కరోనా ఉదృతితో దేశంలో మార్చి 24 నుంచి లాక్ డౌన్ ను విధించారు. అన్నీ రంగాలు మూతపడటంతో ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో దేశ ప్రజల ఆర్థిక చేయూత కోసం ఆర్బీఐ మారటోరియాన్ని విధించింది. దీని ద్వారా రుణాలకు సంబంధించి రుణ గ్రహీతలకు వెసులుబాటు లభిస్తోంది. ముందుగా మూడు నెలల పాటు లోన్ మారటోరియం ప్రకటించిన ఆర్బీఐ ఆ తరువాత కూడా మరో మూడు నెలలు పొడిగించింది. మొత్తం మీద ఆరు నెలలు పాటు రుణ గ్రహీతలకు వెసులుబాటు ఇస్తూ ఆర్బీఐ ఇచ్చిన గడువు ఆగస్ట్ 31తో పూర్తయింది. దీంతో బ్యాంకులు రుణాలను తిరిగి వసూలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసాయి. ఈ నేపథ్యంలో మారటోరియాన్ని పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పీటీషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు తమ స్పందనను తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అటర్నీ జనరల్ విరుద్ధ వాదనలు
ప్రభుత్వం తరుపున అటర్నీ జనరల్ వేణుగోపాల్ తమ వాదనలను వినిపించారు. మారటోరియం కాలాన్ని రెండేళ్లపాటు పొడిగించే అవకాశమున్నదని ఆయన కోర్టుకు తెలిపారు. దీంతో రుణగ్రహీతలు మారటోరియాన్ని పొడిగిస్తారని ఆశగా ఎదురుచూశారు. కానీ బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఆర్థిక నిపుణులు మారటోరియం కాలాన్ని పొడిగిస్తే దేశంలో బ్యాంకింగ్ రంగం కుంటుపడుతుందని హెచ్చరించారు. రుణాలు కట్టే స్థోమత ఉన్న వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని డీఫాల్టర్ గా మారుతారని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో వెనుకకి తగ్గిన కేంద్రం బ్యాంకులకు నష్టం కలిగించే నిర్ణయం కేంద్రం తీసుకోబోదని కోర్టుకు తెలిపారు.
అయితే ఈ ఆరు నెలల కాలంలో మారటోరియాన్ని వాడుకున్న వారిపై వడ్డీ విధింపు అన్యాయమంటూ ఉన్నత న్యాయస్థానంలో మరో పీటీషన్ దాఖలైంది. దీంతో వడ్డీపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు మారటోరియం వినియోగించుకున్న రుణాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బ్యాంకులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో మారటోరియంపై కేంద్రం, ఆర్బీఐ విధానాలను సమగ్రంగా తెలపాలని కోర్ట్ ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 28కి వాయిదా వేసింది.
సొలిసిటర్ జనరల్ వాదన
ఇవాళ జరిగిన విచారణకు ప్రభుత్వ తరుపు వాదనలను వినిపించేందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. మారటోరియం ప్రణాళికను అందించేందుకు తమకు మరికొంత సమయం కావాలని తుషార్ మెహతా కోరారు. కొన్ని అంశాలు తన నియంత్రణలో లేవని తెలిపిన సొలిసిటర్ జనరల్ ప్రస్తుతం కేంద్రం, ఆర్బీఐ ఈ అంశంపై చర్చలు జరుపుతుందని తెలిపారు. మరికొంత సమయం ఇస్తే చర్చలలో పూర్తి స్పష్టత వస్తుందని ఆయన కోర్టుకు తెలిపారు. సొలిసిటర్ జనరల్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఈ కేసును వచ్చే నెల 5కు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు మారటోరియం వినియోగించుకున్న రుణాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బ్యాంకులకు తాము ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీం స్పష్టం చేసింది.
మారిటోరియాన్ని వినియోగించుకున్న రుణగ్రహీతలు కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో బ్యాంకులు కూడా ఈ అంశంపై ఏదో ఒకటి తేల్చాలని కోరుకుంటున్నారు.