( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ సర్క్యూట్ హౌస్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఆదివారం రాత్రి అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. అయితే, తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు , ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ,ఎమ్మెల్యే నాగిరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి ( నాని), సీపీఎం విశాఖ నగర ప్రధాన కార్యదర్శి గంగరామ్, ఏపీ మహిళ సమాఖ్య ప్రధాన కార్యదర్శి విమల , కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు శంకర్రావు, స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్లు.. ఐ యన్ టి యూ సి ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్, ఏ ఐ టి యూ సి ప్రధాన కార్యదర్శి డి. ఆదినారాయణ, వై యస్ ఆర్ టి యూ సి ప్రధాన కార్యదర్శి వై.మస్తానప్ప, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి అయోధ్య రామ్ ఇంకా కార్మిక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన ప్రతిపక్షం లేకేండానే..
ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ లేకుండానే అఖిలపక్షం పేరిట వైఎస్సార్సీపి హడావుడి చేస్తోంది. ప్రజా ప్రయోజనాల కన్నా.. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనే రీతిలో వ్యవహరిస్తున్నారు. సూర్యోదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ జపం తప్ప అధికార పార్టీకి మరో వ్యాపకం లేకుండా పోయింది. ఎందరో త్యాగధనుల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కును కాపాడుకోవడంలో చిత్తశుద్ధి కన్నా.. తమ పార్టీకే మైలేజీ రావాలని, ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీని చులకన చేయాలని జిమ్మిక్కులు చేస్తోంది తప్ప .. సమస్య పరిష్కారానికి పోరాడుతున్నట్లు కనిపించడం లేదు. అధికార పార్టీ ఊహించని రీతిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించడంతో వైఎస్సార్ సీపీ ఆత్మరక్షణలో పడింది. మరోవైపు జాతీయ పార్టీ బీజేపీ కూడా దూకుడు పెంచేందుకు ప్రయత్నిస్తోంది.
ఉదయం నుంచి రెండు సార్లు సమావేశం..
మంత్రి ముత్తంశెట్టి ఆదివారం రెండుసార్లు వామపక్షాలు, ఆ పార్టీ నేతలు, ట్రేడ్ యూనియన్ నాయకులతో సమావేశాలు నిర్వహించి మీడియా సమావేశాలు పెట్టి మరీ ఆంధ్రుల హక్కు కాపాడుకుంటామని స్టేట్ మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎన్నికల వేళ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం హాట్ టాపిక్‌గా మారడంతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు రకరకాల ఫీట్లు చేస్తున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎడాపెడా ప్రెస్మీట్లు పెట్టి ఇది మనోభావాలకు సంబంధించిన అంశమని, కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ట్రేడ్ యూనియన్లు కలిసినా..
తమ సంస్థను కాపాడుకోవాలనే చిత్తశుద్ధి ఉండడంతో ప్లాంట్‌లో సేవలందిస్తున్న ట్రేడ్ యూనియన్లు జేఏసీగా ఏర్పడి ఉమ్మడి పోరు సాగిస్తున్నాయి. అదే రాజకీయ పక్షాల విషయానికి వస్తే… మూడు ప్రధాన పార్టీలు తలోదారి ప్రయాణిస్తున్నాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీజేపీ నాయకులు వేరువేరుగా ప్రెస్మీట్లు పెట్టి తాము ప్రజల పక్షాన పోరాడతామని హామీలు గుప్పిస్తున్నారు. విశాఖ ప్రజల సెంటిమెంట్ అయిన స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటామని బీరాలు పలుకుతున్నారు. ఇతర పార్టీల కన్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తలచుకుంటే ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది. వారికి మద్దతుగా ప్రధాన ప్రతిపక్షంతో పాటు, లెఫ్ట్ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుంటూ పోతే… కేంద్రం మెడలు విరిచేలా భారీ ఉద్యమాన్ని నిర్మించవచ్చు. గంటా శ్రీనివాసరావు అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కొద్ది గంటలకే… మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రంగంలోకి దిగి, ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగా సమావేశాలు నిర్వహించారు. అందరినీ కలుపుకొని పోవాల్సిన వేళ.. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టారు. దీంతో వీరికి సమస్య పరిష్కారం కన్నా రాజకీయ ప్రయోజనాలే ఎక్కువని రుజువు చేశారు.
సమావేశంలో మంత్రి ఏం చెప్పారంటే..
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు.
రాజీనామాలు చేయబోమని చెప్పేసారు..
తెలుగుదేశం పార్టీ రాజీనామా అస్త్రం ప్రయోగించడంతో… అది తమ మెడకు ఎక్కడ బిగుసుకుంటుందో అన్న భయం అధికార పార్టీ నేతల్లో మొదలైంది. ప్రజల నుంచి ఒత్తిడి ఎదురు కాకమునుపే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మంత్రి చేశారు.“ ఎంపీ గా ఉంటే ప్రధానిని కలవొచ్చు, ఉన్నతాధికారులను కలవొచ్చు. కాబట్టి పదవిలో ఉండే పోరాడాలి” అని సెలవిచ్చారు. మరి సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో, ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం గుర్తుకు రాలేదు అనుకుంటా..! అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామాల కోసం ఎందుకు డిమాండ్ చేసేవారో మంత్రి కాస్త వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసే కన్నా.. పదవుల్లో వుండి పోరాడితేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి… ఎంపీలు పదవుల్లో కొనసాగడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ అధికార పార్టీ రాజీనామాల ఊసే లేకుండా.. లక్ష్యం చేరుకోవాలని, అందుకోసం రోజువారి పోరాటాలు చేయాలని పిలుపునిస్తోంది.
Also Read: గంటాకు కలిసిరాని కాలం











