2004లో నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభమై.. కేవలం రెండు సీన్స్ మాత్రమే చిత్రీకరణ జరుపుకున్న పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’. సౌందర్య మరణంతో అర్ధాంతరంగా ఆగిపోయిన ఈ చిత్రానికి సంబంధించిన 17 నిమిషాల సీన్స్ ను విజయదశమి కానుకగా.. నేడు శ్రేయాస్ ఈటీలో బాలయ్య పే ఫర్ వ్యూ పద్ధతిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఎలా ఉంది? దీని కథాకమామీషు ఏంటో రివ్యూలో చూద్దాం.
కథేంటి? : ‘నేడు దశమి.. విజయదశమి.. ఈనాడు ఏ కార్యం ప్రారంభించినా విజయం చేకూరుతుంది’ అన్న ఎన్టీఆర్ డైలాగుతో ‘నర్తనశాల’ సినిమా ప్రారంభమవుతుంది. పన్నెండేళ్లు అరణ్యవాసం పూర్తి చేసుకున్న పాండు కుమారులు ఇంకో ఏడాది అజ్ఞాతవాసం చేస్తే చాలు. ఆ తర్వాత పట్టాభిషేకమే. ఈ ఏడాది ఎక్కడ ఉండాలి? ఎవరెవరు ఏయే వేషాలు వేయాలి? అనే రెండు సన్నివేశాలతోనే సినిమా ముగిసిపోతుంది. తాము ఎక్కడ ఉన్నారో దుర్యోధనాదులకు తెలియకూడదు. తాము క్షేమంగా ఉండాలంటే విరాట రాజు దగ్గర తప్ప మరో మార్గం లేదని వారు నిర్ణయించుకునే వరకే ఈ కథ సాగుతుంది. ఇందులో ఓ ఉప కథను కూడా చూపించారు. అందులోనే మన నందమూరి తారక రామారావు కనిపిస్తారు.
ఎలా తీశారు? ఎలా చేశారు? : విరాటరాజు కొలువులో ఎవరు ఏ వేషధారణలో ఉండాలన్నచర్చ సాగుతుంది. తాము సురక్షితంగా ఉండాలంటే మత్స్య దేశం తప్ప మరో మార్గం లేదంటాడు ధర్మరాజు. అలా విరాట రాజు కొలువులో ఎవరెవరు ఏ వేషం వేయాలోనని చర్చిస్తారు. చివరికి నకుల, సహదేవులు అశ్వ, పశు సంరక్షకులుగా తామగ్రంథి, తంత్రీపాలుడు అనే పేర్లతో ఉంటామని చెబుతారు. తను జూదక్రీడలో నిష్ణాతుడు కనుక దాన్ని అస్త్రంగా ఉపయోగించి కంకుభట్టు పేరుతో ధర్మరాజు ఉంటానంటాడు.
ద్రౌపది.. మాలిని పేరుతో దాసిగా జీవిస్తాననడంతో భీముడు ఆగ్రహోదగ్రుడవుతాడు. ద్రౌపది శాంతింపజేయడంతో వలలుడు అనే పేరుతో విరాటరాజు కొలువులో వంటవాడిగా చేరుతానని భీముడు అంటాడు. అర్జునుడు బృహన్నల వేషం వేస్తానంటాడు. ఇంతవరకు కథ నడిచింది. కనీసం కీచకుడిగానైనా బాలయ్యను చూస్తామని అభిమానులు ఆశించారు. కాకపోతే ఇందులో రెండే రెండు సీన్లు ఉంటాయని బాలయ్య ముందే చెప్పారు కాబట్టి దీని గురించి కూడా పెద్దగా ప్రస్తావించడం అనవసరం.
ఎన్టీఆర్ ఎక్కడ వస్తారు?
అర్జునుడు తన ఓ విషయం కోసం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లే సన్నివేశంలో నందమూరి తారకరాముడి దర్శన భాగ్యం కలిగింది. ఊర్వశి శాపాన్ని ప్రస్తావించాల్సి వచ్చినపుడు ఈ సన్నివేశాన్ని తీసుకున్నారు. ఇంద్రుడి సభలో అర్జునుడిగా ఎన్టీఆర్ ఉండగా ఊర్వశి పాట, అనంతరం అర్జునుడు, ఊర్వశిల మధ్య సన్నివేశాన్ని చూపించారు.
అప్పటి ఊర్వశి శాపం అజ్ఞాతవాసకాలంలో తనకు ఎలా వరంగా మారనుందనే సన్నివేశానికి లీడ్‌గా తీసుకుని విరాటుడి కొలువులో బృహన్నల పేరుతో అంతఃపుర కాంతలకు నాట్యం, సంగీతం నేర్పాలనుకుంటున్నట్లు అర్జునుడు చెబుతాడు. ఇందులోనే బాలయ్య నటించిన ‘టాప్ హీరో’ సినిమాలోని ఒకపాటలో బాలయ్య బృహన్నల లాగా నర్తించే భాగాన్ని వాడుకున్నారు. దానికోసం ఆ సినిమా సభ్యులకు కృతజ్ఙతలు కూడా సినిమా ప్రారంభంలోనే తెలిపారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటూ బాలయ్య ఈ సినిమాని ముగించారు.
హైలైట్స్ : ఎవరికీ నటనకు ఏమంత అవకాశం రాలేదు. ఒక్క భీముడిగా మాత్రం శ్రీహరి తనదైన శైలిని కనబరిచాడు. సౌందర్య, శ్రీహరిలను ఇప్పుడు తెరపై చూడడం మళ్లీ కొత్త అనుభూతిని ఇస్తుంది. వినోద్ యాజమాన్య నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. అలాగే 16 ఏళ్ళక్రితం తీసిన సినిమాకి ఇప్పటి హంగులు సమకూర్చడం వల్లనో ఏమో గానీ ఉన్న రెండు సీన్లూ ఫర్వాలేదనిపించుకున్నాయి. అలాగే.. బాలయ్య తన పాత్రకు రీసెంట్ గా డబ్బింగ్ చెప్పినట్టు మనకు అర్ధమవుతుంది. ఇక శ్రీహరి పాత్రకు వేరే వారిచేత డబ్బింగ్ చెప్పించినట్టు క్లియర్ గా తెలుస్తోంది.
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, సౌందర్య, శరత్ బాబు, శ్రీహరి, తదితరులు
సంగీతం : వినోద్ యాజమాన్య
కథ, నిర్మాణం, దర్శకత్వం : నందమూరి బాలకృష్ణ
ఎక్కడ చూడాలి? : శ్రేయాస్ ఈటీ
విడుదలతేదీ : 24-10-2020
ఒక్కమాటలో : మంచి ప్రయత్నమే.. కానీ
రేటింగ్ : 3/5
-హేమసుందర్ పామర్తి