ఒకే ఒక్క సినిమాతో స్టార్‌గా ఎదిగిన నటుడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైన ఈ హీరో.. అర్జున్‌రెడ్డితో యూత్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసి అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. గీతగోవిందంతో మరో భారీ హిట్ కొట్టిన విజయ్.. ఈ సినిమాతో అటు యూత్‌ని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఒకేసారి సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఒకట్రెండు సినిమాలు నిరాశపరచినా తన మార్క్‌ను, మార్కెట్‌ను చేజారనీయకుండా పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు అప్‌కమింగ్ డైరెక్టర్లతోనే పని చేసిన విజయ్.. ఇప్పడు ఇద్దరు స్టార్ డైరెక్టర్ల సినిమాలతో మన ముందుకు రాబోతున్నాడు. పూరీ జగన్నాథ్‌తో సినిమా.. షూటింగ్ దశలో ఉండగా.. జీనియస్ డైరెక్టర్ సుకుమార్‌తో క్రేజీ కాంబోను ఇవాళ అనౌన్స్ చేశాడు విజయ్.
ఓవర్ నైట్ స్టార్‌గా..
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం తదితర సినిమాల్లో చిన్నాచితకా రోల్స్‌లో కనిపించిన విజయ్‌కి.. విజయం అంత ఈజీగా రాలేదు. సోలో హీరోగా పెళ్లిచూపులు సినిమాను ప్రారంభించినా నిర్మాణ సమయంలో ఎన్నో కష్టాలు. అంతా యంగ్ టీమ్ కావడంతో ఛాలెంజింగ్‌గా తీసుకుని సినిమాను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. మంచి టాక్ వచ్చినా హీరో కంటే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కే ఎక్కువ పేరొచ్చింది.
అర్జున్‌రెడ్డితో యూత్ ఐకాన్‌గా..
మరో యంగ్ డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి.. టాలీవుడ్‌కు కొత్త అర్ధం చెప్పింది. రా కంటెంట్ ఉండడంతో రిలీజ్‌కు ముందే కాంట్రవర్సీగా కేరాఫ్‌గా మారిందీ సినిమా. ఒక విధంగా ఇదే సినిమాపై హైప్‌ను రెట్టింపు చేసింది. సినిమా రిలీజ్ రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ నటనకు యూత్ ఫిదా అయిపోయారు. సినిమాలోని సెంటర్ పాయింట్.. యూత్‌కు బాగా కనెక్ట్ అవడంతో ఎన్నో రికార్డులను తిరగరాసింది. విజయ్‌కి ఇన్‌స్టెంట్ క్రేజ్‌తోపాటు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
చెక్కు చెదరని ఇమేజ్..
మహానటి మూవీలో విజయ్ సైడ్ రోల్‌లో కనిపించినా మంచి మర్కులే పడ్డాయి. వెనువెంటనే రిలీజైన గీతగోవిందంతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్. నోటా, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు గీతగోవిందం ఫలితాన్ని రిపీట్ చేయకపోయినా విజయ్ ఫ్యాన్స్‌కి సంతృప్తిని మిగిల్చాయి. ఈ క్రమంలో ఆచితూచి అడుగులు వేస్తున్న విజయ్.. ఇద్దరు భారీ డైరెక్టర్ల సినిమాల్లో ఛాన్స్ కొట్టేశాడు.
పూరీతో పవర్‌ఫుల్ మూవీ..
అల్లు అరవింద్ వంటి ప్రెస్టీజియస్ ప్రొడ్యూసర్లతో చేసినా.. ఇప్పటి వరకు స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో విజయ్ దేవరకొండకు అవకాశం రాలేదు. ఆ లోటును తాను తీరుస్తానంటూ ముందుకొచ్చాడు పవర్‌ఫుల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఘన విజయంతో ఫుల్ ఫామ్‌లో ఉన్న పూరీ.. తన ట్రేడ్ మార్క్ స్టోరీలో విజయ్‌ను కొత్తగా చూపిస్తాడనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో కొత్త విజయ్ దేవరకొండను చూస్తారంటూ ఇప్పటికే ఈ రౌడీ హీరో ప్రకటించడంతో ఇండస్ట్రీ హిట్ ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
సుకుమార్‌తో క్రేజీ కాంబో..
పూరీతో మూవీ తర్వాత మరో క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. జీనియన్ డైరెక్టర్ సుకుమార్‌తో వర్క్ చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు. 2022లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు విజయ్ పేర్కొన్నాడు. ఇప్పటికే తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్.. పూరీ, సుకుమార్ సినిమాలతో టాప్ లీగ్‌లో చేరడం ఖాయమన్నది సినీ విశ్లేషకుల మాట.
హీరోయిజంలో ఇద్దరూ ఇద్దరే..
పూరీ జగన్నాథ్, సుకుమార్.. హీరోలను తెరపై కొత్తగా ప్రజెంట్ చేయడంలో వీరిద్దరూ మాస్టర్స్. సాధారణ స్టోరీలనే వీరిద్దరూ డీల్ చేసే విధానం విభిన్నం. ఇప్పుడు వీరిద్దరూ విజయ్‌ను ఎలా చూపించబోతున్నారోనని అప్పుడే ఫ్యాన్స్ ఊహాగానాలు మొదలు పెట్టేశారు.