐ రైడ్ చేసింది. డీకే శివకుమార్ ఇళ్లు, కార్యాలయాలపై ఈ ఉదయం సీబీఐ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఇదే సమయంలో డీకే శివకుమార్ సోదరుడు ఎంపీ డీకే సురేశ్‌కు చెందిన కర్ణాటక, ముంబైలలోని కార్యాలయాల్లో కూడా ఈ ఉదయం అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 14 చోట్ల ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆదాయపు పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివకుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతంలో మూడు కేసులు నమోదు చేసింది. 2019 సెప్టెంబర్ లో డీకే శివకుమార్ మనీలాండరింగ్, పన్ను ఎగవేత కేసులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్ మీద ఆయన బయట ఉన్నారు.
కాంగ్రెస్ కు అండగా డీకే
కాంగ్రెస్ పార్టీకి ‘ట్రబుల్ షూటర్’ గా డీకే శివకుమార్ వ్యవహరించే సంగతి తెలిసిందే. జేడీఎస్-కాంగ్రెస్ కూటమి విచ్చిన్నం కాకుండా క్యాంపు రాజకీయాలను సమర్థవంతంగా నిర్వహించడంతో డీకే అందరి దృష్టిని ఆకర్శించారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం డీకేకు కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ కూడా డీకే మూలాలపై ద్రుష్టి సారించిందని ఆరోపణలు వినబడ్డాయి. యడియూరప్ప సీఎం పదవి చేపట్టగానే డీకేపై మనీలాండరింగ్, పన్ను ఎగవేత కేసులో వరుస దాడులు జరిగాయి. జైలు నుంచి బయటికి వచ్చిన తరువాత డీకేని పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. చాలా మంది ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీని వీడటంతో కర్ణాటకలో కాంగ్రెస్ బలహీన పడింది. ఈ నేపథ్యంలో డీకే కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారం లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నికలపై డీకే ద్రుష్టి సారించారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన మునిరత్న ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజినామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని డీకే ప్రణాళికలు సిద్ధం చేశారు. సరైన అభ్యర్థి కోసం అన్వేషణలో ఉన్న డీకేకి దివంగత ఐఎఎస్ సురేష్ సతీమణి కనబడ్డారు. కొద్దీ రోజుల కిందట సురేష్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయన మరణానికి కాంగ్రెస్ కారణమంటూ అప్పట్లో విమర్శలు వినబడ్డాయి. ఆ తరువాత ఆత్మహత్య వెనుక ప్రేమకోణం వెలుగులోకి రావడంతో ఈ విమర్శలు ఆగిపోయాయి. ‘వక్కలిగ’ కులం వారు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో అదే కమ్యూనిటీకి చెందిన ఐఎఎస్ సతీమణిని డీకే రంగంలోకి దింపనున్నారు.
డీకేపై బీజేపీ నజర్
తమకు పెద్ద అడ్డంకిగా ఉన్న డీకేపై బీజేపీ ద్రుష్టి సారించింది. ఇప్పటికే ఆదాయపు పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివకుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతంలో మూడు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల వెనుక బీజేపీ హస్తం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. తాజాగా ఆర్ఆర్ నగర్ ఎన్నికల నేపథ్యంలో డీకే వేగానికి చెక్ పెట్టేందుకు మరోమారు ఆయనపై సీబీఐని ప్రయోగించారని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. సీబీఐ దాడుల విషయం తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ఎన్నికల ముందు తమను దెబ్బకొట్టేందుకు బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మోదీ, యడియూరప్ప ద్వయం కావాలనే కుట్రతో ఈ దాడులు చేయించిందని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.











