పేరు గొప్ప ఊరు దిబ్బా అన్నట్లుగా ఉంది హైదరాబాద్ పరిస్థితి. పేరుకేమో అభివృద్దిలో ప్రపంచస్థాయి నగరం. ఓటు వేసే విషయంలో మాత్రం వెనుకడుగు వేసే నగరం. ప్రపంచ స్థాయిగా పేరున్న హైదరాబాద్ నగరంలో నివసించేవారు.. అందులోనూ అక్కడ ఓటు హక్కును కలిగిఉండే వారు ఇంకెంత చైతన్యవంతంగా ఉండాలి?. హైదరాబాదీల చైతన్యం కేవలం మాటల్లోనేనా? అని అంతా అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నించే హైదరాబాదీలు ఇళ్ల నుంచి వచ్చి పోలింగ్‌లో ఎందుకు పాల్గొనడంలేదనే ప్రశ్న తలెత్తుతుంది. పోలింగ్ డే అంటే ఇక హాలిడే అనే మూడ్‌లోనే ఉంటున్నారా? ఇదే అవకాశమని ఓటింగ్ వేయడానికి పోలింగ్ కేంద్రాలకు రాకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారా? లేకుంటే కుటుంబ సభ్యులతో కలిసి నగర సరిహద్దులు దాటి వెళ్లిపోయి ఎంచక్కా ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేస్తున్నారా? ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోలింగ్‌కు హైదరాబాదీలు ఎందుకు దూరంగా ఉంటున్నారని ఓటు హక్కును వినియోగించుకున్న సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు.
నిరాశనా.. బద్ధకమా?
ఓటు వేస్తే ఎంతా.. వేయకుంటే ఎంతా.. అనే ఆలోచనలో ఉన్నట్లుగా హైదరాబాదీ ఓటర్లు కనబడుతున్నారు. లేకుంటే ఏమ్ వేస్తాములే ఓటు.. అనే నైరాశ్యంలో ఉన్నారా?. మనం ఓటు వేయడం ద్వారా వ్యవస్థలో మార్పు రాదనుకుని నిస్పృహలో ఉన్నారా? అన్నట్లుగా నగర ఓటరు పరిస్థితి కనబడుతున్నది. అసలెందుకు హైదరాదీ ఓటరు ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. బద్ధకంతో ఇళ్లల్లోనే బందీగా ఎందుకు మారుతున్నారనే అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమస్యలపై ప్రశ్నించే సాఫ్ట్‌వేర్ హైదరాబాదీ.. అదే ఎన్నికలను తన సోషల్ రెస్పాన్సిబులిటీగా తీసుకుని ఎందుకు పోలింగ్ కేంద్రానికి రావడంలేదో అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది.
ఓటు వేయరు కానీ అభివృద్ధి కావాలి..
నగర ఓటరు ఓటు వేయరు కానీ తమకు అభివృద్ది మాత్రం కావాలంటారు. హైదరాబాద్‌లో ఉన్నన్నీ సౌకర్యాలు పల్లెల్లో ఉండవు. మరీ అలాంటిదీ పల్లెల్లో 70 శాతం నుంచి 97 శాతం వరకు పోలింగ్ శాతం నమోదవుతుంది. ఓటు వేయని హైదరాబాద్‌ను కాదు.. ఓటు వేసే పల్లెల్ని అభివృద్ధి చేయండని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనా మధ్యాహ్నం 3గంటల వరకు 25.3 శాతమే పోలింగ్ జరిగింది. వంద శాతం పోలింగ్ జరగాలంటే ఇంకా 75 శాతం పోలింగ్ మిగిలిన మూడు గంటల్లో జరగాల్సి ఉంటుంది. దాదాపు 74 లక్షల నగర ఓటర్లలో ఇంకా సంగం మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం. ఇప్పుడే కాదు 2009, 2016 ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం 50 శాతం కూడా దాటలేదు. ఈ సారి పోలింగ్ 40 శాతం కూడా దాటుతుందో లేదో చూడాలి మరి.
కచ్చితంగా వేసేలా చర్యలవసరం…
పోలింగ్ రోజు ఐటీ, ఇతర కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు సెలవు ప్రకటించడమే కాకుండా వారు కచ్చితంగా ఓటు వేసేలా యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు ఓటు వేస్తున్నారు గానీ యువత, ఉద్యోగస్తులు మాత్రం ఓటు వేయడానికి బద్ధకిస్తున్నారు. బస్తీవాసులు, మధ్యతరగతి ఓటర్లు, రోజూవారి కూలీ పనులు చేసుకునే వారు మాత్రమే ఓటు హక్కును వినియోగించడానికి ముందుకు వస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకునే వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ జనం నుంచి వస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు కాదు.. పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటును వేయండని అంటున్నారు. ఓటు వేయకపోవడం నేరంగా భావించాలని, పేదవాడి ట్యాక్స్‌తో బతుకుతున్న బడాబాబులు ఓటు వేయకపోవడంపై సమాధానం చెప్పాలని చెప్తున్నారు. మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయండి.. లేదా నోటాకు వేయండి.. కానీ ఓటు మాత్రం కచ్చితంగా ఓటు వేయాలని పలువురు పేర్కొంటున్నారు.
కరోనాతో ఓటింగ్‌కు దూరమా?…
పార్టీలు, సెలబ్రెటీలు ఎంత ప్రచారం చేసినా ఓటు వేయడానికి జనం పోలింగ్ కేంద్రాలకు రావడంలేదు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు లేక సిబ్బంది నిద్రిస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమైందంటెనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శని,ఆదివారాలు రావడం, సోమవారం గురునానక్ జయంతి సెలవుదినం, మంగళవారం పోలింగ్ హాలిడే ఉండడంతో సిటీ జనం పోలింగ్ డేను జాలీడేగా గడిపేందుకు ఊళ్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. అందులోనూ కరోనా వ్యాప్తి భయంతోనూ ఓటర్లు ఓటు వేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికల అధికారులు పోలింగ్‌ను నిర్వహిస్తున్నప్పటికినీ ఓటు వేసేందుకు నగర జనం ఆసక్తిచూపకపోవడం గమనార్హం. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఉపయోగించకుండా వృథా చేసుకోవడం కచ్చితంగా ఇది గమనించాల్సిన విషయమే.











