కాస్త తీపి.. కాస్త చేదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో మంగళవారం నాడు ఎదురైన అనుభవాలు ఇవి. జగన్ రాసిన లేఖ మీద దాఖలైన పిటిషన్లలో ఇలాంటి తీర్పులు వచ్చాయి. జగన్ ను సీఎంగా తొలగించాలని, ఆయనతోపాటు, లేఖను బహిర్గతం చేసిన ఆయన సలహాదారు అజేయకల్లం మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరిన పిటిషన్లను సుప్రీం కొట్టేసింది. సీఎం జగన్ సుప్రీంకోర్టు జడ్జిపై వ్యాఖ్యలు చేయరాదన్న పిటిషన్ ను మాత్రం మరో పిటిషన్ కు జతచేసి విచారణ కొనసాగిస్తామని సుప్రీం న్యాయమూర్తులు పేర్కొన్నారు.
ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ లు వేసిన పిటిషన్‌ను, యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సునీల్ కుమార్ సింగ్ వేసిన పిటిషన్ ను ఏపీ ప్రభుత్వం వేసిన మరొక పిటిషన్‌కి జత చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం, దాన్ని బహిర్గతం చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్, సునీల్ కుమార్ సింగ్ సహా యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఈ పిటిషన్లను దాఖలు చేశాయి. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దిమేష్ మహేశ్వరి, జస్టిస్ హ్రిషికేశ్ రాయ్ లు ఉన్న త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
సీఎం జగన్ లేఖ రాసి, విడుదల చేయడం వెనక దురుద్దేశ్యం ఉన్నందున చర్యలు తీసుకోవాలని. జగన్ లేఖపై కాలపరిమితితో అంతర్గత విచారణ చేయాలని జిఎస్ మణి తన పిటిషన్లో కోరారు. సీఎం జగన్ చర్యలు స్వతంత్ర న్యాయవ్యవస్థకు ముప్పు అని జిఎస్ మణి తెలిపారు. పిటిషనర్ అభ్యర్థనలు రెండూ గందరగోళంగా ఉన్నాయని జస్టిస్ కౌల్ వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఏపీ సీఎంగా జగన్ ను తొలగించాలని- వ్యక్తిగత ప్రయోజానాల కోసం సీఎం పదవికి అపకీర్తి తెస్తూ న్యాయమూర్తిపై బహిరంగంగా నిరాధార ఆరోపణలు చేశారని జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ లు.. ఆరోపించారు. న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాసి,బహిర్గతం చేసిన ఏపీ సీఎం జగన్, సలహాదారుపై చర్యలు తీసుకోవాలని యాంటీ కరేప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ పిటిషన్లో కోరింది. ఈ రెండింటినీ సుప్రీం కొట్టేసింది. అపవాదు వేసేలా లేఖ రాసి దాన్ని బహిర్గతం చేశాక విచారణ జరపాల్సిన అవసరం ఏంటని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు. అమరావతి భూముల అంశంలో ఇప్పటికే గ్యాగ్ ఆర్డర్ ను సుప్రీంకోర్టు ఎత్తి వేసిందని జస్టిస్ కౌల్ గుర్తు చేశారు.
సీఎం జగన్ సుప్రీంకోర్టు జడ్జిపై వ్యాఖ్యలు చేయరాదన్న సునీల్ కుమార్ పిటిషన్ ను మాత్రం వేరే పిటిషన్ తో జత చేస్తామని జస్టిస్ కౌల్ చెప్పారు. న్యాయస్థానాలపై భవిష్యత్ లో ఇలాంటి ప్రకటనలు చేయకుండా ప్రతివాదిపై చర్యలు తీసుకోవాలని సునీల్ కుమార్ సింగ్ కోరారు. ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పేందుకు సీఎం జగన్ కు షోకాజు నోటీసులు ఇవ్వాలని కూడా కోరారు.











