టిడ్కో ఇళ్లపై చర్చ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలకు వేదికైంది. 300 చదరపు అడుగుల వరకు ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న ఇళ్లు మేం అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇస్తామని అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాలకొల్లు ఎన్నికల ప్రచార సభలో చేసిన ప్రసంగాన్ని సభలో పలుమార్లు వీడియో వేసి చూపించారు. వైసీపీ అధినేత ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజ్ఙప్తి చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును మెంటల్ హాస్పటల్ లో చేర్పించాలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి.
ఇంతకీ ఉచితంగా ఇస్తామని చెప్పలేదు
టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సభలో మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఒక్కో మంత్రి టిడ్కో ఇళ్లపై ఒక్కో రకంగా గణాంకాలు చెప్పడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అసహనానికి గురయ్యారు.











