రష్మికను చూడగానే వెన్నెల్లో వెన్నముద్దలా కనిపిస్తుంది .. ఆవుపాల నురగలా అనిపిస్తుంది. కళ్లు చిట్లించి ఆమె నవ్వే నవ్వుకు కుర్రాళ్లంత మనసులన్నీ అప్పగించేశారు. అభిమానులుగా అంగీకరించమంటూ ఆమె చూపుల వాకిలిలో అలాగే కూర్చుండిపోయారు. యూత్ లో ఇంతగా క్రేజ్ ను సంపాదించుకున్న ఈ అమ్మాయి, అదృష్టానికి దత్తపుత్రికలా దూసుకుపోతోంది. వరుస విజయాలు ఈ సుందరిని వెతుక్కుంటూ వెళుతున్నాయి. హిట్ కోసం వెయిట్ చేసేవాళ్లు, దానికంటే ముందుగా రష్మిక డేట్ల కోసం వెయిట్ చేయవలసిన పరిస్థితి ఉంది.
ప్రస్తుతం ఈ అమ్మాయి ‘పుష్ప’ సినిమా చేస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, బన్నీ సరసన నాయికగా ఆమె అలరించనుంది. ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ కి చెందినవాడిగా బన్నీ కనిపించనుండగా, అడవిలోని ఒక గిరిజన గూడానికి చెందిన యువతిగా రష్మిక కనిపించనుంది. తాజాగా ఆమె ‘పుష్ప’ సినిమాను గురించి మాట్లాడుతూ, “దట్టమైన అడవిలో ఈ సినిమా షూటింగు ఉదయాన్నే 5 గంటలకు మొదలయ్యేది. అలా మొదలైన షూటింగు రాత్రి 7 గంటలవరకూ జరిగేది.
ఇక నా పాత్ర విషయానికొస్తే, నా మేకప్ కోసం రెండు గంటలకి పైగా సమయం పట్టేది. గురిజన యువతి పాత్ర వేషధారణలో అచ్చు అలాగే కనిపించడం కోసం అంతగా కేర్ తీసుకున్నారు. రోజంతా కష్టపడిన తరువాత చివరికి ఫైనల్ అవుట్ పుట్ చూసుకుని ఆ కష్టాన్ని మరిచిపోయేవాళ్లం. అడవిలో షూటింగు చేయడం కష్టమే అయినప్పటికీ, అక్కడ గడిపిన రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సినిమా తప్పకుండా నా కెరియర్లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది ” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా తరువాత ఈ పిల్ల ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ చేయనున్న సంగతి తెలిసిందే.











