ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ తదితర సివిల్ సర్వెంట్లతో పాటు ఇతర ఏ ఒక్క ఉద్యోగికి కూడా రక్షణే లేకుండా పోయిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాటి కాంగ్రెస్ సర్కారులో జరిగిన నిర్వాకాల కారణంగా తన బ్యాచ్ లోనే టాపర్‌గా నిలిచిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి నెలల తరబడి జైల్లో మగ్గిపోవాల్సి వచ్చింది. సరే… ఎలాగోలా ఆ కేసు నుంచి బయటపడి జైలు నుంచి విడుదలై… ఇటీవలే జగన్ సర్కారులోనే కీలక పోస్టులో కుదురుకుందనుకుంటున్నతరుణంలో ఇంకో లేడీ ఐఏఎస్‌ను జైలుకు పంపే దిశగా జగన్ సర్కారు వేగంగా పావులు కదుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ హయాంలోనే కాకుండా చాలా ఏళ్లుగా పాలనలో తనదైన శైలి ముద్రతో సత్తా కలిగిన అధికారిణిగా గుర్తింపు తెచ్చుకున్న సదరు అధికారిణి… జగన్ సర్కారు వైఖరితో దినదినగండంగా బతుకు వెళ్లదీస్తున్న పరిస్థితిపై ఇప్పుడు అధికారిక వర్గాల్లో ఓ పెద్ద చర్చే నడుస్తోంది.

పోస్టింగ్‌లకే వన్నె తెచ్చిన అధికారిణి
సివిల్ సర్వెంట్‌గా ఎన్నికైన నాటి నుంచి ఏ పదవిని అప్పగించినా… తనదైన శైలిలో పనిచేస్తూ సాగిన సదరు అధికారిణి ఆయా పోస్టింగ్‌లకే వన్నె తీసుకువచ్చారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇటు టీడీపీ ప్రభుత్వం ఉన్నా కూడా ఆమెకు కీలక పోస్టింగులే దక్కుతూ వచ్చాయి. ఆశ్రిత పక్షపాతం, ఏ పార్టీకి కొమ్ము కాయని వైనం, నిష్పాక్షిక నిర్ణయాలతో ముందుకు సాగిన నేపథ్యంలోనే ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా సదరు అధికారిణి పెద్దగా ఇబ్బంది పడలేదనే చెప్పాలి. అంతేకాకుండా అవినీతికి ఆమడ దూరంలో ఉండే సదరు అధికారిణి అంటే… క్షేత్రస్థాయి సిబ్బందికి కూడా హడలే. అయితే ఇటీవల తాను కొనసాగిన ఓ పోస్టులో ఉన్న సమయంలో పారిశ్రామిక సంస్థలకు ఇచ్చే రాయితీలు, వాటికి అనుమతుల విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయట. దీనిపై విచారణ కూడా జరిగినా… ఏవో చిన్న పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే గానీ… ఆమె తప్పేమీ పెద్దగా కనిపించలేదంటూ తేలిందట. ఈ నివేదికను అందుకున్న జగన్ సర్కారు… సదరు అధికారి క్రెడిబిలిటీని మరోమారు పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారాన్ని దాదాపుగా మూసేసిన కలరింగ్ ఇచ్చేసింది. ప్రస్తుతం సదరు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న పోస్టు నుంచి చాలా కాలం క్రితమే వేరే శాఖకు మారిపోయిన సదరు అధికారిణి ఎంచక్కా పనులు చేసుకుంటూ పోతున్నారు.
కేసు నమోదుకు సీఐడీకి ఆదేశాలు?
ఈ కేసు విషయంపై వచ్చిన నివేదికను ప్రభుత్వం పక్కన పెట్టేసిందన్న విషయం తెలుసుకున్న ఆ లేడీ ఐఏఎస్… ఆ విషయాన్నే మరిచిపోయారు. అయితే, ఈలోగానే ఏమైందో, ఏమో తెలియదు గానీ.. సదరు నివేదికకు జగన్ సర్కారు బూజు దులిపిందట. నివేదికలో పేర్కొన్న అక్రమాలన్నీ సదరు అధికారిణి కారణంగానే చోటుచేసుకున్నాయని, ఆమెపై కేసు నమోదు చేయాలంటూ సీఐడీకి దాదాపుగా ఆదేశాలు జారీ చేసిందట. ఇదే వ్యవహారంపై గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఊటంకిస్తూ సర్కారు జారీ చేసిన ఆదేశాలతో సదరు అధికారిణిపై కేసు నమోదు చేసేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారట. ఇదే జరిగితే… వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జగన్ అండ్ కో వైపరీత్యాల కారణంగా జైలుకెళ్లి నానా కష్టాలు పడి ఇటీవలే తిరిగి సర్వీసులోకి వచ్చిన శ్రీలక్ష్మి కళ్ల ముందే… జగన్ జమానాలో మరో లేడీ ఐఏఎస్ జైలుకెళ్లక తప్పదా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. మరి ఈ వ్యవహారంలో జగన్ సర్కారు సదరు అధికారిణిపై కేవలం కేసు నమోదు వరకే పరిమితం అవుతుందా? లేదంటే శ్రీలక్ష్మి మాదిరే ఈమెను జైలుకు పంపిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.











