రజనీకాంత్ ఒకప్పుడు సీనియర్ స్టార్ దర్శకులతోనే వరుస సినిమాలు చేసేవారు. ఇటీవల కాలంలో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. యువ దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తూ వెళుతున్నారు. అలా రజనీకాంత్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్న దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ కనిపిస్తాడు. రజనీ కథానాయకుడిగా ఆయన రూపొందించిన ‘పేట్ట’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా సెంటర్లలో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో రజనీని ఆయన చూపించిన తీరుకు అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.
ఇప్పుడు ఇక రాజకీయాలవైపు వెళ్లే ఆలోచన లేని కారణంగా రజనీకాంత్ సినిమాలపైనే పూర్తి దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే ఆయన కార్తీక్ సుబ్బరాజ్ కి మరో ఛాన్స్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఇటీవల రజనీకాంత్ ను కలిసిన కార్తీక్ సుబ్బరాజ్, ఆయనకి ఒక కథను వినిపించాడట. ఆ కథ కొత్తగా ఉండటంతో వెంటనే రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. రజనీ ఇంతవరకూ టచ్ చేయని పాయింట్ తో ఈ కథ రూపొందుతుందని అంటున్నారు. రజనీ లుక్ కూడా పూర్తి డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు.
ప్రస్తుతం రజనీ కాంత్ .. శివ దర్శకత్వంలో ‘అన్నాత్త’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొంతవరకూ జరిగింది. ఆ తరువాత యూనిట్ సభ్యులలో కొందరికి కరోనా రావడంతో ఆపేశారు. మళ్లీ ఈ సినిమాను షూటింగును మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక కార్తీక్ సుబ్బరాజ్ తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి ‘జగమే తందిరం’ ముస్తాబవుతోంది. ధనుశ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన జోడీగా ఐశ్వర్య లక్ష్మి కనిపించనుంది. ఈ సినిమా విడుదల తరువాత రజనీతో కార్తీక్ సుబ్బరాజ్ సినిమా పట్టాలెక్కుతుంది. గతంలో కబాలి తర్వాత వెంటనే కాలా సినిమా ఛాన్స్ ను కూడా దర్శకుడు పా.రంజిత్ కు రజినీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పేట్ట సినిమా తర్వాత కార్తిక్ సుబ్బరాజ్ కు కూడా రజినీ మరో అవకాశమివ్వడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. మరి కార్తిక్ సుబ్బరాజ్ .. రెండో అవకాశాన్ని కూడా మొదటిది లాగానే .. సద్వినియోగం చేసు కుంటాడేమో చూడాలి.